నైరాశ్యం!

Sep 27 2021 @ 00:07AM

  • నిరుద్యోగులకు మరోసారి ఆశాభంగం
  • ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులేనా?! 
  • చర్చకు రాని భర్తీ అంశం
  • అయోమయంలో నిరుద్యోగులు 

నెలలు, సంవత్సరాలుగా మారుతున్నా ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో తమ భవిష్యత్తుపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొత్త జోన్ల విధానం ప్రకారం కేడర్‌ స్ట్రెంత్‌పై స్పష్టత వచ్చినా ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో జాప్యంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వివిధ శాఖల్లో వివిధ కేడర్లకు సంబంధించి మూడు వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. సర్కారు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని చెబుతున్నా స్పష్టత లేక నైరాశ్యంలో             కూరుకుపోతున్నారు. కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన నిరుద్యోగులకు మరోసారి నిరాశ తప్పలేదు. 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌  జిల్లా ప్రతినిధి) :

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరోసారి ఆశాభంగం కలిగింది. ఇప్పుడు.. అప్పుడూ అంటూ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.  పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌... ఆ దిశగా ఇంత వరకు చర్యలు తీసుకోవడం లేదంటూ  నిరుద్యోగులు  మండిపడుతున్నారు. నెలలు, సంవత్సరాలుగా మారుతున్నా ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో తమ భవిష్యత్తుపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొత్త జోన్ల విధానం ప్రకారం కేడర్‌ స్ట్రెంత్‌పై స్పష్టత వచ్చినా ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ఆలస్యం కావడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేడర్ల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారై ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై స్పష్టత వచ్చింది. జిల్లాలో ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది. జిల్లాలో వివిధ శాఖల్లో వివిధ కేడర్లకు సంబంధించి మూడు వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం మేరకు పాఠశాల విద్యా శాఖలో 565, రెవెన్యూ శాఖలో 281, వైద్య ఆరోగ్య శాఖలో 251, ఇంటర్‌ విద్యా శాఖలో 171, పోలీసు శాఖలో 100, వ్యవసాయ శాఖలో 54, పశు సంవర్ధక శాఖలో 45 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలే కాకుండా ఇతర శాఖల్లో మరో 600 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో లక్షన్నర మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. మూడేళ్లుగా. కొందరు గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతుండగా, ఎక్కువగా ఉపాధ్యాయ, పోలీసు నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ, అధ్యాపక, పోలీసు ఉద్యోగాల అర్హతలు కలిగిన వారు 50 వేల మందికి పైగానే ఉన్నారు. టీఎ్‌సపీఎస్సీ జారీ చేసే గ్రూప్స్‌ 1, 2, 3, 4 నోటిఫికేషన్లతో పాటు ఉపాధ్యాయ, పోలీసు నియామకాల నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. త్వరలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవల పలువురు మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పని సరిగా ఓ ప్రకటన చేస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశ పడ్డారు. అయితే ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రభుత్వం చర్చ కూడా చేయకపోవడం పట్ల నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

భవిష్యత్తుపై బెంగ ...

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు తమ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కావడం ఆలస్యమయ్యే కొద్దీ వయోపరిమితి కోల్పోయి ఉద్యోగాలకు దూరమవుతామేమోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని చెబుతున్నా స్పష్టత లేక నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. నోటిఫికేషన్ల విడుదల ఆలస్యమయ్యే కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న వారు క్రమంగా తమ ఆశలకు నీళ్లొదులుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల ఉన్నా నోటిఫికేషన్లు లేక నిరాశా నిస్పృహలో కూరుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.  నిరుద్యోగుల మనోవేదనను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల జారీపై వెంటనే ప్రకటన చేయాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. 

Follow Us on: