జ్యువెలరీ నుంచి జ్యూట్‌ వైపు...

ABN , First Publish Date - 2022-01-23T05:30:00+05:30 IST

జ్యూట్‌ ఉత్పత్తులకు మార్కెట్లో కొదవ లేదు. కానీ కొన్న కొద్ది రోజులకే వన్నె తగ్గి, వెలిసి పోయేవే ఎక్కువ.

జ్యువెలరీ నుంచి జ్యూట్‌ వైపు...

కొత్తగా, విభిన్నంగా ఉండే ఉత్పత్తులకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. నేను డిజైన్‌ చేసే ఉత్పత్తుల్లో నాణ్యతకే 

పెద్ద పీట వేస్తాను. ఉత్పత్తుల తయారీ విషయంలో నేనెక్కడా రాజీ పడను. 

జ్యూట్‌ ఉత్పత్తులకు మార్కెట్లో కొదవ లేదు. కానీ కొన్న కొద్ది రోజులకే వన్నె తగ్గి, వెలిసి పోయేవే ఎక్కువ. అలాంటి జ్యూట్‌ ఉత్పత్తులను వినూత్నమైన డిజైన్లలో, విభిన్నమైన మెటీరియల్స్‌తో నాణ్యతగా తయారుచేస్తూ, వాటికి కొత్త వైభవాన్ని అందిస్తోంది హైదరాబాద్‌కు చెందిన ఎన్‌.అపూర్వ. జ్యువెలరీ డిజైనింగ్‌ నుంచి జ్యూట్‌ డిజైనింగ్‌ వైపు సాగిన తన ప్రయాణం గురించి ఆమె నవ్యతో పంచుకున్న విశేషాలు...జ్యూట్‌ ఉత్పత్తులు అనగానే, బ్యాగులే కళ్ల ముందు మెదులుతాయి. ఆ మెటీరియల్‌తో అంతకు మించి భిన్నమైన ఉత్పత్తులు ఎందుకు తయారుచేయకూడదు? జ్యూట్‌కు కొత్త హంగులు జోడించి, సరికొత్త డిజైన్లలో ఎందుకు రూపొందించకూడదు? ఈ ఆలోచన నుంచి జ్యూట్‌ డిజైనింగ్‌ పుట్టుకొచ్చింది. నేను స్వతహాగా జ్యువెలరీ డిజైనర్‌ను. జైపూర్‌లో పర్ల్‌ ఆకాడమీలో డిజైనింగ్‌ డిప్లొమా పూర్తి చేసి, అక్కడే ఒక యుకె బేస్‌డ్‌ కంపెనీలో 2016 నుంచి 2018 వరకూ రెండేళ్ల పాటు జ్యువెలరీ డిజైనర్‌గా పని చేశాను. తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్‌ తిరిగొచ్చాను. డిజైనింగ్‌ గురించిన అవగాహన ఉంటే, ఏ ముడి సరుకుతోనైనా అద్భుతాలు సృష్టించవచ్చు. అలా నా ఆసక్తి జ్యువెలరీ నుంచి జ్యూట్‌ వైపు మళ్లింది.


డిజైనింగ్‌ నుంచి తయారీ వైపు...

మార్కెట్లో బోలెడన్ని జ్యూట్‌ ఉత్పత్తులు ఉన్నాయి. వాటిలో సాధారణ లంచ్‌ బ్యాగులు, పౌచ్‌లు, వాటర్‌ బాటిల్‌ బ్యాగులే తప్ప ఒక్క డిజైనర్‌ ప్రొడక్ట్‌ కూడా నాకు కనిపించలేదు. దాంతో జ్యూట్‌తో నాదైన శైలిలో బ్యాగులు తయారుచేయాలని సంకల్పించాను. వేర్వేరు మెటీరియల్స్‌కు జ్యూట్‌ను జోడించి, డిజైన్లు తయారుచేసుకుని టైలర్లను కలిశాను. వాళ్లు నేను చెప్పిన డిజైన్‌లో కాకుండా అంతకు ముందు నుంచీ ఉన్న సంప్రదాయ పద్ధతిలోనే ప్రొడక్ట్‌ తయారు చేసి అందించారు. నా మనసులో ఉన్నది, వాళ్లకు అర్థం కావడం లేదనీ, పాత పద్ధతికే వాళ్లు అలవాటు పడిపోయారనీ అప్పుడు నాకు అర్థమైంది. దాంతో డిజైనింగ్‌తో పాటు తయారీ కూడా నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. 


మూడు విభాగాల్లో...

జ్యూట్‌ ఉత్పత్తులను తయారు చేయాలంటే కుట్టు మిషన్‌ ఉపయోగించడం తెలిసి ఉండాలి. కానీ నాకు ఆ మిషన్‌ పట్ల అవగాహన లేదు. ఈ విషయంలో నాకు అమ్మ కందుల లక్ష్మి సహాయపడిందని చెప్పాలి. ఇంజనీర్‌ అయిన అమ్మ కాలక్షేపం కోసం కుట్టు మిషన్‌ వాడుతూ ఉండేది. అలా నేను డిజైన్‌ వివరిస్తే, అమ్మ కుట్టేది. అలా బ్లౌజులు కుట్టే కుట్టు విధానాన్నే వీటికీ అనుసరించాం. అలా టేబుల్‌ మ్యాట్స్‌, టేబుల్‌ రన్నర్స్‌తో డిజైనింగ్‌ మొదలుపెట్టి, క్రమేపీ విస్తృతిని పెంచాం. ప్రస్తుతం నేను మూడు విభాగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. రిటైల్‌ క్యాటగిరీలో భాగంగా డిజైనర్‌ హ్యాండ్‌ బ్యాగ్స్‌, కలంకారీ, బెనారస్‌ ప్యాచ్‌ వర్క్‌తో కూడిన కుషన్‌ కవర్లు, లెదర్‌ జోడించిన హ్యాండ్‌ బ్యాగులు, వాలెట్స్‌, హ్యాండ్‌ పెయింటెడ్‌  కుషన్‌ కవర్లు తయారు చేస్తున్నా. వెడ్డింగ్స్‌ క్యాటగిరీలో రిటర్న్‌ గిఫ్ట్స్‌గా బ్యాగ్స్‌, పోట్లీలు, శారీ కవర్లు, హ్యాంపర్లు తయారు చేస్తాను. కస్టమైజేషన్‌ ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఎంచుకున్న వెడ్డింగ్‌ థీమ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తులను డిజైన్‌ చేసి అందిస్తూ ఉంటాను. లోగోలను డిజైన్‌ చేసి ప్రింట్‌ చేసి అందిస్తూ ఉంటాను. చీరలు, బహుమతులు ప్యాక్‌ చేయడానికి శారీ బ్యాగులను కూడా తయారు చేసి అందిస్తూ ఉంటాను. ప్యాకేజింగ్‌ నా మూడవ క్యాటగిరీ. ఇంటి నుంచి ఉత్పత్తులను విక్రయించేవారికి, ఆయా ఉత్పత్తులను ప్యాక్‌ చేయడానికి అవసమైన బ్యాగులను తయారు చేసి అందిస్తూ ఉంటాను. 


వేర్వేరు రాష్ట్రాల నుంచి ముడిసరుకు 

జ్యూట్‌ మినహా నా ఉత్పత్తుల కోసం ఉపయోగించే విభిన్న మెటీరియల్స్‌ అన్నీ దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతాయి. ఆగ్రా నుంచి నాన్‌ ఊవెన్‌, గుజరాత్‌ నుంచి భిన్నమైన ప్రింట్లతో కూడిన కాటన్‌, గుజరాత్‌ నుంచి బెనారస్‌ సిల్క్‌... ఇలా వేర్వేరు మెటీరియల్స్‌ను తెప్పించుకుంటాను. ఇలా వేర్వేరు ప్రాంతాల నుంచి నాణ్యమైన మెటీరియల్స్‌ను అందుబాటు ధరల్లో కొనుగోలు చేసి తెప్పించే బాధ్యత నాన్న భానుమూర్తి తీసుకున్నారు. ఇలా ఇంటా, బయటా రెండు విధాలా అమ్మా నాన్నా నా జ్యూట్‌ బిజినె్‌సకు ఎంతో తోడ్పాటునిచ్చారు. ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడంలో మా వారు కె. ఆదిత్య సహాయపడుతూ ఉంటారు.  


కొవిడ్‌ కాలం సహాయపడింది

ఎవరైనా బిజినెస్‌ ప్రారంభంలో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ నేను కొవిడ్‌ కాలంలో సవాళ్లను ఎదుర్కొన్నా. లాక్‌డౌన్‌ కాలంలో ఉత్పత్తులు అమ్ముడయ్యే అవకాశాలు అడుగంటిపోయాయి. దాంతో నా దగ్గర పనిచేస్తున్న వర్కర్లకు భృతి దక్కని పరిస్థితి. దాంతో మాస్క్‌ల తయారీ మొదలుపెట్టాను. ఆకర్షణీయమైన మెటీరియల్స్‌తో, ఆకట్టుకునే డిజైన్లతో మాస్క్‌లను తయారుచేయడం మొదలుపెట్టాను. అలాగే కొవిడ్‌ కాలంలో కొరియర్‌ ధోరణి పెరిగింది. దాంతో నేనూ జ్యూట్‌ ప్యాకేజింగ్‌ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టా. దాంతో అప్పటివరకూ కేవలం వెడ్డింగ్‌ గిఫ్ట్‌ల బ్యాగులకే పరిమితమైపోయిన నా బిజినెస్‌ మాస్కులు, ప్యాకేజింగ్‌ ప్రొడక్ట్‌ తయారీతో ఊపందుకుంది. 


కొత్తదనం లక్ష్యంగా...

ఒక ఉత్పత్తి డిజైన్‌ చేయడం పూర్తయితే, మరో కొత్త ఉత్పత్తి గురించి ఆలోచించడం మొదలుపెడతాను. ఆ ఆలోచన నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. సాధారణ బ్యాగులు ఎవరైనా తయారు చేయగలుగుతారు. కొత్తగా, విభిన్నంగా ఉండే ఉత్పత్తులకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. నేను డిజైన్‌ చేసే ఉత్పత్తుల్లో నాణ్యతదే పెద్ద పీట. మార్కెట్లో దొరికే ఎక్కువ శాతం జ్యూట్‌ ఉత్పత్తుల్లో ఫినిషింగ్‌ మెరుగ్గా ఉండదు. కుట్లు కూడా దూర దూరంగా ఉంటాయి. మ్యాచింగ్‌ కలర్‌ దారాలను ఉపయోగించరు. ఒక బ్యాగ్‌ కుట్టాలి కాబట్టి అలా కుట్టేస్తే సరిపోతుంది అనే చందంగా ఉంటాయవి. కానీ ఉత్పత్తుల తయారీ విషయంలో నేనెక్కడా రాజీ పడను. నాణ్యత, ఆకర్షణల పరంగా మన్నికైన ఉత్పత్తులనే తయారుచేస్తా. ఈ ఏడాది వెబ్‌సైట్‌ లాంచ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నా. ప్రస్తుతం న్యారా ప్రొడక్ట్స్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తున్నా. 


గోగుమళ్ల కవిత

Updated Date - 2022-01-23T05:30:00+05:30 IST