గడపగడపలో సమస్యల వెల్లువ

ABN , First Publish Date - 2022-09-25T03:56:57+05:30 IST

కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి.

గడపగడపలో సమస్యల వెల్లువ
అంగన్‌వాడీ కార్యకర్తలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి

కురిచేడు, సెప్టెంబరు 24 : కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తాయి. శనివారం గంగదొనకొండకు వ చ్చిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను మహిళలు చుట్టుముట్టారు. తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బోర్ల ద్వారా కూడా నీరు రావడం లేదనిని చెప్పారు. పొట్లపాడు మంచినీటి చెరువులో నీరుంటే తమ గ్రామంలో బోర్ల ద్వారా నీరు వస్తుందని లేకపోతే నీటి తిప్పలు తప్పవని వారు తెలిపారు. తమకు నీటి సమస్య తీర్చి పుణ్యం కట్టుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.  గ్రామంలో మురుగు కాల్వలు లేవన్నారు. ఉన్నవాటిని శుభ్రం చేయడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు.  దోమలు విపరీతంగా పెరిగి రోగాలబారిన పడు తున్నామన్నారు. కురిచేడు - దొనకొండ ఆర్‌అండ్‌బీ రోడ్లు పూర్తిగా ధ్వంసమై రాకపోకులకు ఇబ్బందిగా మారాయని తెలిపారు. దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నా యని చెప్పారు.  రోడ్డుకు ఇరువైపులా చిల్లచెట్లు పెరిగి మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. రోడ్డుకు మరమ్మతులు చేసి చిల్లచెట్లను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, యన్నాబత్తిన సుబ్బయ్య, నాయకులు పాల్గొన్నారు. 

అంగన్‌వాడీ కార్యకర్తలకు సెల్‌ఫోన్ల పంపిణీ

తర్లుపాడు ఐసీడీఎస్‌ ప్రాజక్టు పరిధిలోని కురిచేడు, దొనకొండ మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలకు శనివారం ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్‌ సెల్‌ఫోన్లను పంపిణీ చేశారు. పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా కురిచేడు సెక్టార్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు వివిధ రకాల పౌష్టికాహారాలను తయారు చేసి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కురిచేడు మండలంలోని 46 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, దొనకొండ మండలంలోని 63 మంది కార్యకర్తలకు సెల్‌ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణిలు, పసి పిల్లలకు పౌష్టికాహారం అందించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. వారి ఆరోగ్య బాధ్యత మీదేనన్నారు. నాణ్యత లేని ఆహారాన్ని ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో పద్మావతి, సూపర్‌వైజర్‌ సుభాషిణి, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T03:56:57+05:30 IST