ఏకపక్షంగా నిధులు మళ్లించారు

ABN , First Publish Date - 2022-01-29T07:06:53+05:30 IST

తమను సంప్రదించకుండా ఎంపీపీ ఏకపక్షంగా నిధులు మళ్లించారని ఎంపీటీసీ సభ్యులు మండల సభలో వాగ్వాదానికి దిగారు.

ఏకపక్షంగా నిధులు మళ్లించారు
భువనగిరి మండల సభలో ఎంపీపీతో వాగ్వాదానికి దిగిన ఎంపీటీసీలు

 


ఎంపీపీ, విపక్ష ఎంపీటీసీల మధ్య వాగ్వాదం

భువనగిరి రూరల్‌, జనవరి 28:  తమను సంప్రదించకుండా ఎంపీపీ ఏకపక్షంగా నిధులు మళ్లించారని ఎంపీటీసీ సభ్యులు మండల సభలో వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ నరాల నిర్మల అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సభలో ఎంపీపీ, విపక్ష ఎంపీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  కాగా ఎంపీపీ ఎలాంటి తీర్మానాలు లేకుండా మండల పరిషత నిధులు రూ.20లక్షల నిధులను తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బస్వాపురం గ్రామానికి కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంత వరకు సమంజసమని ఎంపీటీసీలు పాశం శివానంద్‌, గునుగుంట్ల కల్పన, గడ్డమీది చంద్రకళ, మట్ట పారిజాత ఎంపీపీని ప్రశ్నించారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. రెండున్నర సంవత్సరాల్లో తాము ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామాలకు సుమారు రూ.2లక్షల నిధులను మాత్రమే కేటాయించారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఎంపీడీవో జి.నరేందర్‌రెడ్డి వివరణ ఇస్తూ మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకే అంచలంచెలుగా నిధుల కేటాయించామని సముదాయించారు. అయినప్పటికీ ఎంపీటీసీలు ససేమిరా అని బయటకు వెళ్లారు. వడపర్తి సర్పంచ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కొత్త  పింఛన్లు మంజూరు కాకపోవడంతో గ్రామస్థులకు తాము ముఖం చాటేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మిషన భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎర్రంబెల్లి సర్పంచ గాదె యశోద సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, వైస్‌ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, ఎంపీడీవో జి నరేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు బొక్క కొండల్‌రెడ్డి, రాసాల మల్లేశం, సామల వెంకటేశ, కంచి లలిత, రాంపల్లి కృష్ణ, సర్పంచలు జెక్క కవిత, మల్లికార్జున, మంజినాయక్‌, టి.కల్పన, సక్రమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T07:06:53+05:30 IST