గాంధీజీ అసాధారణ వ్యక్తి

ABN , First Publish Date - 2022-04-22T06:45:21+05:30 IST

మహాత్మా గాంధీ అసాధారణ వ్యక్తి అని బ్రిటన్‌ ప్రధాని

గాంధీజీ అసాధారణ వ్యక్తి

  • ‘సబర్మతి’కి రావడం నా అదృష్టం 
  • చరఖా తిప్పిన బోరిస్‌ జాన్సన్‌ 
  • ‘జేసీబీ’ బుల్‌డోజర్‌ ఎక్కి హల్‌చల్‌
  • 2 రోజుల పర్యటనలో బ్రిటన్‌ ప్రధాని
  • నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో చర్చలు

 

అహ్మదాబాద్‌, ఏప్రిల్‌ 21: మహాత్మా గాంధీ అసాధారణ వ్యక్తి అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కొనియాడారు. రెండురోజుల భారత్‌ పర్యటనలో భాగంగా గురువారం ఆయన గుజరాత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గాంధీ నివసించిన గుడిసె హృదయ్‌ కుంజ్‌లో చరఖా తిప్పారు. ఈ ఆశ్రమానికి రావడం తన అదృష్టమని సందర్శకుల పుస్తకంలో రాసి సంతకం చేశారు. కాగా, 1947 తర్వాత గుజరాత్‌లో పర్యటించిన, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ కావడం విశేషం.


కాగా శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో బోరిస్‌ భేటీ కానున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, దౌత్య, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరపనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భారతీయ వృత్తి నిపుణులకు మరిన్ని వీసాలు మంజూరు చేసే అంశంపై జాన్సన్‌ సానుకూలత వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఉండటం చాలా అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్‌ చేశారు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం విషయంలో భారత్‌ తటస్థ వైఖరిపై తాను మోదీకి లెక్చర్లు దంచబోవడం లేదని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా యూకే, రష్యా మధ్య ఉన్న సంబంధాల కంటే భారత్‌, రష్యా చారిత్రకంగా చాలా భిన్నమైన సంబంధాలను కలిగి ఉన్నాయని అందరికీ అర్థమైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.




కాగా పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని బోరిస్‌ జాన్సన్‌ కలిశారు. ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌, వాతావరణం, ఏరోస్పేస్‌, రక్షణ రంగంలో సహకారం తదితర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. యూకే ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ స్కాలర్‌షి్‌పల్లో ఒకటైన చెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌ ద్వారా భారత యువత కోసం అకడమిక్‌ ఫెసిలిటేషన్‌ ప్రోగ్రామ్‌ను సైతం అదానీ ప్రకటించారు. జూన్‌ 28న లండన్‌లో జరగనున్న ఇండియా-యూకే క్లైమేట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సదస్సుకు రావాలని బ్రిటన్‌ ప్రధానిని ఆయన ఆహ్వానించారు.


కాగా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలసి బోరిస్‌ జాన్సన్‌ వడోదర సమీపంలోని హలోల్‌ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బ్రిటన్‌కు చెందిన బుల్‌డోజర్ల తయారీ కంపెనీ జేసీబీని సందర్శించి, రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్లాంట్‌ పరిసరాలను పరిశీలిస్తున్న సందర్భంగా ఆయన హఠాత్తుగా అక్కడే ఉన్న ఒక బుల్‌డోజర్‌పైకి ఒక్క ఉదుటున ఎక్కారు. డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చొని స్టార్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. 


Updated Date - 2022-04-22T06:45:21+05:30 IST