ఇంత మోసమా!

ABN , First Publish Date - 2022-01-13T07:45:09+05:30 IST

అసలే తక్కువ ఫిట్‌మెంట్‌కు ఒప్పుకొని సాటి ఉద్యోగులతో తిట్లు తింటున్నాం. ఇప్పుడు... హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) శ్లాబులూ తగ్గిస్తే మాకు ఇబ్బందులు తప్పవు’ అంటూ ఉద్యోగసంఘాల నేతలు..

ఇంత మోసమా!

హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు మారిస్తే భారీగా నష్టం

హెచ్‌ఆర్‌ఏ, సీసీఏపై స్పష్టత ఇవ్వాలి

ఫిట్‌మెంట్‌పై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత

ఉద్యోగుల నుంచి ఎంతో ఒత్తిడి 

నేటి మధ్యాహ్నం వరకే డెడ్‌లైన్‌

లేదంటే... మళ్లీ ఉద్యమం తప్పదు

సర్కారుకు ఉద్యోగ నేతల అల్టిమేటం

సెలవుల్లో జీవోలిస్తారని అనుమానం

కనీసం 30% ఫిట్‌మెంట్‌ కావాల్సిందే

సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేఖ


అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘అసలే తక్కువ ఫిట్‌మెంట్‌కు ఒప్పుకొని సాటి ఉద్యోగులతో తిట్లు తింటున్నాం. ఇప్పుడు... హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) శ్లాబులూ తగ్గిస్తే మాకు ఇబ్బందులు తప్పవు’ అంటూ ఉద్యోగసంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కార్యదర్శి కమిటీ సిఫారసు మేరకు సర్కారు హెచ్‌ఆర్‌ఏలో కోత పెట్టే యోచనలో ఉన్నట్లు తెలియడంతో కలవర పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సెలవు రోజుల్లోనే ‘హెచ్‌ఆర్‌ఏ కోత’ల జీవో జారీ చేస్తారని సందేహిస్తున్నారు. అదే జరిగితే... ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గిపోతాయి. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్లకు అదనపు బెనిఫిట్ల సంగతి తేల్చాలని... వీటిపై పాత విధానాలనే కొనసాగించాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తాడేపల్లిలోని సీఎంవో అధికారుల చుట్టూ రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నారు.


‘‘ఇప్పటికే పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. హెచ్‌ఆర్‌ఏ కూడా తగ్గిస్తే వేతనాల్లో భారీగా కోతపడుతుంది. అదే జరిగితే ఉద్యోగులు పెద్ద ఎత్తున్న ఉద్యమించే పరిస్థితి వస్తుంది’’ అని అధికారులకు వివరిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, క్వాంటమ్‌ పెన్షన్‌ తీసేయడం తగదని సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డికి వివరించారు. సీఎంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది. హెచ్‌ఆర్‌ఏపై గురువారం మధ్యాహ్నానికి స్పష్టత ఇవ్వకపోతే ఉద్యమిస్తామని ఉద్యోగ జేఏసీల నేతలు హెచ్చరికలు జారీ చేశారు. 


కార్యాచరణ ప్రకటిస్తాం...

గురువారం మధ్యాహ్నంలోగా హెచ్‌ఆర్‌ఏపై సీఎంవో అధికారులు సీఎంతో చర్చించి చెబుతామన్నారని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు తెలిపారు. లేనిపక్షంలో స్ట్రగుల్‌ కమిటీ సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ‘‘హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్లకు అదనపు బెనిఫిట్లు అంశంపై ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. మాపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సమ్మె బాట పట్టాయి. సీఎస్‌ కమిటీ సిఫారసుల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ జీవోలు ఇవ్వొద్దంటూ ఉదయం నుంచి క్యాంపు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాం. రెండు దఫాలు చర్చలు జరిగినా ఎటూ తేల్చడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంవో అధికారులు గురువారం మధ్యాహ్నం వరకూ సమయం కోరారని, ఈలోగా పరిష్కారం దొరక్కపోతే ఉద్యమబాటే శరణ్యమని తెలిపారు. 


పీఆర్సీ ప్రకటనను తిరస్కరిస్తున్నాం: సీఎస్ కు లేఖ

రాష్ట్ర ప్రభుత్వం చేసిన పీఆర్సీ ప్రకటనను తిరస్కరిస్తున్నట్లు సీఎస్‌ సమీర్‌ శర్మకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. అశుతోశ్‌మిశ్రా ఇచ్చిన పీఆర్సీ నివేదికను వెంటనే ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలని, కనీసం 30శాతం ఫిట్‌మెంట్‌ ఉండేలా చూడాలని సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. 2010లో పీఆర్సీ కమిషన్‌ 27ు సిఫారసు చేస్తే అప్పటి ప్రభుత్వం 39ుప్రకటించిందని, 12ఏళ్ల తర్వాత అంతకంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇస్తామనడం ఎంతవరకు శాస్త్రీయమని ప్రశ్నించారు. చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూలేని విధంగా 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 30శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినందున.. దానికి తగ్గకుండా ఇక్కడా ఇవ్వాలని కోరారు. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలను పీఆర్సీ సిఫారసుల ప్రకారం యథావిధిగా కొనసాగించాలన్నారు. హైదరాబాద్‌ నుంచి రీలొకేట్‌ అయిన ఉద్యోగులకు అదే హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని కోరారు.


70నుంచి 79 ఏళ్ల వయసున్న వారికి ఇస్తున్న 10 శాతం అదనపు పింఛను మొత్తాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర పీఆర్సీని అమలు చేయాలన్న ప్రతిపాదనను తక్షణం వెనక్కి తీసుకోవాలని, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీని ప్రకటించే విధానాన్ని కొనసాగించాలన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అన్ని బెనిఫిట్స్‌ అమలు చేస్తామంటే ఈ అంశంపై తాము చర్చలకు సిద్ధం అని ఆ లేఖలో వెల్లడించారు. సీపీఎ్‌సను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, 1993 నవంబరు 25నుంచి పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. సీఎం హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను తక్షణం ఖరారు చేయడంతోపాటు వారికి పీఆర్సీని అమలు చేయాలని ఆ లేఖలో డిమాండ్‌ చేశారు. ఈ మేరకు 12 అంశాలతో కూడిన లేఖలో సీఎ్‌సకు  కేఆర్‌ సూర్యనారాయణ స్పష్టం చేశారు.


ఆనందం ఆవిరి...

‘‘మేము అడగని అంశాలపైనా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినందునే... ఫిట్‌మెంట్‌పై ప్రకటన రోజున హర్షం వ్యక్తం చేశాం. హెచ్‌ఆర్‌ఏపై అధికారులతో మాట్లాడిన తర్వాతే అసలు విషయం తెలిసింది. సీఎస్‌ కమిటీ చెప్పిన హెచ్‌

ఆర్‌ఏ శ్లాబులు అమలైతే... రాష్ట్రంలో ప్రతి ఉద్యోగీ నష్టపోతారు. రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీల సిబ్బంది జీతంలో వేలల్లోనే కోత పడుతుంది’’

                                                                                                         ఉద్యోగ సంఘం నేతలు  

Updated Date - 2022-01-13T07:45:09+05:30 IST