నీరు పారేదెలా..?

ABN , First Publish Date - 2020-12-02T04:01:01+05:30 IST

గండిపాళెం చెంచురామయ్య జలాశయం మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వరికుంటపాడు మండలాలకు వరప్రసాదిని. తుఫాన్‌ ప్రభావంతో జలాశయంలో ప్రస్తుతం 30 అడుగులకుపైగా నీరు చేరడంతో రైతుల్లో వ్యక్తమైన ఆనందం అంతలోనే మాయమైంది.

నీరు పారేదెలా..?
ముళ్లచెట్లతో మూసుకుపోయిన జలాశయం ఎడమ కాలువ

‘గండిపాళెం’ కాలువలు అధ్వానం

జలాశయానికి పుష్కలంగా నీరు

భారీ వర్షాలతో రైతుల ఆందోళన

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 1: గండిపాళెం చెంచురామయ్య జలాశయం మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వరికుంటపాడు మండలాలకు వరప్రసాదిని. తుఫాన్‌ ప్రభావంతో జలాశయంలో ప్రస్తుతం 30 అడుగులకుపైగా నీరు చేరడంతో రైతుల్లో వ్యక్తమైన ఆనందం అంతలోనే మాయమైంది. జలాశయం కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు అధ్వానంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ జలాశయం పూర్తి నీటిమట్టం 35 అడుగులు కాగా తుఫాన్‌ ప్రభావంతో జలాశయంలోకి 30 అడుగులకుపైగా నీరు చేరింది. జలాశయం కుడి, ఎడమ కాలువల కింద ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లో 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు చేరే కాలువలన్నీ పూడిపోయి, కొన్ని కాలువలకు లైనింగ్‌ దెబ్బతిని ఉంది. డిస్ట్రిబ్యూటరీలు సైతం ముళ్లకంపలతో మూసుకుపోయాయి. 

ఆధునికీకరణ పనులతో ఫలితం శూన్యం

జలాశయానికి 2009లో పూర్తిస్థాయిలో నీరు చేరింది. 2012లో జపాన్‌ నిధులు రూ.25 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనుల లక్ష్యం చివరి ఆయకట్టుకు నీరు అందించడమే. అయితే 2009 తరువాత 2015లో కేవలం 15 అడుగులు మాత్రమే నీరొచ్చింది. ఆ నీటిని ఆరుతడి పంటల కోసం కాలువలకు విడుదల చేసినా రైతులకు అంతగా ప్రయోజనం చేకూరలేదు. ఆ తరువాత కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో కాలువల లైనింగ్‌ దెబ్బతిని, ముళ్ల చెట్లతో పూడిపోవడంతో పాటు క్లస్టర్‌ గేట్లు, తూములు దెబ్బతిన్నాయి. దీంతో 2012లో చేసిన ఆధునికీకరణ పనులు ప్రయోజనం లేకుండా పోయాయి. ప్రస్తుతం జలాశయానికి 30 అడుగులకుపైగా నీరు చేరడం, ఇంకా వరద వస్తుండడంతో పూర్తి స్థాయిలో జలాశయం నిండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దిగువకు నీరు విడుదల చేయాలన్నా, పంటలకు సరఫరా చేయాలన్నా నీరు సాఫీగా సాగే పరిస్థితి లేదు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు కాలువల్లో పూడిక తీసిన తరువాతే నీరు విడుదల చేయాలని కోరుతున్నారు.  మరోవైపు గండిపాళెం చెంచురామయ్య జలాశయాన్ని తిలకించేందుకు వెళుతున్న సందర్శలూ రోడ్డు సదుపాయం లేక  అవస్థలు పడుతున్నారు.

పూడికతీత పనులు చేపడతాం

జలాశయంలో ప్రస్తుతం 30 అడుగులకు పైగా నీరు ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు కాలువల్లో పూడికతీత పనులు, ముళ్లచెట్లను తొలగిస్తాం. కాలువల పనులు చేపట్టిన తర్వాతే నీరు విడుదల చేస్తాం.

- రవి, ఇరిగేషన్‌ డీఈ





Updated Date - 2020-12-02T04:01:01+05:30 IST