ఓబుళాపురంలో మళ్లీ ‘గాలి’ మైనింగ్‌!

ABN , First Publish Date - 2022-08-10T09:55:34+05:30 IST

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఇంకా తేలలేదు. అటు సరిహద్దు, ఇటు అక్రమ తవ్వకాల కేసులు అలాగే ఉన్నాయి.

ఓబుళాపురంలో మళ్లీ  ‘గాలి’ మైనింగ్‌!

తవ్వకాలకు ఏపీ సర్కారు అంగీకారం

అభ్యంతరం లేదని సుప్రీంకు వెల్లడి


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఇంకా తేలలేదు. అటు సరిహద్దు, ఇటు అక్రమ తవ్వకాల కేసులు అలాగే ఉన్నాయి. సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఖరారు చేసిన సరిహద్దు మ్యాపుపై కర్ణాటక సర్కారు సంతకాలు చేయలేదు. అయినా సరే... ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలకు ‘ఓకే’ అంటూ ఏపీ సర్కారు తన సమ్మతి తెలిపింది. ‘మాకే అభ్యంతరమూ లేదు’ అని ఇటీవల సుప్రీం కోర్టుకు తెలిపింది. వెరసి... రాష్ట్రంలో ‘గాలి’ వ్యవహారానికి జగన్‌ సర్కారు మళ్లీ తెరలేపిందనే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే... ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన గనులు, అటవీ పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి విభాగాలకు తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం గాలి జనార్దన రెడ్డి కంపెనీకి అనుకూలంగా అఫిడవిట్‌ వేసినట్లు సమాచారం! ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో పైస్థాయిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.


కాగా, ఏపీలోని  అనంతపురం - కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాల మధ్య బళ్లారి రిజర్వ్‌ ఫారెస్ట్‌  ఉంది. అనంతపురం జిల్లా డి.హీరేహల్‌ మండలం ఓబుళాపురం పరిధిలో ఆరు మైనింగ్‌ కంపెనీలు ఐరన్‌ఓర్‌ మైనింగ్‌ చేపట్టాయి. అందులో గాలి జనార్దన రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ(ఓఎంసీ)కి 133.98 హెక్టార్లలో మైనింగ్‌ లీజులు ఇచ్చారు. తన కిచ్చిన భూమితోపాటు ఇతరులకు లీజుకిచ్చిన భూమిలోనూ ఓఎంసీ ఐరన్‌ఓర్‌  తవ్వుకుంటోందని, ఏపీ-కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లను తొలగించేసి అడ్డగోలుగా మైనింగ్‌ చేసుకుంటోందని ఇతర కంపెనీలు ఆరోపించాయి. 2008లోనే  సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సరిహద్దు వివాదంపై విచారణకు సుప్రీం కోర్టు సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ)ని నియమించింది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి... ఇనుప ఖనిజం తవ్వకాలకోసం సరిహద్దును చెరిపివేశారని, భారీగా అక్రమాలు జరిగాయని 2009లో  కోర్టుకు తెలిపింది. అంతర్రాష్ట్ర సరిహద్దు తేల్చేవరకు మైనింగ్‌ను నిలిపివేయాలని నివేదించింది. ఈ మేరకు మైనింగ్‌ను నిలిపివేస్తూ 2009 నవంబరు 24న రోషయ్య నేతృత్వంలోని ఉమ్మడి రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 


కేసులన్నీ ‘గాలి’కేనా?

ఓబుళాపురం మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీలుఉ విచారణ చేపట్టాయి. ఓఎంసీ అధినేత  గాలి జనార్దన రెడ్డి, డైరెక్టర్లతోపాటు పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్‌ చేసి వారిపై తీవ్ర అభియోగాలు మోపింది. సీబీఐ కోర్టుల్లో ఆ కేసులు నడుస్తున్నాయి. చివరకు గాలి జనార్దన రెడ్డికి బెయిల్‌ ఇప్పించేందుకు న్యాయమూర్తులను కూడా ‘కొనుగోలు’ చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసులోనూ ఆయనపై  అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. పార్లమెంటులో రోజుల తరబడి ప్రస్తావనకు వచ్చింది. మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీలు కోర్టుల్లో చార్జిషీట్‌లు దాఖలు చేశాయి. అక్రమ తవ్వకాలు, అమ్మకాల ద్వారా ఓఎంసీ 4300 కోట్ల మేర వెనకేసుకుందని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. 


రైతుబీమా నమోదుకు 13 వరకు గడువు

హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రైతుబీమా పథకంలో లబ్ధిదారులుగా నమోదు చేసుకునేందుకు ఈనెల 13 వ తేదీ వరకు తుది గడువును  కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జూలై నెల 15 తేదీ నుంచి ఈనెల ఒకటో తేదీ వరకే రైతు బీమా దరఖాస్తులకు అవకాశం కల్పించింది. కానీ లబ్ధిదారుల నమోదుకు సమయం సరిపోలేదు. ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్న 38.98 లక్షల మంది రైతుల వెరిఫికేషన్‌, ఐడీల రెన్యువల్‌ చేయాల్సి ఉంది. అదేక్రమంలో 11.83 లక్షల మంది రైతుల వివరాలను కొత్తగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఈపక్రియకు సమయం సరిపోకపోవటంతో గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 13 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతుబీమా దరఖాస్తుల అప్‌లోడ్‌ పూర్తిచేయాలని, ఇంకా నమోదుచేసుకోని అర్హులైన రైతులు ఏఈవోలను సంప్రదించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు సూచించారు. 

Updated Date - 2022-08-10T09:55:34+05:30 IST