గ్రామ పంచాయతీల ఖాతాలోనే పైసలు

ABN , First Publish Date - 2020-12-02T05:50:52+05:30 IST

అత్యధిక జనాభా నివసించే గ్రామాల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి.

గ్రామ పంచాయతీల ఖాతాలోనే పైసలు

డీపీవో పద్దులో జమ విధానం రద్దు     

నిధులు నేరుగా అందేలా ఏర్పాటు     

బిల్లుల చెల్లింపులో జాప్యానికి చెక్‌


మెదక్‌, డిసెంబరు 1: గ్రామాల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. గతంలో పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు అప్పులు తెచ్చి సమస్యలను పరిష్కరించాల్సి వచ్చేది. పనులను చేసిన అనంతరం నిధుల కోసం నెలల తరబడి వేచిచూడాల్సి వచ్చేది. నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో పంచాయతీలకు నేరుగా ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. గత నెల వరకు ఈ నిధులు తొలుత జిల్లా పంచాయతీ అధికారి ఖాతాలో జమయ్యేవి. అనంతరం పంచాయతీలవారీగా సర్దుబాటు చేసేవారు. డీపీవో కార్యాలయంలో ఉద్యోగుల కొరత, పని ఒత్తిడి కారణంతో నిధుల బదిలీలో జాప్యం జరిగేది. ఈ సమస్యను పరిష్కరించడానికి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా పంచాయతీల ఖాతాలోనే జమ చేసే ప్రక్రియ అమలులోకి వచ్చింది. 


20 మండలాలు.. 469 గ్రామాలు

మెదక్‌ జిల్లాలో 20 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పలు అభివృద్ధి కార్యకమాల తో పాటుగా పల్లె ప్రజానీకానికి మౌళిక వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులు పంచాయతీల వారీగా కేటాయిస్తున్నారు. గతంలో గ్రామాల్లో పనులు చేయించిన సర్పంచ్‌లు బిల్లుల విషయంలో ఇబ్బంది పడేవారు. నిధులు ప్రథమంగా జిల్లా పంచాయతీ అధికారి ఖాతాలో జమ చేసేవారు. దీంతో బిల్లులు విడుదల కావడానికి చాలా సమయం పట్టేది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా జీపీల ఖాతాల్లోకే నేరుగా నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పంచాయతీ కార్యాలయంలో బిల్లులు రెడీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. నిధుల విడుదలను బట్టి పనులు చేపట్టే వెసులుబాటు లభించడంతో వెంటనే బిల్లుల చెల్లింపులు చేసేందుకు వీలుంటోంది. 


జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు 

గత నెలలో జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 6 కోట్ల 75లక్షల 54వేల 949 వచ్చాయి. జిల్లాలో మొత్తం జనాభా 6,60,218 కాగా.. ప్రతీ పంచాయతీకి జనాభా ప్రాతిపాదికన నిధలు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. జిల్లాలో ఎస్సీ జనాభా 1,14,298 కాగా వీరి కోసం రూ. 1,25,93,240 కేటాయించారు. ఎస్టీల కోసం రూ. 61,36,647 కేటాయించగా.. జిల్లాలో వారి జనాభా 68,971. ప్రత్యేంగా కేటాయించిన నిధులను వారికి సంబంధించిన అభివృద్ధి పనులకు మాత్రమే ఖర్చు చేయడానికి అనుమతిస్తారు.


నిబంధనల మేరకే నిధులు ఖర్చు చేయాలి : శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి

పల్లెప్రగతి నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ నిదులను మౌలిక వసతులను సమకూర్చేందుకు వినియోగిస్తారు. నిబంధనల మేరకే ఖర్చు చేయడానికి అనుమతి ఉంటుంది. నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ అయినా నిరంతర పర్యవేక్షణ, కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. పంచాయతీలకు ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేస్తుండడంతో అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం తొలగిపోయి అభివృద్ధి పనులు వేగవంతంమవుతాయి.

Updated Date - 2020-12-02T05:50:52+05:30 IST