సౌత్‌ టీడీపీ ఇన్‌చార్జిగా గండి బాబ్జీ

ABN , First Publish Date - 2021-12-23T06:31:59+05:30 IST

నగరంలోని దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నియమితులయ్యారు.

సౌత్‌ టీడీపీ ఇన్‌చార్జిగా గండి బాబ్జీ

విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఏడాది క్రితం వైసీపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో బాబ్జీని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది.


దక్షిణలో పార్టీ జెండా ఎగురవేస్తాం: బాబ్జీ

దక్షిణ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని,  నాయకులు, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని గండి బాబ్జీ అన్నారు. బుధవారం సాయంత్రం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ సీనియర్లు, వార్డు స్థాయి నాయకులు, కేడర్‌తో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేసేలా కృషిచేస్తానన్నారు. ఇప్పటివరకు పెందుర్తిలో పార్టీ కోసం పనిచేశానని, అదే స్ఫూర్తితో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పనిచేస్తానన్నారు. పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి గెలుపు కోసం తన అనుచరులు పనిచేస్తారని, ఈ విషయాన్ని ఆయనకు ఫోన్‌ చేసి చెప్పానన్నారు. అదేవిధంగా విశాఖ దక్షిణలో పార్టీ గెలుపు కోసం సీనియర్ల సాయం తీసుకుంటానన్నారు. తనకు ఇన్‌చార్జి పదవి అప్పగించిన చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 


మెగా జాబ్‌ఫెయిర్‌ 

దరఖాస్తులను ఆహ్వానించిన ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ

25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

ఆన్‌లైన్‌లో స్ర్కీనింగ్‌ టెస్ట్‌ 

అనంతరం ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక  

30 కంపెనీల్లో 1,500 ఉద్యోగాల భర్తీ

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 22: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (అపిటా), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ (ఐటాప్‌) ఆధ్వర్యంలో మెగా జాబ్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండస్ట్రియల్‌ స్పెసిఫిక్‌  ట్రైనింగ్‌ ప్రొగ్రామ్‌ పేరుతో నిర్వహించనున్న ఈ జాబ్‌ఫెయిర్‌లో 30కి పైగా సంస్థలు 1,500కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయన్నారు. 2018 నుంచి 2021 వరకు ఇంజనీరింగ్‌ ఐటీ/సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, ఎంసీఏ, ఎమ్మెస్సీ 55 శాతం మార్కులతో పూర్తిచేసినవారు ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు, 2020-21లో ఏదైనా డిగ్రీ చేసినవారు బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 25వ తేదీలోగా ఠీఠీఠీ.్చఞటటఛీఛి.జీుఽ లేదా జ్ట్టిఞట://ఞట్ఛఛిజీౌఠటఛ్చిట్ఛ్ఛటట.ఛిౌఝ/జీట్టఞ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా కంపెనీలు వర్చువల్‌ విధానంలో స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తాయని, ఇందులో విజయం సాధించిన వారికి ఎంపిక చేసిన కంపెనీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. మిగిలిన వారికి జనవరి 19 నుంచి 35 రోజులపాటు విశాఖపట్నంలో శిక్షణ అందించి, ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా తర్ఫీదునిస్తామన్నారు. వివరాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ టోల్‌ ఫ్రీ నంబరు 99888 53335లో సంప్రతించాలన్నారు. 

Updated Date - 2021-12-23T06:31:59+05:30 IST