అసోం నుంచి ఆస్ట్రేలియా దాకా.. వరద బీభత్సం!

ABN , First Publish Date - 2022-07-07T08:31:38+05:30 IST

అసోం నుంచి ఆస్ట్రేలియా దాకా.. హిమాచల్‌ నుంచి దక్షిణ కొరియా దాకా.. పలు నగరాలను వరుణుడు ముంచెత్తాడు.

అసోం నుంచి ఆస్ట్రేలియా దాకా.. వరద బీభత్సం!

నిరాశ్రయులైన లక్షల మంది.. అసోంలో కొనసాగుతున్న వరద ప్రభావం

హిమాచల్‌లో ఏడుగురి మృతి.. కులులో మరో ఆరుగురి గల్లంతు

ఆస్ట్రేలియాలో లా-లినాతో భారీ వర్షాలు.. నిరాశ్రయులైన 85 వేల మంది!


న్యూఢిల్లీ, జూలై 6: అసోం నుంచి ఆస్ట్రేలియా దాకా.. హిమాచల్‌ నుంచి దక్షిణ కొరియా దాకా.. పలు నగరాలను వరుణుడు ముంచెత్తాడు. జల విలయానికి లో తట్టు, తీరప్రాంతాల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోయారు. భారత్‌లో నదుల విషయం లో మానవ తప్పిదాలు.. ఆస్ట్రేలియాలో ప్రకృతి ఆగ్రహంతో ఏర్పడ్డ లానినా మేఘాల కారణంగా వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. అసోంలో గత నెల నుంచి వరద కొనసాగుతుండగా.. దీని వెనక మానవ కారణం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ‘ఫ్లడ్‌ జిహాద్‌’ పేరుతో మితూ హుస్సేన్‌ లష్కర్‌, కాబూల్‌ ఖాన్‌ మార్చి నెలలో ఉద్దేశపూర్వకంగా చచార్‌ జిల్లాలో బరాక్‌ నది ఆనకట్టలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. దీని వల్ల లక్ష మంది నిరాశ్రయులయ్యారని వివరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామని తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు రోజులుగా వరద కొనసాగుతోంది. బుధవారం ఏడు మరణాలు సంభవించాయని, ఆరుగురు గల్లంతయ్యారని రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ డైరెక్టర్‌ సుదేశ్‌ మోఖ్త వెల్లడించారు. కులు జిల్లాలో ముగ్గురు, మణికరన్‌ జిల్లాలో మరో నలుగురు మృతిచెందారని.. కులు జిల్లా చల్లాల్‌ పంచాయత్‌ పరిధిలోని ఛోఝ్‌ గ్రామంలో పార్వతి నదిపై ఉన్న బ్రిడ్జి దెబ్బతిని.. వరద ఉధృతికి ఆరుగురు కొట్టుకుపోయారని వివరించారు. వారిలో ఇద్దరిని కాపాడామని, మిగతా నలుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. లార్జే, పందోహ్‌ డ్యామ్‌ల గేట్లను ఎత్తివేశామని చెప్పారు. ముంబైలో వరద ఉధృతి నేపథ్యంలో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. 


ఆస్ట్రేలియాలో.. 85 వేల మందిపై ప్రభావం 

ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఒక్క న్యూసౌత్‌ వేల్స్‌ నగరంలో ఆరు గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక్కడ గత మూడు రోజుల్లో 70 సెం.మీ. వర్షం కురిసింది. సిడ్నీ శివార్లపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ఏడాది ఇది మూడో అతిపెద్ద వరద అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హాక్స్‌బరి-నెపియన్‌ నది వరద తీవ్రంగా ఉందన్నారు. ఈ నదికి ఉపనది అయిన వరగాంబపై నిర్మించిన డ్యామ్‌ వరదలను అడ్డుకోలేకపోతోందని, ఫలితంగా 18 నెలల్లో వచ్చిన నాలుగు వరదల్లో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని వివరించారు.


ఉత్తర కొరియా చెలగాటం

ఉత్తర-దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉన్న ఇమ్జిన్‌ నది డ్యామ్‌ విషయంలో కిమ్‌ సర్కారు చెలగాటమాడుతోంది. దక్షిణ కొరియాకు సమాచారం ఇవ్వకుండా.. హఠాత్తుగా డ్యామ్‌ గేట్లు ఎత్తేస్తోంది. ఇలా సోమవారం  గేట్లు ఎత్తడంతో.. దక్షిణ కొరియాలో నీటిమట్టాలు పెరిగాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 2019లోనూ ఇలాగే జరగగా.. దక్షిణ కొరియా వాసులు ఆరుగురు చనిపోయారు.

Updated Date - 2022-07-07T08:31:38+05:30 IST