ltrScrptTheme3

రౌడీషీటర్లపై కొరడా

Oct 24 2021 @ 00:34AM

పద్ధతి మార్చుకోని వారిపై ప్రత్యేక నిఘా

టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి వైభవ్‌ గైక్వాడ్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌

అన్ని పోలీసు స్టేషన్ల నుంచి విడతల వారీగా హాజరు

తాజా చర్యలతో హడలెత్తిపోతున్న రౌడీలు

హనుమకొండ క్రైం, అక్టోబరు 23: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో రౌడీషీటర్లకు వణుకు మొదలైంది. ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కమిషనరేట్‌లో విధుల్లో ఉండి రౌడీషీటర్ల చిట్టా రాబట్టారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టారు.  రాజకీయ ఒత్తిడి తెస్తున్న వారిపై మరీ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.


రౌడీషీట్‌ ఓపెన్‌ అయినప్పటికీ కొందరు తమ ప్రవర్తన మార్చుకోకుండా సెటిల్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, కాంట్రాక్టులు, పంచాయితీలు, కాంట్రాక్ట్‌ మర్డర్లు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ తరహా రౌడీషీటర్లపై  కొత్తగా వచ్చిన పోలీసు అధికారులు నిప్పులు చెరుగుతున్నారు. రహస్యంగా అందరి కూపీ లాగుతున్నారు.  సీపీ తరు్‌షజోషి ఆదేశాల మేరకు ఇటీవల వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌కు ఐపీఎస్‌ అధికారి వైభవ్‌ గైక్వాడ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. వారం రోజుల క్రితం చార్జి తీసుకున్న ఐపీఎస్‌ అఽధికారి ప్రధానంగా గంజాయి, గుట్కా రవాణాతో పాటు రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా కమిషనరేట్‌ పరిధిలోని ఏ-1 రౌడీషీటర్లను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి పిలిపించుకుని  కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.  

విడతల వారీగా పిలుపు..

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రధానంగా యువతను తన వెంట తిప్పుకుంటూ మత్తుకు, మద్యానికి బానిసలను చేస్తూ పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్ల జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. కమిషనరేట్‌ పరిధిలో చాలా మంది రౌడీషీటర్ల పేర్లు తొలగించగా ఇంకా 324 మంది రౌడీషీటర్లుగా ముద్రపడి ఉన్నారు. వీరిలో ట్రబుల్‌ మాంగర్స్‌ (సమస్యలు సృష్టించే వ్యక్తులు) రౌడీషీటర్ల పేర్లను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండు రోజుల క్రితమే పోలీసు స్టేషన్‌ల వారీగా సిద్ధం చేసినట్టు తెలిసింది. దీంతో ఎవరి పేరు ఎప్పుడు పిలుస్తారోనని కొందరు రౌడీషీటర్లు హడలెత్తిపోతున్నారు.


పలు కోణాల్లో దర్యాప్తు..

టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక అధికారిగా వైభవ్‌ గైక్వాడ్‌ వచ్చిన తర్వాత వరంగల్‌ పోలీసు సబ్‌డివిజన్‌ నుంచి మిల్స్‌కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్‌ పీఎ్‌సల నుంచి 30 మందిని పిలిచి కౌన్సెలింగ్‌ చేసినట్టు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. గతంలో చేసిన నేరాలు, ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు? ఏదైనా కేసుల్లో తలదూర్చుతున్నారా? కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆదాయ మార్గాలపై విచారిస్తున్నట్టు తెలిసింది. ఇంకా పాత కేసులపై కోర్టుకు హాజరవుతున్నారా? కేసులో ప్రత్యర్థులను నేరుగా గానీ, ఫోన్‌ ద్వారా గానీ, అనుచరులతో గానీ బెదిరింపులకు పాల్పడుతున్నారా? అనే కోణంలో విచారించినట్టు కొందరు రౌడీషీటర్లు తెలిపారు.


రౌడీషీటర్లుగా పేరు నమోదై  పోలీసు స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతకు విఘాతం కలిగినా మీరే బాధ్య త వహించాల్సి ఉంటుందని, అల్లర్లు, గొడవలు, కొట్లాటలు, హత్యలు జరిగినా మీ ప్రమేయం ఉన్నట్టేనని చెబుతుండడంతో రౌడీషీటర్లు వణికిపోతున్నారు. కొం దరు ఏ-1 రౌడీషీటర్లు మేం ప్రజాప్రతినిధులమని, ఇంకా కొందరు ప్రజాప్రతినిధుల భర్తలమని చెప్పి జారుకునే ప్రయత్నం చేస్తే వారిపైనే ఎక్కువ దృష్టిసారించాలని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని ఐపీఎస్‌ అప్రమత్తం చేసినట్టు సమాచారం. కష్టం చేసుకుని బతికేవారిపై కరుణ చూపిస్తూ రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాల్లో ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కమిషనరేట్‌ పరిధిలో విడతల వారీగా అన్ని పోలీసు స్టే షన్ల రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఎవరైనా తోక జాడిస్తే పీడీ యాక్ట్‌ తప్పదని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.