గేమింగ్‌.. గోల్‌మాల్‌.. ప్యాకేజీల పేరిట మోసం

ABN , First Publish Date - 2021-06-03T14:00:31+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, స్నేహం, గిఫ్ట్‌, ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, బ్యాకింగ్‌, వైద్యం.....

గేమింగ్‌.. గోల్‌మాల్‌.. ప్యాకేజీల పేరిట మోసం

  • ఆన్‌లైన్‌ ఆట కంట్రోల్‌ మీ చేతిలో...
  • పోయిన డబ్బు పొందే అవకాశమంటూ ప్రచారం 
  • చిన్న మొత్తాలు కావడంతో ఫిర్యాదుకు ఆసక్తి చూపని బాధితులు

హైదరాబాద్‌ సిటీ : సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, స్నేహం, గిఫ్ట్‌, ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, బ్యాకింగ్‌, వైద్యం, కరోనా మందులు, వ్యాపారం, గేమింగ్‌ ఇలా ప్రతిచోటా సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉన్నారు. బ్యాంకింగ్‌ రంగాలపై వల వేసే సైబర్‌ నేరగాళ్లు అందిన కాడికి దోచేసేందుకు ప్రయత్నిస్తే గేమింగ్‌ కంట్రోల్స్‌ పేరుతో నేరాలు చేసేవాళ్లు ఎక్కువ మంది నుంచి చిన్న మొత్తాలు కాజేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్ల వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ ఫుడ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కానిచ్చేస్తున్నారు.. అలాగే మరికొంతమంది ఆన్‌లైన్‌ గేమింగ్‌లకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు గేమింగ్‌ కంట్రోల్స్‌ పేరుతో మోసానికి తెరతీశారు. తమ వద్ద ఉన్న చీట్‌ కోడ్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆడే గేమ్‌ను మనకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశముంటుందంటూ వీడియోలు తీసి యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. గేమింగ్‌ కంట్రోల్స్‌ కావాల్సిన వారు సంప్రదించాలంటూ ఫోన్‌ నెంబర్‌ను కూడా అదే వీడియోలో పెడుతున్నారు. ఎవరైనా ఆసక్తి కనబరిచి సంప్రదించిన వారి నుంచి చిన్న మొత్తాల్లో డబ్బు వసూలు చేసి స్పందించడం మానేస్తున్నారు. పోయింది స్పల్ప మొత్తమే కావడంతో ఫిర్యాదు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు.


లూడోలో డబ్బులు పోయాయా.. తిరిగి సంపాదించండి!

లాక్‌డౌన్‌లో ఇంటి పట్టునే ఉండి ఆన్‌లైన్‌ లూడో గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారా... మరేం పర్లేదు మీరు తిరిగి డబ్బులు సంపాదించుకునే సువర్ణ అవకాశం. ఆన్‌లైన్‌ గేమ్‌ అయినా ఎదురుగా కూర్చొని ఆడే గేమ్‌లో అయినా సరే మీకు కావాల్సిన నెంబర్‌ పడేలా చేసుకునే గేమింగ్‌ కంట్రోల్స్‌ నా వద్ద అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి అంటూ యూట్యూబర్‌ టెక్నికల్‌ విక్కీ వీడియోలు రూపొందిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారు ఫోన్‌ చేసేందుకు ఫోన్‌నెంబర్‌ కూడా వీడియోలో అందుబాటులో ఉంచాడు. అంతేకాకుండా సట్టా తరహాలో టక్సాల్‌ గేమ్‌ను రూపొందించి పెట్టుబడికి 9 రెట్లు సంపాదించే అవకాశముందంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఆటలో గెలిచేందుకు కంట్రోల్స్‌ కావాలని డబ్బులు కట్టిన వారికి కంట్రోల్స్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.


రూ. 5 వేల లోపే కావడంతో వెనుకంజ 

నగరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి మురళి (పేరు మార్చాం) లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా కొంతసేపు మొబైల్‌లో లూడో (అష్టా చెమ్మా) ఆడుకునేవాడు. ఆటలో ఎప్పుడూ గెలవాలంటే ఎలా అని యూట్యూబ్‌లో వెతికాడు. యూట్యూబ్‌లో టెక్నికల్‌ విక్కీ రూపొందించిన వీడియో చూశాడు. వీడియోలో ఉన్న నెంబర్‌పై గేమింగ్‌ కంట్రోల్స్‌ కావాలంటూ సంప్రదించాడు. ఫోన్‌ తీసిన వ్యక్తి తన స్నేహితుడిని సంప్రదించమంటూ మరో ఫోన్‌ నెంబర్‌ను పంపాడు. అతడిని సంప్రదించగా గేమింగ్‌ కంట్రోల్‌ కావాలంటే 3 నెలలు, 6 నెలల ప్యాకేజీ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. దానికి అంగీకరించిన మురళి అతడు సూచించిన నెంబర్‌కు రూ. 1400 ఆన్‌లైన్‌లో పంపాడు. ఆన్‌లైన్‌ గేమ్‌ కంట్రోల్స్‌ కావాలంటే కొన్ని ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని దానికి మరో రూ. 3వేలు ఖర్చవుతుందని తెలిపాడు. దానికి కూడా అంగీకరించిన మురళి అతడు చెప్పినట్లే మరో రూ. 3వేలు పంపాడు. అనంతరం ఫోన్‌ చేస్తే ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.


పోలీసులకు ఫిర్యాదు చేసుకో.. సైబర్‌ నేరగాళ్ల బరితెగింపు

డబ్బులు పంపినా గేమింగ్‌ కంట్రోల్స్‌ ఇవ్వకపోవడంతో టెక్నికల్‌ విక్కీ వీడియోలో ఉన్న నెంబర్‌కు పలుమార్లు మురళి ఫోన్‌ చేశాడు. నీ స్నేహితుడు కంట్రోల్స్‌ ఇస్తానంటూ మోసం చేశాడని తెలిపాడు. తనకు గేమింగ్‌ కంట్రోల్స్‌ అవసరం లేదు తన డబ్బు వాపస్‌ చేయమని కోరాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాడు. దానికి స్పందించిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ మోసాలు చేసేందుకే కంట్రోల్స్‌ కావాలనుకున్నావు. నువ్వు కూడా మోసం చేయాలనే ఉద్దేశంతోనే నన్ను సంపద్రించావు. నాకు ఎలాంటి భయం లేదు కావాలంటే కేసు పెట్టుకోమంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.


ఆటవిడుపు, ఆదాయ వనరు

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో కూర్చున్న వారికి టీవీ, మొబైల్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ వ్యాపకంగా మారాయి. బయటికి వెళ్లలేని కారణంగా ఇంట్లోనే కుటుంబం మొత్తం కలిసి ఉంటున్నారు వారు ఆటవిడుపు కోసం మొబైల్‌ గేమ్స్‌పై దృష్టి పెడుతున్నారు. మరికొందరు ఆటతో పాటు ఆదాయం సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. చిన్న మొత్తాల్లో బెట్టింగ్‌ పెట్టేవారిని వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చుతున్నారు.. బెట్టింగ్‌ మొత్తాలపై 10 శాతం కమిషన్‌ వసూలు చేస్తున్నారు. బెట్టింగ్‌ గేమ్‌ ఆడాలనుకునేవారు ముందుగా అడ్మిన్‌కు డబ్బులు ఆన్‌లైన్‌లో పంపుతారు. గ్రూప్‌లో గేమ్‌ బెట్టింగ్‌ వివరాలను అడ్మిన్‌ పోస్ట్‌ చేస్తాడు. ఆసక్తి ఉన్నవారు అంతే మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పంపుతారు. అప్పుడు అడ్మిన్‌ ఆన్‌లైన్‌ లూడో లింక్‌ను పంపుతాడు. గేమ్‌ పూర్తయిన తర్వాత... ఇద్దరిని సంప్రదించి ఎవరు గెలిచారో వారికి 10 శాతం కమిషన్‌ మినహాయించుకొని ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపుతారు. పదుల సంఖ్యలో వాట్సాప్‌ గ్రూప్‌లు పెట్టి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారిలో కొందరు గేమింగ్‌ కంట్రోల్స్‌కోసం ప్రయత్నించి రూ. 1400 నుంచి రూ. 5వేల వరకు పోగొట్టుకున్నారు. ఇలా డబ్బు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

Updated Date - 2021-06-03T14:00:31+05:30 IST