‘పేక’ప్‌..!

ABN , First Publish Date - 2021-11-13T06:26:46+05:30 IST

గుడివాడ ప్రాంతంలో పేకాట శిబిరాలను నిర్వాహకులు తాత్కాలికంగా మూసివేశారు.

‘పేక’ప్‌..!

గుడివాడ ప్రాంతంలో పేకాట శిబిరాలు తాత్కాలికంగా మూత

దాడులకు సెబ్‌ సమాయత్తం.. నిర్వాహకులు అప్రమత్తం 

ఈ ఏడాది జనవరిలోనూ సెబ్‌ దాడులు

అప్పట్లో పట్టుబడింది రూ.అర కోటి 

కీలక మంత్రి కనుసన్నల్లో రెండు నెలలుగా మళ్లీ శిబిరాలు

ఒక్క రోజు పేకాట టర్నోవర్‌ రూ.30 కోట్లకు పైనే 

గడ్డం గ్యాంగ్‌ తీరుపై అధినేతకు ఫిర్యాదులు

ఆయన ఆదేశాలతో దాడులకు సమాయత్తం


గుడివాడ ప్రాంతంలో పేకాట శిబిరాలను నిర్వాహకులు తాత్కాలికంగా మూసివేశారు. శిబిరాలపై దాడులకు సెబ్‌ మళ్లీ అప్రమత్తమవుతున్నట్టు సమాచారం రావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఒకసారి నందివాడ మండలంలో పేకాట శిబిరాలపై సెబ్‌ పెద్దఎత్తున దాడులు నిర్వహించింది. అప్పటి నుంచి కొంత కాలం తాత్కాలికంగా ఆగినా, మళ్లీ కొంత కాలంగా మంత్రి కనుసన్నల్లో ఈ శిబిరాలను నిర్వహించడం మొదలయింది. అయితే ఈ శిబిరాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడం, అధికార పార్టీ అధినేత వీటిని కట్టడి చేయాలని ఆదేశించడంతో దాడులకు సెబ్‌ సమాయత్తమవుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘పేకాట శిబిరాలపై ఎస్‌ఈబీ దాడులు అన్నీ ఉత్తుత్తివే. మళ్లీ నెల లోపే పేకాట శిబిరాలను ప్రారంభిస్తాం.’ ఈ ఏడాది జనవరిలో నందివాడ మండలం తమిరిసలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) దాడి తర్వాత శిబిరం నిర్వాహకుల నుంచి పేకాటరాయుళ్లకు అందిన ఫోన్‌ సమాచారం సారాంశం ఇది. నిర్వాహకులు అన్నట్టుగానే నెలలోపు కాకున్నా, ఏడు నెలల తరువాత పేకాట శిబిరాలు మళ్లీ తెరుచుకున్నాయి. నందివాడ, గుడివాడ రూరల్‌ మండలాల్లో రెండు నెలలుగా పెద్ద ఎత్తున పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. కీలక మంత్రి అనుచరులే వీటిని నిర్వహిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. గుడివాడ పరిసర ప్రాంతాల్లో మంత్రి అనుచరుల ఆధ్వర్యంలో నడిచే పేకాట శిబిరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పేకాటరాయుళ్లు తరలివస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువు గట్లపైన పెద్ద ఎత్తున పేకాట శిబిరాలను నిర్వహిస్తుంటారు.


చేపల చెరువులే కేంద్రంగా..

గుడివాడ రూరల్‌, నందివాడ మండలాల్లోని చేపల చెరువులే కేంద్రంగా ఈ పేకాట శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాలను ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రతిరోజూ మారుతుంటాయి. సెబ్‌ దాడుల తర్వాత నిర్వాహకులు మరింత అప్రమత్తమయ్యారు. రోజూ ఆడేవారికి కూడా ఆ రోజు పేకాట శిబిరం ఎక్కడ నిర్వహిస్తారో ముందుగా తెలియదు. ఈ శిబిరాల్లో రూ.10వేలు, రూ.లక్ష, రూ.10 లక్షలతో ఆటలు జరుగుతాయి. శిబిరానికి ప్రవేశ రుసుము ఉంటుంది. గతంలో ఈ రుసుము రూ.10వేలు ఉండగా, దాడుల అనంతరం రూ.20వేలు చేశారు. రోజుకు గతంలో 70 మందికి మాత్రమే ప్రవేశం  కల్పించేవారు. ప్రస్తుతం 100 మంది వరకు అనుమతి ఇస్తున్నారు. ఆటను బట్టి కమీషన్‌ వసూలు చేస్తారు. ఓడిపోయిన వారికి అప్పు ఇచ్చేందుకు అక్కడ మంత్రి మనుషులు సిద్ధంగా ఉంటారు. అప్పు ఇచ్చే ముందు తెల్లకాగితాలు, స్టాంప్‌ పేపర్లపై సంతకాలు తీసుకుంటారు. పేకాట శిబిరాల నుంచి నిత్యం రూ.10 లక్షలకు పైగా కమీషన్ల రూపంలో మంత్రికి చేరతాయి. ఈ శిబిరాల్లో ఒక్కరోజే రూ.30 కోట్లకు పైగా సొమ్ములు చేతులు మారతాయి. 


గడ్డం గ్యాంగ్‌ అరాచకాలపై ఫిర్యాదు

ఈ పేకాట శిబిరాల్లో డబ్బులు పోగొట్టుకున్న చాలామంది రోడ్డున పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడ్డం గ్యాంగ్‌ బాధితులు వందల సంఖ్యలోనే ఉంటారు. కానీ పరువు పోతుందనే భయంతో ఎవరూ బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. గడ్డం గ్యాంగ్‌కు ఇదే అదనుగా మారింది. వారి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ దందాలా, ఇప్పుడు గడ్డం గ్యాంగ్‌ పేకాట శిబిరాలతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న కుటుంబాలను రోడ్డుకీడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ శిబిరాల్లో నష్టపోయి రోడ్డున పడ్డ పలువురు ఈ శిబిరాల విషయాన్ని.. గడ్డం గ్యాంగ్‌ అరాచకాల్ని సెబ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పేకాట శిబిరాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన సెబ్‌ అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయినా పేకాట దందా ఆగకపోవడంతో ఈ విషయం తాడేపల్లిలోని కీలక నేతకు చేరింది. పేకాట శిబిరాలు పార్టీకి కీడు చేసేలా ఉన్నాయని భావించిన ఆ నాయకుడు.. వాటిని కట్టడి చేయాలని సెబ్‌కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో సెబ్‌ అధికారులు మరోసారి పేకాట శిబిరాలపై దాడులకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న గడ్డం గ్యాంగ్‌ రెండు రోజులుగా శిబిరాలకు సెలవిచ్చేయడం గమనార్హం. 

Updated Date - 2021-11-13T06:26:46+05:30 IST