నిధుల కటకట

ABN , First Publish Date - 2021-03-07T04:36:51+05:30 IST

బీడు భూములను సస్యశ్యామలం చేసి సమగ్ర గిరిజనాభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రభు త్వం ముఖ్యమంత్రి గిరివికాస్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందు లో భాగంగానే గిరిజన రైతులకు భూమి అభివృద్ధి పథకం కింద సామూహిక బోరుబావుల మంజూరుకై దరఖాస్తులు స్వీకరించారు.

నిధుల కటకట
ఆదిలాబాద్‌ మండలంలోని గిరిజన గ్రామాలు

జిల్లాలో గిరి వికాస్‌ పథకానికి దరఖాస్తుల వెల్లువ

47యూనిట్లకు 4368 దరఖాస్తులు

లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరాలు 

గిరిజన రైతులకు అందని పథకాలు 


ఆదిలాబాద్‌, మార్చి6 (ఆంధ్రజ్యోతి) : బీడు భూములను సస్యశ్యామలం చేసి సమగ్ర గిరిజనాభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రభు త్వం ముఖ్యమంత్రి గిరివికాస్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందు లో భాగంగానే గిరిజన రైతులకు భూమి అభివృద్ధి పథకం కింద సామూహిక బోరుబావుల మంజూరుకై దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 17 మండలాల పరిధిలోని గిరిజన రైతుల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో 47 యూనిట్లకు గాను మొత్తం 4368 దరఖాస్తులు రావడంతో అధికారులు లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. వేలల్లో దరఖాస్తులు వస్తే మండలానికి పది లోపే యూనిట్లు మంజూరు చేయడంపై గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్నా దరి చేరడమే లేదంటూ ఆవేదనకు లోనవుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో  ఎక్కువగా వర్షాదార పంటలనే పండిస్తారు. అందుబాటులో వాగులు, చెరువులు, కుంటల ద్వారా పంటల సాగు చేపడుతున్నారు. దీంతో సరిపడా నీటి వసతి లేకపోవడంతోప్రతిఏటా పంటను నష్ట పోవాల్సి వస్తుంది.  ఇలాంటి పరిస్థితులను దూరం చేసేందుకు గిరిజన రైతులు బోరుబావుల మంజూరుకు దరఖాస్తు చేసుకున్న ప్ర యోజనం కనిపించడం లేదు. 

నిధుల కొరతే ప్రధాన సమస్య..

ముఖ్యమంత్రి గిరిజన వికాస్‌ పథకానికి నిధుల కొరతే ప్రధాన సమస్యగా మారుతుంది. గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిన గి రిజన, దళిత రైతులు సాగు చేస్తున్న బీడు భూములకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో ఇందిరాజలప్రభ పథకాన్ని అమలు చేసి ఎ న్నో ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. ఈ పథకంలో అక్రమాలు, అవినీతి జరిగిన కొంతమంది రైతులకు మా త్రం మేలుజరిగిందనే చెప్పవచ్చు. ఈ పథకం స్థానంలోనే తెలంగాణ ప్రభుత్వం గిరి వికాస్‌ పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తుంది. జిల్లాలో అందుబాటులో ఉన్న కోటి 52లక్షల నిధులకు సరిపడ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన పూర్తిస్థాయిలో ప్రయోజనం కనిపించడం లే దు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తునే ఏజెన్సీ గిరిజన రైతులకు 50 శాతం, మైదానపు ప్రాంత గిరిజన రైతులకు 40 శాతం, కోలాం గిరిజన ప్రాంతాలలో నివసించే రైతులకు 10 శాతం యూనిట్లను మంజూరు చేసేందుకు కలెక్టర్‌, ఐటీడీఏ పీవో నిర్ణయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. 

జిల్లాలో 4368 దరఖాస్తులు..

జిల్లాలోని గిరిజన రైతుల నుంచి బోరుబావుల మంజూరుకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. 17 మండలాల పరిధిలో 4368 దర ఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్థుతం 47 యూనిట్లకు మాత్రమే నిధులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మండలం నుంచి వందకు పైగా దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. అధికంగా ఆదిలాబాద్‌రూరల్‌ మండలం, ఉట్నూర్‌, బజార్‌హత్నూర్‌ మండలాల నుంచి ఎక్కువ దరఖాస్తులు రాగా  మావల మండలంలో ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. గతంలో అమలు చేసిన ఇందిరాజలప్రభ పథకంలో మిగిలిన నిధులకే దరఖాస్తులను ఆహ్వానించడం జరిగిందని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదంటున్నారు. రెండు మూడేళ్లుగా పథకం మరుగున పడిపోవడంతోనే లబ్ధిదారుల పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

లాటరీతో అన్యాయమే..

ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారు లు లాటరీ విధానాన్ని చేపట్టారు. దీంతో అర్హులకు అన్యాయమే జరిగే అవకాశం ఉందంటున్నారు. గతంలో ఈ పథకం కింద లబ్ధి పొం దిన రైతులు తిరిగిఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడి కనీస నీటి వసతి లేని రైతులను గుర్తించి మొదట ప్రాధాన్యత కల్పిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని మండలాల్లో ఎంపీడీవోల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్న ఆరోపణలున్నాయి. కొన్ని మండలాల్లో 600లకు పైగా దరఖాస్తులు వస్తే ఐదారు యూనిట్లనే మంజూరు చేయడం జరిగిందంటున్నారు.  అధికారులు మాత్రం 47 యూనిట్లు పోగా మిగిలిన దరఖాస్తులకు ఏప్రిల్‌, మేలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఈ ఏడు కూడా బోరుబావుల పథకం అందే విధంగా లేదని గిరిజన రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిధుల మంజూరుకు ప్రతిపాదనలు

జిల్లాలో సామూహిక బోరుబావుల పథకానికి దరఖాస్తులు రావడంతో అదనపు నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఏప్రిల్‌, మేలో నిధులు మంజూరు కాగానే మిగితా రైతులందరికీ బోరు బావులకు నిధులు అందిస్తాం. కోటి 52 లక్షల నిధులతో లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు నీటి వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- రవీందర్‌ రాథోడ్‌ (ఏపీడీ, ఆదిలాబాద్‌)

Updated Date - 2021-03-07T04:36:51+05:30 IST