గాంధీజీ విశ్వమానవుడు

ABN , First Publish Date - 2022-08-09T09:48:30+05:30 IST

గాంధీజీ విశ్వమానవుడని.. అటువంటి మహాత్ముడిపై వెకిలి... మకిలి చేష్టలు చేయడం దారుణమని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

గాంధీజీ విశ్వమానవుడు

మహాత్ముడిపై వెకిలి, మకిలి చేష్టలు దారుణం

చిల్లర మాటలు.. చీలికల రాజకీయాలు సరికావు

మహనీయుల స్ఫూర్తి, వజ్రోత్సవ దీప్తి ఊరూరా

స్వాతంత్య్ర వజ్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో కేసీఆర్‌

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో వేడుకలకు శ్రీకారం

రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన ప్రజాప్రతినిధులు


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): గాంధీజీ విశ్వమానవుడని.. అటువంటి మహాత్ముడిపై వెకిలి... మకిలి చేష్టలు చేయడం దారుణమని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీని కించపరిచే దురదృష్టకర సంఘటనలను ఇటీవలికాలంలో చూస్తున్నామని ఇది ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. అటువంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా అంతా ఏకకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు.


చిల్లర మాటలు.. చీలికల రాజకీయం ఎంతమాత్రం సరికావని.. అలాంటి ఆలోచనలతో చేసే ప్రయత్నాలు ఎన్నడూ నెరవేరవని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. రాష్ట్ర సర్కారు తలపెట్టిన స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారం హెచ్‌ఐసీసీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వజ్రోత్సవ కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఉదయం 11.35 గంటలకు ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేదికపై ఏర్పాటుచేసిన మహాత్మాగాంధీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి.. రాష్ట్ర ప్రజానీకానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ సందేశాన్ని వినిపించారు. దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను భావితరాలకు చాటాలని.. ఆ పోరాట స్ఫూర్తిని వారిలో రగించాలని, వజ్రోత్సవ దీప్తిని ఊరూరా చాటాలని పిలుపునిచ్చారు.


తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న  సమయంలో.. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంలో గాంధీజీ గురించి ప్రస్తావించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ‘గాంధీజీ ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే... ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ అని ఆయన అన్నప్పుడు భారతీయులందరి గుండెలూ పులకించిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా.. ఐన్‌స్టిన్‌, నెల్సన్‌ మండేలా వంటి ఎందరో ప్రముఖులకు మహాత్ముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ తదితర స్వాతంత్య్ర సమరయోధులు.. సంస్థానాలన్నింటినీ విలీనం చేయడం ద్వారా దేశాన్ని ఒకటి చేస్తే, ఇప్పుడు కొన్ని చిల్లర మల్లర ప్రయత్నాలతో జాతిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అలాంటి కుట్రలను ఖండించాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆదేశించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కాగా.. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చేపట్టిన సిపాయిల తిరుగుబాటు, దండి మార్చ్‌ వంటి కీలక ఘట్టాలు.. ఇతిహాసాలకన్నా తక్కువేమీ కాదని ఉత్సవ కమిటీ చైర్మన్‌ కేకే పేర్కొన్నారు.


స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రకటించనుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని.. కొన్ని రాజకీయ శక్తులు భారతీయ సంస్కృతికి ప్రతీకయిన భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సబ్బండవర్గాలు, సబ్బండ జాతుల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి, దేశానికి తెలంగాణ రాష్ట్రమే ఆశాజ్యోతిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఇక.. గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వివరించారు. అనంతరం 22వ తేదీ వరకూ రోజువారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ వేడుకల్లో అన్ని ప్రభుత్వశాఖలు, అన్ని వర్గాలూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-08-09T09:48:30+05:30 IST