గ్రామీణ రహదారులకు మహర్దశ

ABN , First Publish Date - 2022-07-06T05:52:46+05:30 IST

గుంతలతో అధ్వాన్నంగా తయారైన రహదారులకు మహర్దశ పట్టనున్నది. నిర్వహణ లోపంతో ఎక్కడికక్కడ కంకర తేలిన ఈ రోడ్లపై ప్రయాణమంటేనే నరకయాతన తలపించేది. ఏళ్ల తరబడిగా ఈ సమస్యకు పరిష్కారం లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. ప్రస్తుతం వర్షాకాలం సమీపించడంతో బీటీ రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మంత్రి హరీశ్‌రావు ఆమోదముద్ర వేయడంతో ఉత్తర్వులు విడుదలయ్యాయి.

గ్రామీణ రహదారులకు మహర్దశ
అధ్వానంగా మారిన చేర్యాల, నర్సాయపల్లి బైపాస్‌ రోడ్డు

జిల్లాలో 98 రోడ్ల మరమ్మతుకు రూ.81.75 కోట్లు

పరిపాలనా అనుమతులు మంజూరు  

పదిరోజుల్లో టెండర్లు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 5: గుంతలతో అధ్వాన్నంగా తయారైన రహదారులకు మహర్దశ పట్టనున్నది. నిర్వహణ లోపంతో ఎక్కడికక్కడ కంకర తేలిన ఈ రోడ్లపై ప్రయాణమంటేనే నరకయాతన తలపించేది. ఏళ్ల తరబడిగా ఈ సమస్యకు పరిష్కారం లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. ప్రస్తుతం వర్షాకాలం సమీపించడంతో బీటీ రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మంత్రి హరీశ్‌రావు ఆమోదముద్ర వేయడంతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. 


పుష్కలంగా నిధులు

జిల్లాలోని 98 పంచాయతీరాజ్‌ శాఖ గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం రూ.81.75 కోట్లు కేటాయిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో రహదారికి రూ.20 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు వెచ్చించేలా అంచనాలు రూపొందించారు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి 34 రోడ్లకు రూ.17.89 కోట్లు, గజ్వేల్‌ నియోజకవర్గంలో 8 రహదారులకు రూ.7.86 కోట్లు, దుబ్బాక నియోజకవర్గంలో 32 రోడ్లకు రూ.34.60 కోట్లు, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 14 రహదారులకు రూ.11.61 కోట్లు, జనగాం నియోజకవర్గంలో ఉన్న చేర్యాల, మద్దూరు మండలాల్లోని 8 రోడ్లకు రూ.8.09 కోట్లు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో రెండు రోడ్లకు రూ. కోటి 70 లక్షలు కేటాయించారు. 


వేగిరపడితేనే ప్రయోజనం

జిల్లాలో అన్ని గ్రామాలకు గతంలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో తారుతో సింగిల్‌ రోడ్లు నిర్మించారు. అయితే కాలక్రమేణా చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. కంకరతేలి, గుంతలతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. వర్షాలు పడితే ఈ రోడ్లపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశముంది. ఈసారి ఇప్పటివరకు భారీ వర్షాలు పడకపోవడంతో మరమ్మతులకు ఇంకా అవకాశమున్నది. మరో నెలలో వర్షాలు జోరందుకునే సమయానికి యుద్ధప్రాతిపాదిక రహదారులకు మరమ్మతులు చేస్తే ప్రజలకు కష్షాలు తప్పుతాయి లేదంటే గుంతలు, బురదమయమైన రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారుతుంది. బీటీ రోడ్లపూ తారు వేసిన అనంతరం కనీసం రెండ్రోజుల పాటు వర్షాలు లేకుండా ఉంటేనే ఆ రోడ్డు మన్నికగా ఉంటుంది. లేదంటే మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే టెండర్లు పిలిచి మరమ్మతుల ప్రారంభించాల్సిన అవసరం ఉంది. లేదంటే మరో మూడు నెలలు వేచిచూడాల్సి వస్తుంది. 


సూచిక బోర్డులు పెట్టండి సార్‌..

వర్షాకాలంలో వరదలకు కల్వార్టులు, రహదారులు ముంపునకు గురవుతున్నాయి. వీటిని గమనించకుండా ప్రయాణించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముంపు రోడ్లు, కల్వర్టులు, మలుపులు, రహదారుల పక్కన గోతులు, బావులు ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తప్పుతాయి. రోడ్ల మరమ్మతు సమయంలో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-07-06T05:52:46+05:30 IST