పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకున్న దంపతులు.. అతడికి ప్రస్తుతం 27 ఏళ్లు.. ఆకస్మాత్తుగా చనిపోయిన తల్లి.. ఏమైందా అని ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2022-05-08T15:56:17+05:30 IST

పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకున్న దంపతులు.. అతడికి ప్రస్తుతం 27 ఏళ్లు.. ఆకస్మాత్తుగా చనిపోయిన తల్లి.. ఏమైందా అని ఆరా తీస్తే..!

పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకున్న దంపతులు.. అతడికి ప్రస్తుతం 27 ఏళ్లు.. ఆకస్మాత్తుగా చనిపోయిన తల్లి.. ఏమైందా అని ఆరా తీస్తే..!

  • పెంచిన పేగునే తెంచాడా..?
  • అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా హత్యగా.. 
  • కనిపించకుండా పోయిన దత్తపుత్రుడు
  • ఇంట్లో నగదు, నగలు మాయం

హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ న్యూ గడ్డిఅన్నారం కాలనీలో ఓ మహిళ మృతి అనుమానాలకు దారి తీస్తోంది. గుండెపోటుతో మరణించిందని భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బీరువాలోని 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళతో పాటు పక్కగదిలో నిద్రించిన దత్తపుత్రుడు కనిపించకుండా పోవడంతో అతడే హత్య చేశాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హతురాలి బంధువులు, సరూర్‌నగర్‌ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కె.జంగయ్యయాదవ్‌, భూదేవి అలియాస్‌ లక్ష్మి (58) దంపతులు దిల్‌సుఖ్‌నగర్‌ న్యూ గడ్డిఅన్నారం కాలనీలో నివసిస్తున్నారు. పిల్లలు లేకపోవడంతో 1995లో రెండు రోజుల మగ శిశువును దత్తత తీసుకున్నారు. బాబుకు సాయితేజ అని నామకరణం చేశారు. అతడికి ప్రస్తుతం 27 ఏళ్లు. సాయితేజకు చిన్నప్పటి నుంచే మానసిక స్థితి సరిగా లేదు. డిప్లొమా చేసి, ప్రస్తుతం ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.


ఆస్పత్రికి వెళ్దామని లేపేందుకు వెళ్లగా..

జంగయ్య, భూదేవి దంపతులు, కుమారుడు సాయితేజ శుక్రవారం రాత్రి కలిసి భోజనం చేశారు. అనంతరం తల్లీకొడుకులు మొదటి అంతస్తులో నిద్రించగా, కాలు నొప్పి కారణంగా జంగయ్య గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడుకున్నాడు. ఉదయం 7 గంటలకు ఉప్పల్‌లోని డయాబెటాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లేందుకు జంగయ్య, భూదేవి అపాయింట్మెంట్‌ తీసుకున్నారు. ఉదయం 6 అవుతున్నా భార్య కిందకు రాకపోవడంతో జంగయ్య మొదటి అంతస్తుకు వెళ్లాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా భూదేవి అపస్మారక స్థితిలో పడి ఉంది. మరో బెడ్‌రూమ్‌లో సాయితేజ లేడు. అతడికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో జంగయ్య బంధువులను పిలిపించాడు. అందరూ కలిసి భూదేవిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 


బీరువా తెరవడంతో..

భూదేవి గుండెపోటుతో మృతి చెందిందని భావించిన భర్త, బంధువులు ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. భూదేవి భౌతికకాయానికి స్నానం చేయించి, కొత్తచీర కట్టించడం కోసం ఆమె బీరువా వద్దకు వెళ్లారు. బీరువా లోపల చిందర వందరగా ఉండడం, నగలు, నగదు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. మరోవైపు సాయితేజ ఆచూకీ తెలియకపోవడంతో జంగయ్యయాదవ్‌ సరూర్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.


దత్తపుత్రుడిపై ఫిర్యాదు

సీసీ ఫుటేజీ చూసిన అనంతరం సాయితేజపై అనుమానం వ్యక్తం చేస్తూ జంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందే అతడు మిస్సింగ్‌ అనే ఫిర్యాదు కూడా చేశారు. సీసీ ఫుటేజీల్లో సాయితేజ కనిపించకపోవడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేయలేదని డీఐ రవిబాబు వెల్లడించారు. 


ఆస్తి మొత్తం అతడికే అయినా..!

సాయితేజకు తల్లితో మంచి అనుబంధం ఉండేదని తం డ్రి జంగయ్యతో పాటు బంధువులు, స్థానికులు చెబుతున్నారు. ఆస్తి మొత్తం అతడికే చెందుతుండగా కేవలం రూ. 10 లక్షలు, 30 తులాల బంగారు ఆభరణాల కోసం హత్య చేస్తాడా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయితేజకు మానసిక స్థితి సరిగా ఉండదు కాబట్టి, దాన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా అతడిని పావుగా వాడుకుని ఆమెను హతమార్చి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూదేవి హత్య అనంతరం సాయితేజను తమ వెంట తీసుకెళ్లి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు.


CC Cameraల వైర్లు కట్‌ చేసి..

సరూర్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిబాబు సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూదేవి పెదవులు కమిలిపోయి ఉండడం, మొదటి అంతస్తులోని సీసీ కెమెరాల వైర్లు కట్‌ చేసి ఉండడంతో పథకం ప్రకారం హత్య చేసి నగలు, నగదుతో ఉడాయించినట్లు నిర్ధారించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా శనివారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో సాయితేజ ఓ బ్యాగ్‌ తీసుకుని బయటకు వెళ్తున్నట్లు కనిపించింది. ఆ కాలనీలో ఉన్న ఇతర సీసీ కెమెరాల విజువల్స్‌ను కూడా పోలీసులు సేకరించారు. భూదేవి ముక్కు, నోరును గుడ్డతో బిగించి ఊపిరి ఆడకుండా చేయడంతో చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Read more