కూతురు పద్యం

Sep 27 2021 @ 00:12AM

నిద్ర మానుకుని 

ఊయలప్పుడు లాలిపాటయినందుకు 

రాత్రులు పగబడుతాయని అనుకోలేదు 

అది పుట్టినప్పుడే అవి తాడు పేనుకున్నయి 


అది ఇంతున్నపుడు 

ఆ పాదాలకు నడక పాఠమయినందుకు 

ఈ పాదాల వెంటపడ్డ 

ముద్దు ముద్దు మారాము సంగీతం 


ఫ్యాను గాలి దొంగలా కరెంట్‌ పోయినపుడల్లా 

అమ్మపాలు తాగిన కమ్మటి మత్తునిద్రయినా 

ఉక్కపోత రాగానికి భళ్ళున తెల్లారినట్టు 

ఈ భుజమను వొంటిబోయ పల్లకి నెక్కి 

వెన్నెల వీధులలో ఊరేగిన కిరీటం తొడుగని మహరాణి 


ఈ పొట్టమీద కాళ్ళేసి 

ఈ గుండె గిలక పట్టుకుని 

ఉలిక్కిపడని చిట్టి కన్నుల మధుర స్వప్నం 


సూర్యుని చుట్టూ తిరిగే భూమిలా 

ఈ చేయి వొదలని చిట్టి దీపం 


ఇకపై రాత్రులన్నీ 

ముందుసీటు లేడీసుదన్న బస్సు ప్రయాణం 

ఇన్నాళ్ళ ఉమ్మడి నిద్ర ఇవ్వాళ వేరుకుంపటి 

నిన్నటి జోలపాట కలవరపడుతున్న అనాధ 


రెక్కలు రాగానే చెట్టు నొదిలి ఎగిరేపిట్టలా  

అదేం చిన్నపిల్ల కాదటా 

ఈ నాన్న దిండు చెమట కంపయినట్టు 

ఇప్పుడు కలలన్నీ పర్సనల్‌ అట 


ఉన్నట్టుండి పై చదువు మెట్లెక్కి 

రాత్రి పగలూ 

పట్నం గది నిండ పుస్తకాల నడుమ బందీ అయినా 

అప్పటికప్పుడు అప్పగింతల పాలయినా 

ఈ నాన్న గుండె బెంగపడుతుందని ఊహించినట్టు 


చిట్టిది 

దూరం జరుగుతున్న కొద్దీ 

పాలు మరిపించే తల్లిలా 

కొండంత ఎదుగుతున్న అనురాగం 


కూతురున్న నాన్నంటే 

దినమింత ఎడబాటు గడ్డ కడుతున్న మౌనం 

ఎవరికి చెప్పుకోలేని 

గడప గడపకూ విరబూసిన కూతురు పద్యం. 


గజ్జెల రామకృష్ణ

89774 12795

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.