అగ్గిపెట్టె నుంచి ఆర్టీసీ వరకు బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-05-28T08:11:22+05:30 IST

అగ్గిపెట్టె నుంచి ఆర్టీసీ వరకు బాదుడే బాదుడు

అగ్గిపెట్టె నుంచి ఆర్టీసీ వరకు బాదుడే బాదుడు

వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి

మహానాడులో టీడీపీ తీర్మానం


ఒంగోలు (కార్పొరేషన్‌), మే 27: ‘రాష్ట్రంలో అగ్గిపెట్టె నుంచి ఆర్టీసీ వరకు రేట్లు పెంచేసి బాదుడే బాదుడుకు జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. దీంతో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు నేడు పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని తెలుగుదేశం పార్టీ తీర్మానించింది. శుక్రవారం మహానాడులో మొదటి తీర్మానంగా బాదుడే బాదుడు అంశాన్ని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టగా.. బీద రవిచంద్ర, గౌతు శిరీష బలపరిచారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలను ఎడాపెడా బాదేశారని విమర్శించారు. ‘జగన్‌రెడ్డి, ప్రకృతి వైపరీత్యాలు కవల పిల్లలుగా పుట్టారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రతిపక్షంలో ఉన్నపుడు బాదుడేబాదుడు అని మాట్లాడిన జగన్‌ ఇప్పుడు ఇష్టారాజ్యంగా పెంచేశారు. ఆర్టీసీ కనీస చార్జి రూ.5 నుంచి రూ.10కి పెంచేశారు. కరెంటు చార్జీలు రూ.30 నుంచి రూ.50కు పెంచేసిన వ్యక్తి జగన్‌రెడ్డి. జిల్లాకు చెందిన మాజీ విద్యుత్‌ మంత్రి (బాలినేని శ్రీనివాసరెడ్డి).. తెలుగుదేశం ప్రభుత్వం కారణంగానే పెంచేశామంటూ అబద్ధపు ప్రకటనలు చేశారు. ప్రతి కుటుంబంపై నెలకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఆర్థిక భారం పెరిగింది. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే. జగన్‌ టన్ను రూ.475కు పెంచారు. రూ.లక్ష ఇస్తేనే గానీ లారీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పేరుతో ఆస్పత్రి చార్జీలు పెంచేశారు. ఎన్టీఆర్‌ సమయంలో పక్కా ఇల్లు నిర్మిస్తే.. దానికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. బాదుడే బాదుడే చేస్తున్న జగన్‌రెడ్డిని తిరిగి బాది క్విట్‌ జగన్‌ సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, బ్రింగ్‌ బాబు నినాదంతో చంద్రబాబును తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల’ని పిలుపిచ్చారు. మూడేళ్ల నిరీక్షణ మహానాడు పండుగకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయని శిరీష అన్నారు. 40 ఏళ్ల పార్టీ వేడుక, అన్న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా పేర్కొన్నారు. బీద రవిచంద్ర మాట్లాడుతూ.. కష్టాలున్నా చార్జీలు పెంచకుండా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. జగన్‌ అబద్ధాలతో గద్దెనెక్కి ప్రజలను కష్టాల పాల్జేస్తున్నారన్నారు.

Updated Date - 2022-05-28T08:11:22+05:30 IST