గాంధీ నడయాడిన నేల

ABN , First Publish Date - 2022-08-10T05:12:50+05:30 IST

మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి ప్రదాత. అహింస అనే ఆయుధంతో బ్రిటీష్‌ పాలకులపై పోరాడిన ధీరుడు. దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించిన ఉక్కు పిడికిలి. భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించేందుకు ఆయన 1920, 30, 40ల్లో జిల్లాలో పర్యటించారు. ఆజాదీకా అమృతోత్సవాల సందర్భంగా ఆయన పర్యటన విశేషాలపై ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం ప్రత్యేక కథనం..

గాంధీ నడయాడిన నేల
సారవకోటలో గల మహాత్మగాంధీ స్మారక గ్రంథాలయం

ఉప్పుసత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల సమయంలో జిల్లాకు రాక
ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి నింపిన వైనం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

మహాత్మాగాంధీజీతో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. సిక్కోలో నీడలో.. బాపూజీ అడుగుజాడలెన్నో. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు.. ఉప్పు పంటకు పన్ను విధింపుపై బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాకు పలుమార్లు ఆయన విచ్చేసి.. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపారు. జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర సమరయోధులుగా గాంధీజీతో ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జిల్లాలో బాపూజీ అడుగుపెట్టిన స్థలాలు.. జిల్లాకు చెందిన సమరయోధులు చేపట్టిన ఉద్యమాల గురించి తెలుసుకుందాం.

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో....
స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ప్రజలను చైతన్య పరిచేందుకు మహాత్మగాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో 1942లో దూసి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. తెల్ల దొరలకు దొరకకుండా స్వాతంత్ర ఉద్యమకారులు దూసి సమీప ప్రాంతంలో రక్షణ పొందేవారు. అటువంటి సమయంలో మూడు పెట్టెలతో ఉన్న రైల్‌లో గాంధీజి దూసి వచ్చారు. అక్కడ నుంచే ప్రజలను ఉద్దేశించి బాపూజీ ప్రసంగించారు. ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు చౌదరి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజలు వెళ్లి గాంధీ ప్రసంగాన్ని విన్నారు.

- 1921లో విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర మహాసభలలో స్వాతంత్య్ర సమరయోధులు భోగరాజు పట్టాభిసీతారామయ్య ప్రసిద్ధ పొందూరు ఖాదీ వస్త్రాలను గాంధీకి బహుమతిగా ఇచ్చారు. అదే ఏడాది యంగ్‌ ఇండియా పత్రికలో పొందూరు ఖాదీ వాస్తవాలను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ గాంధీజీయే సంపాదకీయం రాశారు.  

-  దేశవ్యాప్తంగా ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమం వైపు చైతన్యవంతులను చేసే పనిలో భాగంగా 1927 డిసెంబర్‌ 2న జిల్లాకు వచ్చారు. విజయవాడలో నిర్వహించే దక్షిణ భారత హిందీ మహాసభలో పాల్గొనేందుకు వస్తూ 1940 జనవరి 20న దూసి వచ్చారు.
 
‘పేట’లో గాంధీజీ కోసం గెస్ట్‌హౌస్‌
నరసన్నపేట: బ్రిటీష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమాల్లో అత్యంత ప్రభావితం చేసినది.. ఉప్పు సత్యగ్రహం. ఉప్పుపై పన్ను రద్దు చేయాలని గాంధీజీ యావత్‌ దేశం తిరిగారు. అందులో భాగంగా సంతబొమ్మాళి మండలం నౌపడకు వచ్చారు. ఆ సమయంలో తిలారు రైల్వేస్టేషన్‌ నుంచి నరసన్నపేట వస్తారని.. 1930లో స్వాతంత్ర సమరయోధుడు పొట్నూరు స్వామిబాబు సంతకు వెళ్లేమార్గంలో గాంధీజీ విశ్రాంతి తీసుకునేందుకు భవనం నిర్మించారు. గాంధీజీ తిలారు రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా నౌపడకు వెళ్లడంతో నరసన్నపేట రాలేకపోయారు. కాగా ఆ భవనం  ఇప్పటికీ గాంధీ గెస్ట్‌హాస్‌గా పిలుస్తున్నారు. ఈ భవనంలో మాజీ రాష్ట్రపతులు బాబూరాజేంద్ర ప్రసాద్‌, వీవీ గిరిలు విశ్రాంతి తీసుకున్నారు.

పూండిలో విడిది
వజ్రపుకొత్తూరు : ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీ వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వేస్టేషన్‌ సమీపంలోని వరదావారి భవంతిలో మూడు రోజులు విడిది చేశారు. బ్రిటీష్‌ పాలనలో ఉప్పు పంటకు పన్నును వ్యతిరేకిస్తూ.. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. ఆ సమయంలో ఉప్పు పండించే ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించి.. రైతులకు మద్దతు పలికేవారు. ఈ క్రమంలో పూండి రైల్వేస్టేషన్‌లో దిగి నౌపడ ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. పూండిలో విడిది చేశారు.

రక్షణగా పీటీ నాయుడు  
ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీ ఒకసారి పలాస రైల్వేస్టేషన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో గాంధీజీకి రక్షణగా పుక్కళ్ళ తాతారావు (పీటీ) నాయుడు ఉన్నారు. వజ్రపుకొత్తూరుకి చెందిన పీటీ నాయుడు జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరు. గౌతు లచ్చనకు అనుచరుడు. గాంధీజీకి పలాస రైల్వేస్టేషన్‌లో రక్షణ ఏర్పాటు చేయాలని గౌతు లచ్చన్న.. పీటీ నాయుడుని కోరారు. దీంతో వజ్రపుకొత్తూరుకు చెందిన 12 మంది యువకులను సిద్ధం చేశారు. స్కౌట్‌యూనిఫారం వేయించి వారితోపాటు పీటీ నాయుడు గాంధీజీకి రక్షణగా నిలిచారని పీటీ నాయుడు కుమారుడు గురయ్యనాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

సారవకోటలో బస..
జలుమూరు : సారవకోట మెయిన్‌రోడ్డులోని బంగ్లాలో గాంధీజీ ఒకరోజు రాత్రి బస చేశారు. ఈ బంగ్లా స్థలంలో ప్రస్తుతం గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. దీనికి శ్రీ మహాత్మగాంధీ స్మారక భవనమని నామకరణం చేశారు. సారవకోటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన అప్పలస్వామి పిలుపు మేరకు గాంధీజీ నరసన్నపేట నుంచి మెళియాపుట్టి వెళ్తుండగా.. 1927 డిసెంబరు 3న సారవకోటలో బస చేశారు. అప్పట్లో గాంధీజీకి బొప్పాయి, అరటిపండ్లు, ఖర్జూరం, మేకపాలు అల్పాహారంగా అందించారు. ఈ బంగ్లాను కొన్నేళ్లు వసతిగృహంగా నిర్వహించారు. అనంతరం 1990లో మండల పరిషత్‌ అధ్యక్షుడు చిన్నాల కృష్ణారావు కృషితో.. నాటి కలెక్టర్‌ రూ.2 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో భవనాన్ని నూతనంగా నిర్మించి.. గాంధీజీ స్మారక గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయం శిథిలావస్థకు  చేరుకుంది.
      
మెళియాపుట్టిలో ఖాదీషాపు ప్రారంభం
మెళియాపుట్టి: గాంధీజీ 1927 డిసెంబరు 3న మెళియాపుట్టి వచ్చారు. గ్రామానికి చెందిన దుక్క రాజన్నరెడ్డి.. గాంధీజీతో ఖాదీ షాపును ప్రారంభించారు. దీనికి గాంధీ మండపంగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఖాళీ స్థలంగా దర్శనమిస్తోంది. అలాగే మెళియాపుట్టిలో బస చేశారు. ఇక్కడ నుంచి నౌపడ వెళ్లారు. ఈ స్థలంలో ప్రస్తుతం సాయిబాబా ఆలయం నిర్మించారు. 1930లో ఖాదీ ఉద్యమంతో పాటు హరిజనోద్ధరణ వంటి కార్యక్రమాల్లో గాంధీజీ పాల్గొన్నారు. దుక్క రాజన్నరెడ్డి, డబారు గ్రామానికి చెందిన తెగవలస జోగులు, దుక్క సూర్యనారాయణరెడ్డి, కొసమాళ గ్రామానికి చెందిన అంకడాల లక్ష్మీనారాయణ, లుగలాపు లక్ష్మణదాస్‌, గేదెల చంద్రయ్యనాయుడు తదితరులు ఉప్పుసత్యాగ్రహం, స్వాతంత్య్ర ఉద్యమాల్లో గాంధీజీతో కలిసి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:12:50+05:30 IST