ముసురేసింది!

ABN , First Publish Date - 2021-07-22T05:20:59+05:30 IST

ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ముసురేసింది!
అలుగు పారుతున్న శివసాగర్‌ ప్రాజెక్టు

  • ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తివేత
  • సగటు 30 నుంచి 40 మి.మీ వర్షపాతం నమోదు
  • మరో మూడు రోజుల వర్షసూచన

ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పల్లెలు, పట్టణ ప్రాంతాలన్నీ చినుకులతో తడిసిముద్దవుతున్నాయి. రుతుపవనాలు చురుకుగా ఉండడంతో పాటు ఉపరితల ఆవర్తన కారణంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే బంగాళఖాతంలో బుధవారం సాయంత్రం ఏర్పడిన అల్పపీడం కారణంగా మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అత్యధికంగా సాగు చేసే పత్తిపంటకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 50శాతానికిపైగా రైతులు వివిధ పంటలు సాగు చేశారు. పదిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో మిగతా రైతులు పంటలు వేయడంలో ఆలస్యం జరుగుతోంది. వర్షాలు తగ్గితే పంటలు వేసేందుకు వేలాది మంది రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే ఖరీఫ్‌ ఆరంభంలో వేసిన కొన్ని పంటలకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఈఏడాది ఖరీ్‌ఫలో ఉమ్మడిజిల్లాలో సగటుకు మించి వర్షాలు కురిశాయి. సగటు కంటే దాదాపు 69శాతానికిపైగా వర్షపాతం నమోదైంది. జూలైలో సగటు 153 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 258మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు 68.5శాతం అధికంగా వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో 100శాతానికిపైగా అధిక వర్షపాతం కురిసింది. దీంతో నల్లరేగడి నేలల్లో పంటలు వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో కొన్నిపంటలు వేసిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే బుధవారం ఉమ్మడిజిల్లాలో సగటు 30 నుంచి 40 మి.మీ వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని మండలాల్లో  కూడా ఇదే విధంగా వర్షపాతం కురిసింది. రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

 

నీళ్లు నిల్వ ఉంటే కాల్వలు తవ్వి మళ్లించండి

ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్నిచోట్ల పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయు. అలాగే మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ఈ పరిస్థితులు కొనసాగితే కొన్ని పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో వేసిన పంటలు దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇందువల్ల పంట పొలాల్లో నీరు నిల్వ అధికంగా ఉంటే కాల్వలు తవ్వి దారి మళ్లించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. 


రోజంతా జడివాన

ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి / తాండూరు / ధారూరు / మర్పల్లి /ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి / కీసర రూరల్‌ / ఘట్‌కేసర్‌ / చేవెళ్ల / కొత్తూర్‌: వికారాబాద్‌ జిల్లాలో రోజంతా వర్షం కురిసింది. బుధవారం చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తరు వర్షం కురిసింది. చల్లని గాలులతో వాన కురుస్తుండటంతో అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 20 శాతం వరకు చెరువులు నిండాయి. జిల్లాలో 1196 చెరువులు ఉండగా, వాటిలో 150 చెరువులు పూర్తిగా నిండగా, మరో 68 చెరువులు అలుగెత్తి ప్రవహిస్తున్నాయి. యాలాల్‌ మండలంలోని శివసాగర్‌, వికారాబాద్‌లోని శివసాగర్‌ చెరువులు అలుగెత్తి ప్రవహిస్తున్నాయి. 


అలుగుపారుతున్న శివసాగర్‌ ప్రాజెక్టు

ఎడతెరిపిలేకుండా కురిసే వర్షాలకు యాలాల మండలం విశ్వనాథ్‌పూర్‌ సమీపంలోని శివసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. బుధవారం ప్రాజెక్టు అలుగు పారింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి కాల్వలు నిర్మించి ఉంటే పంట పొలాలకు నీరందేదని రైతులు పేర్కొంటున్నారు.

ధారూరు మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షాలకు పొలాల్లో కలుపుతీత పనులకు అంతరాయం కలుగుతోంది. 


నీట మునిగిన పత్తిపంట

మర్పల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీట మునిగాయి. ఈ ప్రాంతంలో అధికంగా సాగు చేసే పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర పంట పొలాల్లో భారీగా వర్షం నీరు చేరింది. ఇదే విధంగా వర్షాలు కొనసాగితే పంటలు గిద్ద బారిపోయి కలుపు మొక్కలతో పంట దిగుబడి పూర్తిగా పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాగారం, దమ్మాయిగూడ మున్సిపా లిటీలు, ఘట్‌కేసర్‌లో జల్లులు కురిశాయి. ఎడతెరిపిలేని వానకు జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. జల్లులకు చిరు వ్యాపా రులు ఇబ్బంది పడ్డారు. 


చేవెళ్ల డివిజన్‌పరిధిలో..

చేవెళ్ల డివిజన్‌పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయం త్రం వరకు ఎడతెరిపి లేకుండా జల్లులు పడ్డాయి. వారం రోజులుగా వర్షాలు పడు తుండటంతో చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు నిండాయి. వానల వల్ల పంటలకు జీవం వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఈదురుగాలులతో చేవెళ్ల మండలంలో గంటల తరబడి విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుంది.


బాబోయ్‌.. కుమ్మరిగూడ రోడ్డు

కొత్తూర్‌ మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడకు వెళ్లే రహదారి అస్తవ్య స్తంగా తయారైంది. ఈ రహదారిని బీటీ రోడ్డుగా మార్చేందుకు రెండేళ్ల క్రితం కోటి ఇరువై లక్షల రూపాయలు మంజూరై పనులు కూడ ప్రారంభమయ్యాయి. సదరు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ గోతులు ఏర్పడి బురదమయంగా మారింది. 



Updated Date - 2021-07-22T05:20:59+05:30 IST