గెలాక్సీపై సీమ నేతల కన్ను

ABN , First Publish Date - 2020-08-09T11:04:39+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు జిల్లాలోని చీమకుర్తి ప్రాంతంలోనే..

గెలాక్సీపై సీమ నేతల కన్ను

వారి మధ్యే పెరిగిపోయిన పోటీ 

ఒకవైపు కడప, చిత్తూరు నేతల ప్రయత్నాలు 

కర్నూలు జిల్లా ఎమ్మెల్యే ప్రోత్సాహంతో రంగంలోకి మరికొందరు 

భూమి స్వాధీన ప్రయత్నానికి తాత్కాలిక బ్రేక్‌ 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): మంచి లాభదాయకంగా మారిన గెలాక్సీ గ్రానైట్‌ క్వారీలు, భూముల స్వాధీనం ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు ముమ్మరం చేశారు. ఈ విషయంలో ప్రత్యేకదృష్టి సారించిన రాయలసీమకు చెందిన కొందరు  నేతలు పొటాపోటీగా ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు నాయకులు కొన్ని భూముల స్వాధీన యత్నాలు చేస్తుండగా మరికొందరు అవే భూములపై కన్నేసి లాక్కోవడానికి రంగం సిద్ధం చేయడం విశేషం. దీంతో యావత్తు గ్రానైట్‌ వర్గీయులే గాక జిల్లాలోని అధికారపార్టీ నేతలు కూడా విస్తుపోతున్నారు. అందుకు శనివారం జరిగిన సంఘటనే దర్పణం. ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ఒక భూమిలో లీజుల కోసం కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరు పెద్ద నాయకులు ప్రయత్నిస్తుండగా అదే భూమికోసం శనివారం కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో కొందరు వ్యక్తులు రంగంలోకే రావటం విశేషం. దీంతో వివాదం పెరిగిపోయింది.


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు జిల్లాలోని చీమకుర్తి ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నిక్షేపాల వ్యాపారంలో  చాలామంది కోట్లు సంపాదించారు. ఆర్థికంగా నిలదొక్కుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. దీంతో చాలాకాలం నుంచి రాజకీయ నాయకుల దృష్టి ఆ వైపు కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది మరింత పెరిగిపోయింది. క్వారీల్లో వాటాలు పొందటం లేక స్వాధీనం చేసుకోవటం నిక్షేపాలున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవటం లాంటి చర్యలకు ఒడిగట్టారు.  ఇప్పటికే రాష్ట్ర మైనింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న భూముల్లో రెండు కంపెనీల నుంచి ప్రముఖులు వాటా పొందిన విషయం తెలిసిందే.


కడప జిల్లాకు చెందిన ఒక నేత ఆ విషయంలో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు వెల్లడైంది. మరోవైపు ఆ రంగంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే చర్యలు పరాకాష్టకు చేరాయి. అందుకు టీడీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులపై చేస్తున్న దాడి నిదర్శనం. తాజాగా శనివారం వివాదంలో ఉన్న ఒక భూమి స్వాధీనానికి కొందరు సీమ ప్రాంతానికి చెందిన వారు ప్రయత్నించటం, చివర్లో అధికారపార్టీ నేతలే జోక్యం చేసుకుని దానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేయటం విశేషం. 


బెదిరింపులతో స్వాధీన యత్నం 

వివాదాస్పందంగా ఉన్న 65/1ఎ సర్వే నెంబరు భూమిలో శనివారం హైడ్రామా సాగింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తుల సహకారంతో ఆ భూమిలోకి ప్రవేశించిన వారు అక్కడున్న చిల్లచెట్లు కొట్టేసి భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ భూమిలోకి మరెవ్వరినీ ప్రవేశించకుండా వారు బెదిరించి మరీ భూమిలో ఉన్న చెట్లను కొట్టేసే కార్యక్రమం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు సైతం లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. సర్వే నెంబరు 65/1ఎతో పాటు 1బీలో కలిపి 13 ఎకరాలకుపైగా భూమి ఉంది. ఈ మొత్తం భూమిలో విలువైన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలున్నాయనేది సమాచారం. అయితే ఇందులోని 65/1ఏ లో ఉన్న 8.08ఎకరాల భూమిని పూర్వకాలంలో భూసేకరణ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ భూమిలో 132 మంది పేదలకు 1982లో నివాస స్థలాల పట్టాలిచ్చారు.


తదనంతరం ఆ పేదలు అక్కడ గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలో విలువైన గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని గమనించిన కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థల వారు లీజుకోసం దరఖాస్తు చేశారు. తదనుగుణంగా అక్కడ నివాసం ఉన్న పేదలను ఖాళీచేయించి ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి గ్రానైట్‌ లీజు పొందాలని ప్రయత్నించారు. అక్కడికి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దశాబ్దన్నర కాలం నుంచి ఆ ప్రయత్నంలో ఉన్నారు. 2004లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీమకు చెందిన కొందరు నాయకులే ఆ భూమి స్వాధీనానికి ప్రయత్నించారు. కానీ పేదలు అక్కడే నివసిస్తున్నందున వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే గత  ప్రభుత్వకాలంలో సదరు తొలి దరఖాస్తుదారుడైన నాయకుడు అప్పటి ఒక మంత్రి ఆర్థిక సహకారంతో పేదలను అక్కడినుంచి ఖాళీ చేయించారు. వారికి ప్రత్యేక కాలనీ ఏర్పాటుచేశారు. ఆ భూమి ఖాళీగా ఉన్నందున మైనింగ్‌ లీజు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కారణాలు ఏవైనా అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. 


కడప నేతల దృష్టి 

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత ఆ భూమిపై దృష్టిసారించారు. ఆయన, చిత్తూరు జిల్లాకు చెందిన మరో వైిసీపీ నేత కలిసి మొదటి దరఖాస్తుదారుడిగా ఉన్న వ్యక్తిని పిలిచి దరఖాస్తుని ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలిసింది. అందుకు ఆయన నిరాకరించటంతో బెదిరించినట్లు సమాచారం. తదుపరి మరో ఆరుగురు దరఖాస్తులు ఉన్నప్పటికీ తొలి దరఖాస్తుదారుడు ఒప్పుకుంటే మిగిలిన వారిలో వైసీపీ అనుయాయులే ఎక్కువగా ఉన్నారని, వారిని రంగం నుంచి తప్పించుకోవచ్చునని వారు భావించారు. ఈ నేపథ్యంలో ఆ భూమిపై పెట్టుబడి పెట్టిన మాజీ మంత్రి కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. దీంతో తొలి దరఖాస్తుదారుడు నెలరోజుల క్రితం హైకోర్టుకెళ్లారు. గనులు, భూగర్భశాఖ నిబంధనలకు అనుగుణంగా తన తొలి దరఖాస్తుకి ఇవ్వాల్సిన లీజుని అక్రమంగా వేరేవారికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని, అడ్డుకోవాలని వారు ఆ పిటిషన్‌లో కోరినట్లు తెలిసింది. విచారణ  చేపట్టిన న్యాయస్థానం మిగిలిన దరఖాస్తుదారులకు రెవెన్యూ, గనులు భూగర్భశాఖ అధికారులకు నోటీసులు జారీచేసింది.


కర్నూలు నేతల ప్రవేశం 

ఈ నేపథ్యంలో శనివారం ఆ భూమిలోకి ప్రవేశించి స్వాధీన యత్నం చేసిన నాయకులు భూమిపై తమకు హక్కుందంటూ వాదన ప్రారంభించారు. కనిగిరి మండలం దొడ్డిచింతల గ్రామానికి చెందిన కందుల వెంకటరెడ్డికి భూమిపై హక్కు ఉందని, అందుకే తాము స్వాధీనం చేసుకుంటున్నామని వారు వెల్లడించారు. అంతేగాక గతంలో అధికారులు సహకరించలేదని, ప్రస్తుత అధికారులపై నమ్మకం ఉంచి తాము రంగంలోకి వచ్చామని కూడా ప్రకటించారు. ఇప్పటికే వైసీపీకి చెందిన కడప, చిత్తూరు జిల్లాల ప్రముఖ నేతలిద్దరి దృష్టి ఈ భూమిపై ఉండగా వీరు రావటంలోని ఆంతర్యమేమిటని పరిశీలించగా కర్నూలు జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే సహకారంతో వారు రంగంలోకి వచ్చినట్లు తెలిసింది. కాగా మధ్యాహ్నానికి ఈ విషయం గుప్పుమని ఇప్పటికే ఆ భూమిపై దృష్టిసారించిన నేతల దృష్టికెళ్లింది. జిల్లాకు చెందిన నేతలు కూడా ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నం తర్వాత రంగంలోకి వెళ్లిన చీమకుర్తి తహసీల్దార్‌ భూమిలో ఉన్నవారితో మాట్లాడి వారి స్వాధీన ప్రయత్నానికి తాత్కాలిక బ్రేక్‌ వేశారు.


ఆ భూమి తమదేనన్న ఆధార పత్రాలు వారిస్తున్నారని, అలాగే వారికి సంబంధం లేదని మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారని ఇరువురి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి 20వ తేదీన సర్వే నిర్వహించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ప్రకటించారు. అయితే తొలినుంచి ఈ భూమి హస్తగతం కోసం ప్రయత్నిస్తున్న అధికారపార్టీ నేతలు, వారితో సంప్రదింపులు జరుపుతున్న ఆ భూమి తొలి దరఖాస్తుదారుని భాగస్వాములు జోక్యం చేసుకున్నందునే తహసీల్దార్‌ రంగంలోకి వచ్చి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీలోనే రెండు మూడు గ్రూపులుగా కొందరు నాయకులు ఈ భూమిపై దృష్టిసారించినందున రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది. 

Updated Date - 2020-08-09T11:04:39+05:30 IST