ఆటలూ అవసరమే!

ABN , First Publish Date - 2021-01-17T05:30:00+05:30 IST

ముక్తాపురం గ్రామంలో ఉమేష్‌, మహేష్‌ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఉమేష్‌ ఉన్నత కుటుంబానికి చెందిన వాడు. మహేష్‌ది పేద కుటుంబం.

ఆటలూ అవసరమే!

ముక్తాపురం గ్రామంలో ఉమేష్‌, మహేష్‌ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఉమేష్‌ ఉన్నత కుటుంబానికి చెందిన వాడు. మహేష్‌ది పేద కుటుంబం. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఉమేష్‌కి చదువంటే ప్రాణం. ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని కూర్చునే వాడు. మహేష్‌కి ఆటలంటే ఇష్టం. చదువుపైన శ్రద్ధ పెట్టే వాడు కాదు. ఆటలంటే ఆసక్తి కనబరిచేవాడు. దాంతో ఉమేష్‌కి మంచి మార్కులు వచ్చేవి.


దాంతో ఉమేష్‌ ‘‘ఒరేమ్‌ మహేష్‌! నీకన్నా నేనే బెటర్‌. నాకు మంచి మార్కులు వచ్చాయని అందరూ మెచ్చుకుంటున్నారు’’ అంటూ దెప్పిపొడిచేవాడు. ఊర్లో వాళ్లు సైతం మహేష్‌ ఒట్టి అల్లరి వాడని అంటూ ఉండేవాళ్లు. అయితే మహేష్‌ ఆ మాటలేవి పట్టించుకునే వాడు కాదు. కానీ స్కూల్‌లో టీచర్‌ పాఠాలు చెబుతున్నప్పుడు మాత్రం శ్రద్ధగా వినేవాడు. కొన్ని రోజులకు పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల్లో ఉమేష్‌కు ప్రథమ స్థానం వచ్చింది. మహేష్‌కు మార్కులు బాగా తక్కువ వచ్చాయి. దాంతో మహేష్‌ తల్లి చాలా బాధపడింది.


‘నీకంటే ఉమేష్‌ మేలు. వారి తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చాడు’’ అని దండించింది. అయితే మహేష్‌ అదేమి పట్టించుకోకుండా...‘‘అమ్మా చదువే కాదు.. ఆటలు కూడా అవసరమే. అవే నన్ను ఏదో ఒక రోజు మంచిస్థానంలో నిలబెడతాయి’’ అన్నాడు. కొన్నిరోజుల తరువాత మహేష్‌ ఆటల్లో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రథమస్థానంలో వచ్చిన ఉమేష్‌ పోటీ పరీక్షలు రాయడం కోసం ప్రిపేర్‌ అయ్యేవాడు.

మహేష్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందడంతో రాష్ట్ర ప్రభుత్వం అభినందించి, ఉద్యోగం ఇచ్చింది. దీంతో మహేష్‌ తల్లితండ్రులు సంతోషించారు. చదువు ఒక్కటే కాదు, ఆటలు కూడా అవసరమేనని గుర్తించారు.


పంపినవారు : రజిత కొండసాని, పుట్టపర్తి, అనంతపురం


Updated Date - 2021-01-17T05:30:00+05:30 IST