
ఆంధ్రజ్యోతి(29-03-2022)
పరీక్ష చేయించుకోవడం ఓ ఎత్తైతే, ఆ పరీక్ష ఫలితం కోసం ఎదురు చూడడం మరో ఎత్తు. కానీ ఇప్పుడీ పరిస్థితి మారింది. అతి తక్కువ సమయంలో, కచ్చితమైన ఫలితం చేతికందే అత్యాధునిక డయాగ్నొస్టిక్స్ అందుబాటులోకొచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకు అసౌకర్యం కలిగించని, కొన్ని అత్యాధునిక పరీక్షలు భవిష్యత్తు రుగ్మతలను ఎంతో ముందుగానే పసిగడుతున్నాయి.
కుటుంబ చరిత్ర, ఆహార, జీవనశైలి మార్పులు, హార్మోన్లలో హెచ్చుతగ్గుల మూలంగా మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గడం, గుండె జబ్బులు, రొమ్ము కేన్సర్ మొదలైన ఆరోగ్య సమస్యల తీవ్రత పెరిగింది. వీటిని కనిపెట్టే వ్యాధి నిర్థారణ పరీక్షలు ముందు నుంచీ ఉన్నప్పటికీ, ఆ క్రమంలో రేడియేషన్‌కు బహిర్గతం కావడం, పరీక్ష సమయంలో అసౌకర్యానికి లోనవడం, ఫలితంలో కచ్చితత్వం లోపించడం లాంటి సమస్యలు ఉండేవి. కానీ వ్యాధి తీవ్రతను గుర్తించడం కంటే, వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే పసిగట్టడం ఎంతో కీలకం.
ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మామోగ్రఫీ
పుల్ ఫీల్డ్ డిజిటల్ మామోగ్రఫీ సంప్రదాయ మామోగ్రఫీ పరీక్షకు భిన్నం. గత మమోగ్రఫీ పరీక్షలో ఉపయోగించే డిటెక్టర్లు మెరుగ్గా ఉండేవి కావు. పరీక్ష తర్వాత ఫిల్మ్ డెవలప్ చేయడానికి సమయం పట్టే పరిస్థితి. పైగా ఫిల్మ్‌లో స్పష్టత, కచ్చితత్వం లోపించేవి. డిటిటల్ మామోగ్రఫీలో పరీక్ష చేసే సమయంలోనే ఫలితాన్ని తెలుసుకునే వీలుంది. రొమ్ము సాంద్రత, కాంట్రాస్ట్ సరిచేసుకుంటూ, కేన్సర్ గడ్డలను స్పష్టంగా కనిపెట్టవచ్చు. అలాగే రెండు ప్యాడిల్స్ మధ్య రొమ్మును నొక్కి పరీక్షించే ఈ టెస్ట్‌లో మహిళలకు అసౌకర్యం కలగదు. పరీక్ష తక్కువ సమయంలోనే ముగుస్తుంది కాబట్టి సోకే రేడియేషన్ కూడా తక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పరీక్షా ఫలితం కచ్చితంగా ఉంటుంది.
కేన్సర్‌ను ముందే పసిగట్టవచ్చు: కేన్సర్ గడ్డల కంటే, కేన్సర్ గడ్డలుగా మారే మైక్రో క్యాల్సిఫికేషన్లను పసిగట్టడం మరింత ముఖ్యం. డిజిటల్ మామోగ్రఫీలో వాటిని పసిగట్టగలిగే వీలుంటుంది. ఒక మిల్లీమీటరు కంటే చిన్నవిగా ఉండే ఈ క్యాల్సిఫికేషన్లు రొమ్ముల్లోని మిల్క్ డక్ట్స్‌లో పెరుగుతాయి. ఇలాంటి ఐదు, లేదా ఆరు క్యాల్షిఫికేషన్లు కలిసి కేన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని డిజిటల్ మామోగ్రఫీతో గుర్తించి, కేన్సర్‌ను కట్టడి చేసే చికిత్స మొదలుపెట్టగలిగితే, ఆ వ్యాధికి గురి కాకుండా ఉండవచ్చు.
రొమ్ము సాంద్రతను దాటుకుని: రొమ్ము సాంద్రత కేన్సర్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ మామోగ్రఫీ పరీక్షలో కేన్సర్ గడ్డల స్పష్టత తగ్గుతుంది. డిజిటల్ మామోగ్రఫీలో సాంద్రతతో సంబంధం లేకుండా మెరుగైన ఫలితాన్ని రాబట్టవచ్చు.
బోన్ డెన్సిటోమెట్రీ
మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎముకల సాంద్రతను దెబ్బ తీస్తాయి. మెనోపాజ్ లేదా ప్రీ మెనోపాజ్ దశకు చేరుకోవడం, విటమిన్ డి, క్యాల్షియం లోపాలు మహిళల్లో ఈ సమస్యకు కారణమవుతాయి. కాబట్టి 40 ఏళ్లకు చేరుకున్న మహిళలు ఈ పరీక్షను చేయించుకోవడం అవసరం. ఏ అవయవానికైనా: సాధారణంగా మడమ ఎముక, లేదా మణికట్టు ఎముకలను పరీక్షించి ఎముకల సాంద్రతను కనిపెడుతూ ఉంటారు. అయితే బోన్ మినరల్ డెక్సా స్కాన్‌తో శరీరంలోని మొత్తం ఎముకల సాంద్రతను కూడా తెలుసుకునే వీలుంది. స్కాన్ చేయవలసిన అవయవాన్ని బట్టి ఎక్స్ రే మిషన్ కదులుతూ ఉండడం డిఎక్స్ఎ ప్రత్యేకత. అలాగే తగ్గిన ఎముకల సాంద్రతను కనిపెట్టడమే కాకుండా, ఆస్టోపీనియా అనే బలహీన పడబోయే ఎముకల స్థితిని కూడా ఈ పరీక్షతో ముందుగానే కనిపెట్టవచ్చు.
సిటి కొరొనరీ క్యాల్షియం స్కోర్ స్ర్కీనింగ్
40 ఏళ్లు దాటిన మహిళలు క్యాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్ల వాడకం మొదలుపెట్టాలని సర్వత్రా వింటున్నాం. అయితే ఎవరికి ఎంత పరిమాణంలో వాటి అవసరం ఉంటుందో, ఎంత కాలం పాటు వాడవలసి ఉంటుందో కచ్చితంగా లెక్కించే పరిస్థితి లేదు. దాంతో సప్లిమెంట్ల వాడకంతో శరీరంలో చేరుకునే అదనపు క్యాల్షియం గుండె రక్తనాళాల్లో పేరుకుంటూ గుండె సమస్యలకు కారణమవుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు ఇలా క్యాల్షియం డిపాజిట్లు పేరుకునే సమస్య మరింత ఎక్కువ. కాబట్టి కాల్షియం స్ర్కీనింగ్ చేయించుకోవడం అవసరం. క్యాల్షియం పేరుకోక ముందే: కొరొనరీ క్యాల్షియం స్ర్కీనింగ్‌తో కొరొనరీ ధమనుల్లో పేరుకున్న క్యాల్షియంతో పాటు, ఆ డిపాజిట్లు పేరుకునే అవకాశాలను ముందుగానే పసిగట్టవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు, 40 ఏళ్లకు ముందే ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం. ఈ సమస్యలు లేనివాళ్లు 40 ఏళ్లు దాటిన తర్వాత, సాధారణ స్ర్కీనింగ్‌లో భాగంగా ఈ పరీక్ష ఐదేళ్లకోసారి చేయించుకుంటూ ఉండాలి.
కేన్సర్ గడ్డల కంటే, కేన్సర్ గడ్డలుగా మారే మైక్రో క్యాల్సిఫికేషన్లను పసిగట్టడం మరింత ముఖ్యం. డిజిటల్ మామోగ్రఫీలో వాటిని పసిగట్టగలిగే వీలుంటుంది. బోన్ మినరల్ డెక్సా స్కాన్‌తో శరీరంలోని మొత్తం ఎముకల సాంద్రతను కూడా తెలుసుకునే వీలుంది. స్కాన్ చేయవలసిన అవయవాన్ని బట్టి ఎక్స్ రే మిషన్ కదులుతూ ఉండడం డిఎక్స్ఎ ప్రత్యేకత.
డాక్టర్ కె.జితేందర్ రెడ్డి
సీనియర్ కన్సల్టెంట్,
డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్,
స్ర్పింట్ డయాగ్నొస్టిక్స్, హైదరాబాద్.