బిల్లులెలా కట్టేది..?

ABN , First Publish Date - 2022-05-16T06:24:31+05:30 IST

బిల్లులెలా కట్టేది..?

బిల్లులెలా కట్టేది..?
కరెంట్‌ బిల్లు వస్తే ఎలా కట్టేదంటూ ఎమ్మెల్యేను నిలదీస్తున్న చెన్ను వెంకటేశ్వరమ్మ

ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబును ప్రశ్నించిన వైసీపీ కార్యకర్త భార్య

సమాధానం చెప్పకుండా వెళ్తుంటే, అడ్డగించి మళ్లీ ప్రశ్న

పులిగడ్డలో గడప గడపకూ మన ప్రభుత్వానికి చుక్కెదురు


‘విద్యుత్‌ బిల్లులు ఇలా పెంచుకుంటూ పోతే మాలాంటి పేదలం ఎలా కట్టాలి..’ అంటూ పులిగడ్డ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సతీమణి చెన్ను వెంకటేశ్వరమ్మ స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు వద్ద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే సరిగ్గా స్పందించక పోగా, సంక్షేమ కార్యక్రమాల జాబితాను వినిపించి వెళ్లిపోతుండగా, ఆమె మళ్లీ అడ్డుకుంది. విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని మళ్లీ ప్రశ్నించినా ఎమ్మెల్యే నుంచి సరైన సమాధానం రాలేదు.

ఇలా.. గడప గడపకు మన ప్రభుత్వంలో స్థానిక ప్రజల నుంచే కాదు.. సొంత పార్టీ వారి నుంచి కూడా ప్రజాప్రతినిధులకు చుక్కెదురవుతోంది. అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలో రెండోరోజు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు తాగునీటి సమస్యలు, విద్యుత్‌ బిల్లుల పెంపు, ఇళ్ల పట్టాలు తదితర అంశాలపై ఎమ్మెల్యేను నిలదీశారు. నాలుగు దశాబ్దాలుగా పులిగడ్డ-అవనిగడ్డ రహదారి పక్కన నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు లేవని, ఎవరు వచ్చినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని ఎమ్మెల్యే వద్ద కొందరు గోడు తెలుపుకోగా, తహసీల్దార్‌ను పిలిచి వారిలో జగనన్న గృహ నిర్మాణ పథకంలో స్థలం పొందని వారికి పట్టాల విషయంలో తగిన న్యాయం చేయాలని సూచించారు. పులిగడ్డ గ్రామంలో తాగునీరు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని కొందరు మహిళలు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా, మాట్లాడొద్దంటూ కార్యకర్తలు వారించారు. సమస్య చెప్పుకొంటే పొట్లాడినట్టా.. అంటూ వారంతా తీవ్ర అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ రాబోయే రెండున్నరేళ్లలో ఇంటింటికీ కుళాయి పథకం ద్వారా అందరికీ తాగునీరు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు సింహాద్రి వికాస్‌, జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతీదేవి, సర్పంచ్‌లు విజయ్‌, గొరుముచ్చు ఉమా తదితరులు పాల్గొన్నారు.

- అవనిగడ్డ టౌన్‌/రూరల్‌

Updated Date - 2022-05-16T06:24:31+05:30 IST