గడప గడపకూ నిలదీతలు

Published: Sat, 14 May 2022 01:32:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఉక్కిరిబిక్కిరవుతున్న అధికార పార్టీ నేతలు

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆరోపణలు

తాగునీరు, డ్రైనేజీ సమస్యలను

పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు


బుచ్చెయ్యపేట, కోటవురట్ల, నాతవరం, విశాఖపట్నం, మే 12:

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అధికార పార్టీ శాసనసభ్యులు, సమన్వయకర్తలకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. సమస్యలు, సంక్షేమ పథకాలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అర్హులకు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయడం లేదని, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ధ్వజమెత్తుతున్నారు.

ధర్మశ్రీకి కొనసాగుతున్న సెగ

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీకి ప్రజల నుంచి నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన శుక్రవారం తొలుత బుచ్చెయ్యపేట మండలం చింతపాక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంటనే పలువురు మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాపు నేస్తం పథకం నిలిపివేశారని బొగ్గు అర్జునమ్మ, ఎలంశెట్టి మనమ్మ ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలున్నా తనకు పింఛన్‌ మంజూరు చేయడం లేదని కొల్లిమళ్ల ముసలమ్మ వాపోయింది. వృద్ధాప్యం కారణంగా తన వేలిముద్రలు, కనుపాపలు సరిగా నమోదు కాకపోవడంతో ఆరు నెలల నుంచి పింఛన్‌ ఇవ్వడంలేదని సలాది గంగమ్మ ఫిర్యాదు చేసింది. పింఛన్‌ డబ్బులతోనే బతుకుతున్నానని, వెంటనే పునరిద్ధరించాలని ఆమె వేడుకుంది. రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా వుందని పలువురు గ్రామస్థులు ఆరోపించారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలని కోరారు. అనంతరం సీతయ్యపేటలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ కాలనీలో తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యతో ఏళ్ల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు పక్కా ఇళ్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. వృద్ధాప్య పింఛన్‌ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని అల్లు అప్పారావు, సన్యాసమ్మ దంపతులు వాపోయారు. కాలనీలో తాగునీటి ట్యాంకు, డ్రైనేజీ కాలువలు, సామాజిక భనవం నిర్మించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని రావాడ అచ్చెయ్యమ్మ, గంగా భవానీ, కొరిబిల్లి వాసు, గంపల స్వరూపరాణి, బంగారు రమణమ్మ, పీవీవీ సత్యనారాయణ తదితరులు డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ధర్మశ్రీ హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాకవరపు నాగేశ్వరీదేవి, జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, సర్పంచ్‌లు గొలజాన శ్రీను, వజ్రపు ఇందిర, తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

పేట ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం

కోటవురట్ల, మే 13: పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కోటవురట్ల మండలం యండపల్లి గ్రామంలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను ఏకరువుపెట్టారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయి రెండు వారాలు అవుతున్నా ఇంతవరకు బాగు చేయలేదని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని విద్యుత్‌ లైన్‌మన్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. జగనన్న కాలనీకి నీరు, రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోతున్నామని పలువురు లబ్ధిదారులు వాపోయారు. దీంతో ఆయన స్వయంగా పరిశీలించి, అక్కడ పశువులు కట్టినా ఉండవు, ఎటువంటి సౌకర్యం లేని చోట అసలు లేఅవుట్‌ ఎలా వేశారంటూ రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటుకు స్థలం ఎంపిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఆర్వో, ఆర్‌ఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెలీ డీవీ సూర్యనారాయణరాజు, వైస్‌ఎంపీపీ సాగి సీతబాబు, జడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి, తహసీల్దార్‌ ప్రసాదరావు, ఎంపీడీవో సువర్ణరాజు, సర్పంచ్‌ పావని, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గణేశ్‌కు సమస్యలు ఏకరువు

నాతవరం, మే 13: నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ మండలంలోనిపీకేగూడెంలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. పీకేగూడెం-లక్ష్మీపురం తారురోడ్డు అధ్వానంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. అర్హులకు పింఛన్లు మంజూరు కాలేదని, రెండేళ్ల నుంచి చాలా వీధి కొళాయిలు పనిచేయడం లేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?

అక్కరమానిని నిలదీసిన మహిళ 

ఎంవీపీ కాలనీ, మే 13: ‘టిడ్కో ఇంటి కోసం రూ.25 వేలు చెల్లించాం. ఇప్పటివరకు ఇల్లు రాలేదు. అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లవుతోంది. ఇప్పటికీ ఇల్లు మంజూరుకాలేదు. ఇంకెప్పుడు ఇస్తారు’ ...అంటూ వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌, తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మలను మహిళలు నిలదీశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం జీవీఎంసీ 17వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా విజయనిర్మలను ఇళ్ల మంజూరుపై వనజ అనే మహిళతో పాటు మరికొందరు ప్రశ్నించారు. ఎప్పుడు మంజూరుచేస్తారో చెప్పాలని నిలదీశారు. దీంతో ఆమె త్వరలోనే మంజూరవుతాయని, ఓపిక పట్టాలని కోరారు. దీంతో మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సమస్యల ఏకరువు 

కాలనీలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, మురుగునీరు రహదారులపైకి పొంగి దుర్గంధం వ్యాపిస్తోందని మరికొందరు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే అది ప్రభుత్వ నిర్ణయమని, అభివృద్ధి పనుల కోసమే యూజర్‌ చార్జీ వసూలుచేస్తున్నారని, సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ గేదెల లావణ్య, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.