గడ్కరీ, శివరాజ్‌ అవుట్‌

ABN , First Publish Date - 2022-08-18T10:04:38+05:30 IST

బీజేపీ పార్లమెంటరీ బోర్డును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పునర్వ్యవస్థీకరించారు.

గడ్కరీ, శివరాజ్‌ అవుట్‌

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్‌, యడ్యూరప్పలకు చోటు


సోనోవాల్‌, సుధా యాదవ్‌కు కూడా తొలిసారి సిక్కులకు ప్రాతినిధ్యం జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురాకు చోటు సీఈసీలోకి ఫడణవీస్‌, భూపేంద్ర ఓరం, షానవాజ్‌లకు ఉద్వాసన అత్యున్నత కమిటీల ప్రక్షాళన పార్టీపై ప్రధానికి పూర్తి పట్టు

75 ఏళ్ల నిబంధన యడ్యూరప్పకు లేదు వచ్చే కర్ణాటక ఎన్నికల్లోనూ  ఆయనే బీజేపీకి పెద్దదిక్కు తెలంగాణలో బీసీలకు దగ్గరయ్యేందుకేలక్ష్మణ్‌కు ప్రాధాన్యం: రాజకీయ వర్గాలు


న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ పార్లమెంటరీ బోర్డును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పునర్వ్యవస్థీకరించారు. కేంద్ర మంత్రి, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లను అందులో నుంచి తొలగించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ, తెలంగాణ సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌, అసోం మాజీ సీఎం, కేంద్ర మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ సహా ఆరుగురికి కొత్తగా స్థానం కల్పించారు. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లోకి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్‌ను తీసుకున్నారు. ఆర్‌ఎ్‌సఎ్‌సకు సన్నిహితుడైన గడ్కరీ(65)ని, దీర్ఘకాలంగా మధ్యప్రదేశ్‌ సీఎంగా ఉన్న శివరాజ్‌(63)ను తొలగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో వారిద్దరి ప్రభ మసకబారుతున్నందునే ఉద్వాసన పలికారని.. బోర్డులో సామాజిక, ప్రాంతీయ సమతూకం ఉండేలా సభ్యులను తీసుకున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బోర్డు, సీఈసీల ప్రక్షాళనతో బీజేపీపై ప్రధాని మోదీ పూర్తిగా పట్టు బిగించినట్లయింది.శివరాజ్‌ బదులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బోర్డులోకి తీసుకుంటారని భావించినా అలా జరుగలేదు. శివరాజ్‌ నిష్క్రమణతో బోర్డులో ఒక్క ముఖ్యమంత్రి కూడా లేనట్లయింది.


పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఆటోమేటిగ్గా సీఈసీ సభ్యులవుతారు. కాగా.. సీఈసీ నుంచి కేంద్ర మాజీ మంత్రులు జ్యుయల్‌ ఓరం, షానవాజ్‌ హుస్సేన్‌లను తొలగించారు. ఫడణవీస్‌, భూపేంద్ర యాదవ్‌లతో పాటు రాజస్థాన్‌ సీనియర్‌ నేత ఓం మాధుర్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌లను కొత్తగా తీసుకున్నారు. నడ్డా 2020లో జాతీయ అధ్యక్షుడయ్యాక తొలిసారి పార్లమెంటరీ బోర్డును, సీఈసీని ప్రక్షాళించడం గమనార్హం. ఆయనతో పాటు బోర్డులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా సభ్యులుగా ఉంటారు. సీఈసీలో సభ్యత్వం కోసం రాజ్యసభలో సభానాయకుడు పీయూష్‌ గోయల్‌, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా పోటీపడ్డారు. అయితే అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడైన భూపేంద్ర యాదవ్‌కు ఆ అవకాశం దక్కింది. తొలిసారి సిక్కు వర్గానికి చెందిన జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురాకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. ఈయన పంజాబ్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి. 1981లో ఖలిస్థాన్‌ తీవ్రవాద నేత జర్నైల్‌సింగ్‌ భింద్రన్‌వాలేను అరెస్టుచేసిన ఆయన 2012లో పదవీవిరమణ చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. అకాలీదళ్‌తో తెగతెంపుల తర్వాత పంజాబ్‌లో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో లాల్‌పురాను జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించింది. ఇప్పుడు పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవడం ద్వారా పంజాబీలకు చేరువ కావాలని చూస్తోంది. అలాగే కార్గిల్‌ యుద్ధంలో అమరుడైన బీఎ్‌సఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ యాదవ్‌ భార్య సుధా యాదవ్‌(హరియాణా).. 1999లో మహేంద్రగఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుస ఎన్నికల్లో ఓడిపోయినా ఆమెకు పార్లమెంటరీ బోర్డులో చోటివ్వడం గమనార్హం.


నాడు ఆడ్వాణీ, జోషీకి ఉద్వాసన

మోదీ 2014లో ప్రధాని అయ్యాక అమిత్‌ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్ర నేతలైన ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీలను అలవోకగా పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. ‘మార్గదర్శక్‌ మండల్‌’ను కొత్తగా ఏర్పాటుచేసి అందులోకి పంపారు. అనంతర కాలంలో బోర్డు సభ్యులైన అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, అనంతకుమార్‌ కన్నుమూశారు. సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. థావర్‌చంద్‌ గహ్లోత్‌ కర్ణాటక గవర్నర్‌గా వెళ్లారు. అప్పటి నుంచి కొత్తవారిని నియమించలేదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివాదరహితుడు కావడం.. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2013లో నాడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని జాతీయ స్థాయిలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించారు. అమిత్‌ షాను జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసి యూపీ బాధ్యతలు అప్పగించారు. తదనంతర కాలంలో షా అధ్యక్షుడు కావడానికి కూడా మార్గం సుగమం చేశారు. మోదీకి రాజ్‌నాథ్‌ ప్రత్యామ్నాయ నేత కాకపోవడం, సంఘ్‌కు ఆయనా సన్నిహితుడు కావడంతో బోర్డులో, సీఈసీలో ఆయన సభ్యత్వం పదిలంగా ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణ్‌ జతియాకు 75 ఏళ్లు దాటాయి. 1980 నుంచి 2009 వరకు (1984లో తప్ప) ఉజ్జయిన్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. వాజపేయి మంత్రివర్గంలో కార్మిక, సామాజిక న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 20 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉండడం.. పైగా ఎస్సీ నేత కావడంతో మోదీ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు.


పార్లమెంటరీ బోర్డు  సభ్యులు వీరే (11 మంది)..

జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, యడ్యూరప్ప, శర్బానంద్‌ సోనోవాల్‌, కె.లక్ష్మణ్‌, ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురా, సుధా యాదవ్‌, సత్యనారాయణ్‌ జతియా బీఎల్‌ సంతోష్‌ (బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి-సంస్థాగతం).  కేంద్ర ఎన్నికల కమిటీలో ఈ 11 మందితో పాటు భూపేంద్ర యాదవ్‌, దేవేంద్ర ఫడణవీస్‌, ఓం మాథుర్‌, వనతి శ్రీనివాసన్‌  సభ్యులుగా ఉన్నారు.

Updated Date - 2022-08-18T10:04:38+05:30 IST