రవాణాకు ఇంధన పోటు

ABN , First Publish Date - 2021-02-26T05:34:10+05:30 IST

రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్‌, పెట్రో ధరలతో రవాణారంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆర్థిక ప్రగతిలో రవాణారంగం పాత్ర కీలకం. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ఈ రంగాన్ని దెబ్బతీయగా ఇప్పడిప్పుడే కోలుకుంటోంది. ఓ వైపు టైర్ల ధరలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, టోల్‌ చార్జీలు, డ్రైవర్ల కమీషన్లు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రాన్స్‌పోర్టర్లకు ఫైనాన్స్‌ వేధింపులు, పోలీ్‌సస్టేషన్ల మాముళ్లు సరేసరి. ఈ నేపథ్యంలో రోజూ పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనాలు నడపలేమని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రవాణాకు ఇంధన పోటు

సంక్షోభంలో రవాణారంగం

ఇంధన ధరల పెంపుతో భారం

నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన అఖిల భారత వ్యాపార సమాఖ్య

ఉమ్మడి జిల్లా వాసులపై నిత్యం ఇంధన భారం రూ.2.76కోట్లు

(కోదాడ)

రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్‌, పెట్రో ధరలతో రవాణారంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆర్థిక ప్రగతిలో రవాణారంగం పాత్ర కీలకం. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ఈ రంగాన్ని దెబ్బతీయగా ఇప్పడిప్పుడే కోలుకుంటోంది. ఓ వైపు టైర్ల ధరలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, టోల్‌ చార్జీలు, డ్రైవర్ల కమీషన్లు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రాన్స్‌పోర్టర్లకు ఫైనాన్స్‌ వేధింపులు, పోలీ్‌సస్టేషన్ల మాముళ్లు సరేసరి. ఈ నేపథ్యంలో రోజూ పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనాలు నడపలేమని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఇంధన ధరల పెంపునకు నిరసనగా అఖిలభారత వ్యాపార సమాఖ్య శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.

ఉమ్మడి జిల్లాలో సుమారు 10వేల లారీలు నిత్యం సరుకురవాణా చేస్తున్నాయి. ఒక్కో లారీ సగటున రోజు 400 కి.మీ దూరం ప్రయాణిస్తున్నాయి. అందుకు సుమారు 80 లీటర్ల చొప్పున మొత్తం 80వేల లీటర్ల డీజిల్‌ వినియోగం అవుతోంది. జనవరి 25వ తేదీన లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.35 ఉండగా, ఫిబ్రవరి 25న రూ.88.47కు చేరింది. లీటర్‌పై రూ.8 ధర పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని లారీ యజమానులపై నిత్యం రూ.64లక్షల అదనపు భారం పడుతోంది. ఆటోలు, డీసీఎంలు, కార్లు మరో 30వేల వరకు ఉన్నాయి. వీటిపై మరో రూ.1.92కోట్ల భారం పడుతోంది. ఇక పెట్రోల్‌ వాహనదారులు రూ.20లక్షల భారం మోయాల్సి వస్తోంది. వెరసి ఉమ్మడి జిల్లా వాసులపై రోజూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో రూ.2.76కోట్ల అదనపు భారం పడుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 200 బంక్‌లు నడుస్తుండగా, 20వేల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కో బంక్‌ రోజుకు 2వేల లీటర్ల పెట్రోల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. పెట్రోల్‌ ధర గత నెలతో పోలిస్తే రూ.5కు పెరిగింది. దీంతో ద్విచక్రవాహనదారులపై రోజుకు రూ.20లక్షల భారం పడుతోంది. చమురు ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నా వాహన కిరాయిలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో లారీలు తిప్పకలేకపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్‌, స్టేట్‌ జీఎస్టీల కారణంగా ధరలు భారీగా పెరిగాయని, వీటిని ఎత్తివేసి ఒకే జీఎస్టీ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా బంద్‌ నిర్వహిస్తున్నట్టు అఖిలభారత వ్యాపార సమాఖ్య నాయకులు తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతుపలకాలని కోరారు.


వ్యవసాయంపై సీజన్‌కు రూ.2.94కోట్లు..

ఉమ్మడి జిల్లాలో 36లక్షల 79వేల 275 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా, ఒక ఎకరా వరి సాగుకు దుక్కి నుంచి నాటు వరకు ట్రాక్టర్‌తో ఏడుమార్లు దున్నాల్సి ఉంటోంది. అందుకు ఆరు లీటర్ల డీజిల్‌ వినియోగం అవుతుంది. ఎకరాకు మొత్తం 42 లీటర్లు డీజిల్‌ వాడకం ఉంటుంది. పెరిగిన ధర ప్రకారం ఎకరకు రూ.336 అదనపు భారం పడుతోంది. వ్యవసాయంపై సీజన్‌కు రూ.2.94కోట్ల భారం పడుతోంది.


అన్ని వర్గాలపై ప్రభావం

సూర్యాపేట జిల్లాలో 54937మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరు పాలు, కూరగాయలు, ప్లాస్టిక్‌ వస్తువులతోపాటు పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు పట్టణాలకు పాలు, కూరగాయలు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. వీరంతా మోపెడ్లను అత్యధికంగా వినియోగిస్తుండటంతో పెరిగిన పెట్రోల్‌ ధరలతో ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక జిల్లాలో 475 పంచాయతీలు ఉండగా ఇక్కడి నుంచి సమీప పట్టణాలకు ఆటోలు ఎక్కువగా నడుస్తున్నాయి. సుమారు 15వేల ఆటోలు నిత్యం రహదారులపై తీరుగుతున్నాయి. ఆటో చార్జీలు పెరగపోగా, డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపుతో గిట్టుబాటు కావడం లేదని ఆటోవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టాలు తగ్గించే పేరుతో ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులను తగ్గించింది. దీంతో గ్రామీణ ప్రాంత వాసులకు ఆటోలను ఆశ్రయించక తప్పడం లేదు. ఆటో చార్జీలను పెంచితే ఇది గ్రామీణులపై ప్రభావం చూపనుంది.


బంద్‌కు పలు పార్టీల మద్దతు

సూర్యాపేట: భారత్‌ బంద్‌కు సీపీఎంతో పాటు న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు  మద్దతు ప్రకటించాయి. అయితే జాతీయ రహదారి ముట్టడిపై ఎలాంటి సమాచారం లేదని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్‌ తెలిపారు. అయినా అప్రమత్తంగా ఉంటామని ఆయన తెలిపారు.


కాగుతున్న వంట నూనె ధరలు : నాలుగు నెలల్లో 35 శాతం పెరుగుదల

నార్కట్‌పల్లి: వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. ఇంధన ధరల పెంపు నిత్యావసర వస్తువులపై పడింది. గత ఏడాది దసరా సమయంలో కిలో పామాయిల్‌ ధర రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.117కు చేరింది. పల్లీ నూనె ధర రూ.120 ఉండగా, రూ.150కి పెరిగింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.118 ఉండగా, రూ.150కి ఎగబాకింది. సుమారు నాలుగు నెలల వ్యవధిలో వంట నూనెల ధరలు 35శాతంమేర పెరిగాయి. అయితే సామాన్యు డి ఆదాయంలో మాత్రం మార్పు లేదు. గ్యాస్‌ ధరలు సైతం పెరగ్గా, కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. దీం తో ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


లారీలు నడపటం కష్టంగా ఉంది : కనగాల నాగేశ్వరరావు, లారీ అసోసియేషన్‌ కోదాడ అధ్యక్షుడు

కేంద్రం కనిపించకుండా పైసల రూపంలో డీజిల్‌ ధర పెంచుతుండటంతో లారీలను తిప్పలేకపోతున్నాం. నెల రోజుల వ్యవధిలో రూ.8 ధర పెరగడం లారీ యజమానులకు తలకు మించిన భారం. నేను 30లారీలు నడుపుతున్నా. డీజిల్‌ ధర పెరిగినా కిరాయిలు మాత్రం పెరగడంలేదు. దీంతో లారీలు నడపడం కష్టంగా ఉంది. కేంద్రం వెంటనే ధరలు తగ్గించి రవాణారంగాన్ని కాపాడాలి.


బండి తీయాలంటే భయమేస్తోంది : డి.శ్రీనివాసరావు, ద్విచక్రవాహనదారుడు, కోదాడ

పెట్రోల్‌ ధర రోజు రోజుకూ పెరుగుతుంటే బండి బయటికి తీయాలంటే భయమేస్తోంది. వ్యాపార నిమిత్తం రోజుకు 100 నుంచి 120కి.మీ తిరుగుతుంటా. అందుకు 2 నుంచి 3లీటర్ల వరకు పెట్రోల్‌ వాడుతున్నా. దీంతో మూడు లీటర్లపై రోజుకు రూ.15 అదనంగా, నెలకు రూ.450 భారం పడుతోంది. సామాన్యుడు ద్విచక్రవాహనం నడిపే పరిస్థితి లేదు.


మా చెమట, చమురుకే పోతోంది : చీరబోయిన నవ్య, అక్కెనపల్లి

కూలీ నాలీ చేసి చెమటచుక్క చిందించి సంపాదించిన డబ్బు చమురుకే ఖర్చవుతోంది. వ్యవసాయ పనులు లేక ఉపాధి కూలీకి వెళ్తే రోజుకు రూ.150 కూడా రావడం లేదు. నూనె ప్యాకెట్‌ రూ.150 ఉంది. రేట్లు ఇలా పెరుగుతుంటే ఇక ఏం కొంటాం, ఏం తింటాం.

Updated Date - 2021-02-26T05:34:10+05:30 IST