మహిళా దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-08-03T05:40:04+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు గుంటూరు, కృష్ణా, చిత్తూరు, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చోరీలకు పాల్పడిన మహిళా దొంగల ముఠాను రాజాం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

మహిళా దొంగల ముఠా అరెస్టు
వివరాలను వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు


ఆరు జిల్లాల్లో చోరీలు ఫ ఒక్కొక్కరిపై 20కి పైగా కేసులు

రాజాం రూరల్‌, ఆగస్టు 2: జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు గుంటూరు, కృష్ణా, చిత్తూరు, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చోరీలకు పాల్పడిన మహిళా దొంగల ముఠాను రాజాం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాజాంలో రెండు బంగారు దుకాణాల్లో దొంగతనానికి పాల్పడిన వీరు గార్రాజు చీపురుపల్లి జంక్షన్‌ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఆ మేరకు... ఐదుగురు మహిళలతో పాటు ఒక పురుషుడిని అదు పులోకి తీసుకుని వీరి నుంచి 41 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఈర్లపాడుకు చెందిన బి.జ్ణాణమ్మ, గోకరాజుపల్లికి చెందిన బి.ఆదెమ్మ, ఖమ్మం జిల్లా రామపట్నంకు చెందిన నాగేంద్రమ్మ, వెంకటరమణ, దీనమ్మ, శకున వీడుకు చెందిన వై.విజయకుమార్‌ ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కారుపై ప్రయాణిస్తూ చిన్న బంగారు దుకాణాలను టార్గెట్‌ చేస్తారు. షాపుల్లో దూరిన ఐదుగురు మహిళలు పెద్ద ఆభరణాలపై దృష్టి పెట్టకుండా చెవి రింగులు, దుద్దులు ఇతర వస్తువులు కొనేలా నాటకీయంగా వ్యవహరిస్తారు. ఆయా వస్తువులు చూపించిన వెంటనే ఒకటో రెండో వస్తువులను చాకచక్యంగా తప్పించి వాటి స్థానంలో తమ వద్ద ఉన్న రోల్డ్‌గోల్డు వస్తువులను పెడతారు. ఆ వస్తువులు నచ్చలేదంటూ ఉడాయిస్తారు.  రాజాంలోని రెండు షాపుల్లో చోరీకి పాల్పడ్డారని,  అలాగే జిల్లాలోని పాలకొండ, పలాస, ఆముదాలవలస పట్టణాల్లో కూడా చోరీ చేశారని ఆయన తెలిపారు.  సమావేశంలో ఎస్‌.ఐ. సూర్యకుమారి ఉన్నారు. 

 



Updated Date - 2021-08-03T05:40:04+05:30 IST