భువనగిరి గుట్ట నుంచి ఎవరెస్ట్‌ దాకా!

ABN , First Publish Date - 2022-05-21T07:16:19+05:30 IST

‘‘ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఖచ్చితంగా ఎక్కాలనుకున్నా. మే 16 ఉదయం తొమ్మిదిన్నరకు ఎవరెస్టు ఎక్కేశా. దేశంలోనే ఎత్తయిన శిఖరం(8848.86 మీటర్లు)నుంచి కిందికి చూస్తే మతిపోయింది.

భువనగిరి గుట్ట నుంచి ఎవరెస్ట్‌ దాకా!

ఓ పత్రికా కథనం.. ఆమెను ఆలోచింపచేసింది. ‘ఆడపిల్లకు అంత కష్టం ఎందుకు?’అని కొందరు 

నొసలు చిట్లించినా పట్టించుకోలేదు. రాక్‌ క్లయింబింగ్‌లో కఠోర శిక్షణ తీసుకుంది. ‘నువ్వు ఈ పని చేయగలవా? ఇది నీకు అవసరమా?’ అన్నారు. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్ల మధ్య పట్టుదలతో ఇటీవలే ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకున్న ఆ సాహసి పేరు పడమటి అన్వితా రెడ్డి.  ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఈ తెలంగాణ బిడ్డ ‘నవ్య’తో ఆ ప్రయాణ అనుభవాల్ని పంచుకుందిలా...


‘‘ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఖచ్చితంగా ఎక్కాలనుకున్నా. మే 16 ఉదయం తొమ్మిదిన్నరకు ఎవరెస్టు ఎక్కేశా. దేశంలోనే ఎత్తయిన శిఖరం(8848.86 మీటర్లు)నుంచి కిందికి చూస్తే మతిపోయింది. ఒకవైపు నేపాల్‌, మరో వైపు చైనా భూభాగం కనిపించింది. అదో అద్భుతమైన దృశ్యం. ఆ దృశ్యాన్ని బంధించటానికి స్మార్ట్‌ఫోను మెగా పిక్సల్స్‌ సరిపోవు. ఆ అనుభూతికి..మాటలు దొరకవు. ఆ జ్ఞాపకం సజీవం. అసలు నేనేనా? ఈ ఫీట్‌ను సాధించిందని.. గిల్లుకున్నా. ఆకాశం చూసి గట్టిగా అరిచా. వెంటనే వాకీలో అక్కడ ఉండే గైడ్‌తో ‘సక్సె్‌సఫుల్‌గా పూర్తిచేశా.. శేఖర్‌ సర్‌కి తెలియ చేయండ’ని చెప్పా. నా ఆరేళ్ల కల ఫలించిన క్షణాన.. ఆనందానికి ఆకాశమే హద్దు.. సాక్షి కూడా! 


ఆ సందేహం ఉండేది..

ఎవరెస్టును డైరెక్టుగా అధిరోహించటం కష్టం. ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి. ఏప్రిల్‌ మూడో వారంలో బేస్‌క్యాంప్‌ నుంచి క్యాంప్‌-2 వరకూ వెళ్లి మళ్లీ వెనక్కొచ్చేశా. శరీరం ఆ వాతావరణానికి అలవాటుపడింది. వారంపాటు విశ్రాంతి తీసుకున్నాక ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమయ్యా. సూర్యుడు వస్తే మంచు కరుగుతుంది కాబట్టి అర్ధరాత్రి దాటాకే ఎవరెస్ట్‌ ఎక్కాలి. మేం బేస్‌క్యాంప్‌ నుంచి మే13 అర్థరాత్రి రెండుగంటలకు బయలుదేరి.. సాయంత్రం ఐదున్నరకు క్యాంప్‌-1 చేరుకున్నా. ఒక్కసారి పైకి చూస్తూనే.. ఇంత పెద్ద పర్వతాన్ని ఎక్కగలనా? అనుకున్నా. అప్పటికే సిక్కింలో ఆరువేల మీటర్లు ఎక్కిన అనుభవం ఉంది. మైనస్‌ డిగ్రీల చలి, పర్వత గాలి చూసిన అలవాటు నాది. అయినప్పటికీ ఎక్కడో సందేహం ఉండేది.. అసలు శరీరం ఎనిమిది వేల మీటర్లు దాటిన తర్వాత తట్టుకుంటుందా?అని. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. 


అదో ఉద్విగ్న ప్రయాణం.. 

 నాతో వచ్చిన మౌంటెనీర్‌ క్యాంప్‌-2 నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఇద్దరు షెర్బాలతో(సపోర్టర్లు, గైడ్స్‌) కలిసి ప్రయాణం సాగించా. సాధారణంగా పైకి వెళ్లేకొద్దీ భుజాలు, కాళ్లు నొప్పులొస్తాయి. నాకెలాంటి సమస్యలు రాలేదు. భువనగిరి గుట్టమీద చేసిన కఠోరశిక్షణ వల్లనే ఆ ఫిట్‌నెస్‌. ఎత్తు ఎక్కే కొద్దీ శ్వాస తీసుకోవటం కష్టం. అయితే లద్దాఖ్‌లో బ్రీతింగ్‌ కోసం తీసుకున్న శిక్షణ ఉపయోగపడింది. ప్రమాదకరమైన నీలంరంగులో ఉండే మంచుబండల్ని దాటి వెళ్లటం కష్టం. వాటివల్ల కళ్లు కనిపించకపోవడం, చర్మం మొద్దుబారి పోవడం.. లాంటి సమస్యలొస్తాయి. ప్రమాదకరమైన ప్రాంతాలను షెర్బాలు ముందే చెప్పారు. ఐదువేల మీటర్లు ఎక్కాక చెట్టూ, పురుగూ కనిపించదు. అర్ధరాత్రిపూట.. నిర్మలమైన ఆకాశం పట్టుకోవచ్చా? తాకితే సరిపోతుంది కదా? అనిపిస్తుంది. చంద్రుడి కాంతిపడి ఎవరెస్టు తెల్లగా, అందంగా కనిపించింది. భయమేసింది. నడక మాత్రం కష్టంగా అనిపించింది. అదో ఉద్విగ్న ప్రయాణం! 


మాటల్లో చెప్పలేని అనుభూతి.. 

రెడీమేడ్‌ మ్యాగీ, ఎనర్జీ చాక్లెట్స్‌, మంచును వేడి చేసి నీళ్లు తాగడమే.. ఆహారం. ఇక క్యాంప్‌4 నుంచి సమ్మిట్‌ మధ్యలో ప్రాంతాన్ని ‘బాల్కనీ’ అంటారు. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. ఆ ఆరున్నర గంటల మధ్య అనుభవించిన ఫీలింగ్‌ వేరే లెవల్‌. ఐదు పర్వతాలెక్కిన అనుభవం ఉపయోగపడిందక్కడ. ఒంటరితనం వల్ల ఆలోచనల తుఫాను చుట్టుముట్టింది. దారింట ప్రమాదకరమైన క్రాక్స్‌ దాటుకుని వెళ్తుంటే.. రోప్‌తో ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు. దిగేవాళ్లు దిగుతున్నారు. 8000 మీటర్లు దాటాక శవాలు కనిపించాయి. తాజాగా ఉన్నాయవి. ‘ఇలాంటివన్నీ దారింట డిస్టర్బ్‌ చేస్తాయి. అడుగులు వేయటం మానకు’ అన్న గురువు మాటలు మనోధైర్యం నింపాయి. కళ్లముందే సమ్మిట్‌ కనిపించింది. అయితే ఎంత నడిచినా దూరమే అనిపించింది. మొత్తానికి క్యాంప్‌-4 నుంచి శిఖరాన్ని చేరటానికి 13 గంటలు పట్టింది. మే16 ఉదయం 9.30 గంటలకు సమ్మిట్‌ పూర్తయ్యింది. ఎవరెస్ట్‌ ఎక్కిన క్షణాన పక్కన పర్వతాలన్నీ చిన్నగా కనిపించాయి. జీవితం చిన్నదనిపించింది. ఆ క్షణాలను వీడియో తీశా. దానికంటే ముందు నా కళ్లతో చూసిన ఆ దృశ్యం వెంటాడుతోంది. అది లైఫ్‌టైమ్‌ ఫీలింగ్‌. మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇక శిఖరం ఎక్కేటప్పుడు కంటే దిగి ఇంటికి రావటానికి అదృష్టం ఉండాలి. 


అదే నా కల! 

 నేను ఎమ్‌.బీ.ఏ చదివా. ఇప్పటి వరకూ రెనాక్‌, బిసి రాయ్‌, కదే పీక్‌, కిలిమంజారో, ఎల్‌బ్రూస్‌ పర్వతాలు ఎక్కా. ఆరోది ఎవరెస్ట్‌. నేపాల్‌లో ఎవరె్‌స్టపర్వతాన్ని సాదర్‌మాతా అంటారు. ఆమెను దర్శించుకోవానికి వెళ్లినట్లే ఫీలయ్యా. అమ్మను కలిసినట్లే అనుకున్నా. అలా ప్రతి పర్వతంను ఓ అమ్మగా, ఓ దేవతలా చూస్తా.  గురువు శేఖర్‌బాపుగారికి ‘ట్రాన్స్‌సెండ్‌ అడ్వెంచర్స్‌’ సంస్థ ఉంది. ఆ సంస్థ ఇప్పటి వరకూ 97 మందిని ఎవరెస్టు ఎక్కించింది. అందులో నేనొకదాన్ని కావటం గర్వకారణం. ఏడు కాంటినెంట్స్‌లో ఉండే ఏడు పర్వతాల అంచులు తాకాలి. ఇదే నా కల. 

రాళ్లపల్లి రాజావలి


మాది భువనగిరి. నాన్న రైతు. పేరు మధుసూధన్‌ రెడ్డి. అమ్మ చంద్రకళ అంగన్‌వాడీలో పని చేస్తుంది. అక్క ఆస్ర్టేలియాలో ఎమ్‌.ఎస్‌ చదువుతోంది. భచెనేపల్లి శేఖర్‌ బాపు.. నా గురువు, గైడ్‌. ప్రతి వీకెండ్‌లో భువనగిరి కోటలో ఉండే ఏకశిల (650 మీటర్లు నుంచి 700 మీటర్లు) దగ్గర కఠినమైన శిక్షణ తీసుకోవటం, ఆ ఫిట్‌నెస్‌ ఎంతో ఉపయోగపడింది. 


న ఆలోచనలు ప్లిలల మీద రుద్దకుండా.. వారి ఆసక్తిని ప్రోత్సహించాలి. చిన్నప్పటినుంచీ చురుకైనది అన్విత. కొండలెక్కుతానంటే.. నేనే భయపడేదాన్ని. ‘ఏం కాదమ్మా!’ అనేది.  మా కూతురు ఎవరెస్టు ఎక్కడం గర్వకారణం. తన మనోబలమే ఇంతటి స్థాయికి చేర్చింది.     

   - పడమటి చంద్రకళ 


నా పేరు వల్లే! 

పర్వతారోహకులకు స్పాన్సర్‌షిప్‌ లేకుంటే కష్టం. వందమందిని అడిగితే ఇరవైమంది స్పందిస్తారు. మొదట్లో పేరెంట్స్‌ డబ్బులు పెట్టేవారు. ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి నాకు ‘అన్వితా గ్రూప్‌’ స్పాన్సర్‌ చేశారు. దీనికో కారణం ఉంది. ఆ కంపెనీ ఎం.డి.అచ్యుతరావు బొప్పన కుమార్తె పేరు కూడా నా పేరే. దాంతో కేవలం పదిహేను రోజులు ముందే చెప్పినా ఎటువంటి ప్రశ్నలు వేయకుండా.. అవసరమైన సాయం చేశారు. అన్వితా గ్రూప్‌ సపోర్టుగా నిలవకపోతే 24ఏళ్ల వయసులో ఎవరెస్టు ఎక్కేదాన్ని కాదు. ఇంకా పదేళ్లు పట్టేది. ఆ సంస్థకు రుణపడి ఉన్నా.

Updated Date - 2022-05-21T07:16:19+05:30 IST