గడప గడపలో మనోళ్లే!

ABN , First Publish Date - 2022-05-18T06:33:59+05:30 IST

‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో నిలదీతల నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పక్కా ప్లానతో వెళుతున్నారు.

గడప గడపలో మనోళ్లే!
ఆర్భాటంగా.. గడప గడపకూ మంత్రి ఉష శ్రీచరణ్‌

- వైసీపీ ప్రజాప్రతినిధుల ఎత్తుగడ

- కథ.. స్ర్కీన ప్లే.. డైరెక్షన.. వలంటీర్లు 

- ఎదురు దాడిని తప్పించుకునే వ్యూహం

  అనంతపురం, మే 17(ఆంధ్రజ్యోతి):

  ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో నిలదీతల నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పక్కా ప్లానతో వెళుతున్నారు. ఏ గడపకు వెళితే ఎవరు నిలదీస్తారో అన్న భయం వారిని వెంటాడుతోంది. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోందని ఆ పార్టీవారు అంటున్నారు. అధికారులు, పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లినా... ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో.. ప్రజాప్రతినిధులు సరికొత్త ఎత్తుగడ వేశారు. మొదటి రెండు రోజులు ప్రజల నుంచి ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఆలోచనలకు పదును పెట్టారు. ఈ క్రమంలో ఆ పార్టీని ఆది నుంచి మోస్తున్న వలంటీర్లను వినియోగించుకుంటే ఎలా ఉంటుందన్న చర్చ జరిగిందని సమాచారం. అనుకున్నదే తడువుగా వలంటీర్లను రంగంలోకి దింపారు. తాజాగా నడుస్తున్న ‘గడప గడపకూ’ సినిమాకు కథ.. స్ర్కీనప్లే.. డైరెక్షన.. అన్నీ వలంటీర్లే అంటున్నారు. వలంటీర్ల కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం సాగేలా ప్రణాళికను రూపొందించారు. 


పక్కదారి పడుతోంది..


  ప్రజల నుంచి ఎదురుదాడిని తప్పించుకునేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా.. బాధితుల నుంచి పాలకులకు నిలదీతలు తప్పడం లేదు. వలంటీర్ల స్ర్కిప్ట్‌ ప్రకారమే గడపగడపకూ వెళుతున్నా, ఎవరో ఒకరు ప్రశ్నిస్తున్నారు. వలంటీర్లే కార్యక్రమాన్ని నిర్దేశిస్తున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడపగడపకూ  కార్యక్రమం ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆ పార్టీలో విమర్శలు వస్తున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. దీన్ని చూసి అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 


మీ ఇంటికి ఎమ్మెల్యే వస్తారు...


గడప గడపకూ వలంటీర్లు ముందుగానే వెళుతున్నారు. ‘ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తారు. ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతోంది. జగనన్న పాలన బాగుంది. మీరు బాగా పనిచేస్తున్నారు అని చెప్పండి’ అని సూచిస్తున్నారని సమాచారం. ఈ తతంగం ముగిసిన తరువాత ఎమ్మెల్యేలు ఏ వీధిలోకి, ఏ గడప వద్దకు వెళ్లాలో నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. ఏ ఏ కాలనీల్లోకి వెళితే ప్రజల నుంచి నిలదీతలు ఎదురుకావో... ఆ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎవరైనా సమస్యలపై నిలదీసేందుకు ఎమ్మెల్యే ముందుకు వస్తున్నట్లు గ్రహిస్తే.. పోలీసులను పురమాయించి, వారిని అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తప్పిస్తున్నారని సమాచారం. 


   నిలదీయని గడప వద్దకే..


 మొదట గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నారు. కానీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందనుకున్నారు. అందులో వైసీపీని డిలీట్‌ చేసి, ‘మన ప్రభుత్వం’ అని చేర్చారు. ఆ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన ఆదేశించారు. అధికారులు, పోలీసులతో కలిసి ప్రజల్లోకి వెళ్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని పాలకులు భావించారు. కానీ తొలిరోజే కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలాగే ముందుకు వెళితే జనంలో పలచన కావడం ఖాయమన్న ఆందోళన ప్రజాప్రతినిధుల్లో మొదలైంది. దీంతో వలంటీర్లను వినియోగించుకోవాలనే ఆలోచన చేశారు. ప్రభుత్వం వలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తున్న నేపథ్యంలో వారిని భాగస్వాములను చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉన్నారు.  ఏ ఇంటికి వెళితే అనుకూలమో, ఏ ఇంటికి వెళితే ప్రతికూలమో వివరాలు సేకరిస్తున్నారు.  నిలదీతలు లేకుండా, అంతా బాగుంది అని చెప్పే ఇళ్లను ఎంపిక చేసుకుని వెళుతున్నారు. ఇలా పక్కా ప్లాన ప్రకారం జరిగేలా చూసే బాధ్యతలను వలంటీర్లకు అప్పగించారు. 


ఎన్నికల ప్రచారమా?    

 ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉంది. అయినా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొందరు ఎమ్మెల్యేలు  ఎన్నికల ప్రచారంలా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడగాల్సిందిపోయి, ఈసారి ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేయాలని, ఫలానా వ్యక్తిని గెలిపించాలని కొందరు ప్రజాప్రతినిధులు అభ్యర్థిస్తున్నారు. ఈ తీరును చూసి ప్రజలు పెదవి విరుస్తున్నారు. మూడేళ్ల తరువాత గుర్తొచ్చామా? అని కొందరు ఎదురు దాడి చేస్తున్నారు. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి రెండు రోజుల క్రితం ఉరవకొండ నియోజకవర్గంలో గడపగపడకూ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇనచార్జి విశ్వేశ్వరరెడ్డితో కలిసి ప్రజల వద్దకు వెళ్లారు. ‘ఈ సారి ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. ఇదీ.. జిల్లాలో గడపగడపకూ మన ప్రభుత్వం కొనసాగుతున్న తీరు.


అయినా.. నిలదీతలు

  వలంటీర్ల కథ, స్ర్కీనప్లే,డైరెక్షనలోనే గడపగడపకూ మన ప్రభుత్వం కొనసాగుతున్నా, ఎమ్మెల్యేలకు అక్కడక్కడ ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు. మరో దారుణమేందంటే.. ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని ప్రయత్నంచేసే ప్రజా, దళిత సంఘాల నాయకులను పోలీసులు ముందుగానే అరెస్టు చేస్తున్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దళితుల సమస్యలను వివరించేందుకు వెళుతున్న దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. 

 బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి స్థానికుల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందలేదని ఎమ్మెల్యేను పలువురు నిలదీశారు. 

అనంతపురం అర్బనలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని రోడ్లు బాగలేవని ప్రశ్నించారు. 

 కళ్యాణదుర్గం మండలం గోళ్ల, పాతచెరువు గ్రామాలకు మంత్రి ఉష శ్రీచరణ్‌ వెళ్లారు. స్థానికులు సమస్యలను ఏకరవు పెట్టారు. గృహాలు, పింఛన్లు, ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబాయి గ్రామానికి వెళ్లిన సందర్భంలోనూ మంత్రికి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మాకు సంక్షేమ పథకాలు ఏమీ వద్దు.. చెరువుకు నీళ్లిస్తే చాలు’ అని అసహనం వ్యక్తం చేశారు. 

 గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని ప్రజలు నిలదీశారు. ధరలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదే అని ఓ మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా అని ఎమ్మెల్యే అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్లిపోయారు.

వలంటీర్ల డైరెక్షనలోనే కార్యక్రమం రూపుదిద్దుకుంటున్నా, ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఒక్కరోజుతో సరిపెట్టారంటే జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.






పుట్లూరు తహసీల్దార్‌పై చర్యలు

- డిప్యూటీ తహసీల్దార్‌గా డిమోషన?

 -సీసీఎల్‌ఏలో నిర్ణయం


 అనంతపురం క్రైం,మే17 : భూముల వ్యవహారంలో పుట్లూరు తహసీల్దార్‌ విజయకుమారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు రెవెన్యూ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఆమెను డిప్యూటీ తహసీల్దార్‌గా డిమోట్‌ చేస్తూ మంగళవారం సీసీఎల్‌ఏలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు కలెక్టరేట్‌కు ఉత్తర్వులు అందినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆ అధికారి చేసిన అవినీతి తారస్థాయికి చేరింది. దీంతో శాఖాపరమైన చర్యలు తప్పలేదు. గతంలో శింగనమల మండలంలో కొండగుట్టలు, ప్రభుత్వ భూములను మరొకరి పేరుతో పాసుబుక్కులు అందజేసిన వ్యవహారంపై అప్పట్లో  కలకలం రేపింది. తాజాగా పుట్లూరు మండలంలో భూములు లేకపోయినా, డైక్లాట్‌లో లేని సర్వేనెంబర్లను పొందుపరిచి పాసుబుక్కులు మంజూరు చేయడం మరింత వివాదాస్పదమైంది. శింగనమలలో జరిగిన వ్యవహారంపై చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ లాండ్‌ అడ్మినిస్ట్రేషన(సీసీఎల్‌ఏ)లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’లో పుట్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి తంతుపై మేడమ్‌ తగ్గేదేలే శీర్షికన కథనం వెలువడటంతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఆ తహసీల్దార్‌పై సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఉన్నతాధికారుల నివేదికల మేరకు  సీసీఎల్‌ఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా అధికారికంగా ఆమెపై తీసుకున్న చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశాలున్నాయి. 

Updated Date - 2022-05-18T06:33:59+05:30 IST