గాంధీ ఆస్పత్రి స్వీపర్‌ ఆత్మహత్యాయత్నం.. అసలు కథేంటి..!?

ABN , First Publish Date - 2022-06-03T20:16:44+05:30 IST

గాంధీ ఆస్పత్రి స్వీపర్‌ ఆత్మహత్యాయత్నం.. అసలు కథేంటి..!?

గాంధీ ఆస్పత్రి స్వీపర్‌ ఆత్మహత్యాయత్నం.. అసలు కథేంటి..!?

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ‘‘నాలుగు నెలల నుంచి జీతాలు లేవు.. ఇంటి అద్దె కట్టడం కష్టం అవుతోంది.. కొడుకుకు అన్నం పెట్టలేక.. చదివించలేక పోతున్నా’’ అంటూ మనస్తాపం చెందిన ఓ స్వీపర్‌ ఆత్మహత్యకు యత్నించింది. అంబర్‌పేటలో ఉంటున్న జ్యోతి(35) గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) ఏజిల్‌ సెక్యూరిటీ ఔట్‌సోర్సింగ్‌లో కొన్నేళ్లుగా స్వీపర్‌గా పనిచేస్తోంది. నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె శరీరంపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెతో ఏజిల్‌ సంస్థ ప్రతినిధులు చర్చిస్తున్నట్లు సమాచారం. 


డబ్బు వస్తుందని ఆమెను ప్రేరేపించారు..

జీతాలు రాకపోవడంతో మనస్తాపంతో కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాని బాధితురాలు వీడియోలో మాట్లాడింది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు ‘గాంధీ’ మీడియా గ్రూపులో సందేశం ఇస్తూ.. చికిత్స పొందుతున్న జ్యోతిని స్వయంగా కలిసానని, జీతాలకు, ఈ ఘటనకు సంబంధం లేదని, దురదృష్టవశాత్తు కొందరు స్వార్థపరులు ఆమెకు డబ్బు వస్తుందని తప్పుగా చెప్పమని ప్రేరేపించారని చెప్పారు. ఎవరైతే ప్రేరేపించారో వారిని గుర్తించామని, వాళ్లను విచారిస్తే తప్పు చేశామని అంగీకరించారని సూపరింటెండెంట్‌ తెలిపారు.

Updated Date - 2022-06-03T20:16:44+05:30 IST