గురువుల గగ్గోలు

ABN , First Publish Date - 2022-08-17T08:45:06+05:30 IST

ఉపాధ్యాయుల ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) యాప్‌ తొలిరోజే చుక్కలు చూపించింది. యాప్‌లో హాజరు వేసేందుకు టీచర్లు నానా తంటాలు పడ్డారు.

గురువుల గగ్గోలు

  • టీచర్లకు హాజరు కష్టాలు 
  • యాప్‌ ఓపెన్‌ కాక తిప్పలు 
  • తొలిరోజే మొరాయించిన సర్వర్‌తో అవస్థ 
  • బడుల్లో ఫోన్లు పట్టుకుని కుస్తీలు 
  • ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్‌ ఎర్రర్‌ 
  • 23 వేల మందికే యాప్‌లో హాజరు నమోదు 
  • దాదాపు 90% మంది మాన్యువల్‌గానే
  • సర్వర్‌ నిర్వహణలో సర్కారు విఫలం 
  • ప్రభుత్వమే పరికరాలు ఇవ్వాలి 
  • మా సొంత ఫోన్లలో హాజరు వేయం 
  • తేల్చిచెప్పిన ఉపాధ్యాయ సంఘాలు 
  • ఎంఈవోలు, హెచ్‌ఎంలకు వినతిపత్రాలు 
  • వాడాల్సిందేనన్న పాఠశాల విద్యాశాఖ 
  • యాప్‌ డౌన్లోడ్‌ను బహిష్కరించిన టీచర్లు

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) యాప్‌ తొలిరోజే చుక్కలు చూపించింది. యాప్‌లో హాజరు వేసేందుకు టీచర్లు నానా తంటాలు పడ్డారు. మంగళవారం ఉదయం 8నుంచి 9గంటల మధ్య యాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించగా లాగిన్‌ ఎర్రర్‌ చూపించింది. అదే సమయంలో సర్వర్‌ కూడా మొరాయించింది. 9గంటలు దాటితే సెలవు కిందకు వస్తుందనే భయంతో టీచర్లు పదేపదే లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు  అదేపనిగా ఫోన్లు పట్టుకుని ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాగిన్‌ కాలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత సమయానికి 10శాతం మం ది కూడా ముఖ హాజరు యాప్‌లో ఫొటోలు తీయలేదని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొన్నా యి. మధ్యాహ్నం తర్వాత యాప్‌ ఓపెన్‌ కావడంతో కొంతమంది హాజరు వేసుకున్నా రు. అయితే మొత్తం కలిపినా కూడా 23వేల మంది మాత్రమే యాప్‌ ద్వారా హాజరు వేసుకున్నట్లు సమాచారం. 


మిగిలిన వారం తా ఎప్పటిలాగే మాన్యువల్‌ విధానంలోనే హాజరు నమోదు చేశారు. కాగా, ఈ అంశం పై పాఠశాల విద్యాశాఖతో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జరిపిన చర్చ లు ఫలించలేదు. టీచర్ల సొంత ఫోన్లలో కా కుండా ప్రభుత్వమే డివైజ్‌లు ఇచ్చి హాజరు తీసుకోవాలని ఫ్యాప్టో నేతలు డిమాండ్‌ చేశారు. అయితే ఆర్థిక భారంతో కూడుకున్నందున అది సాధ్యం కాదని పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని అమలుచేసి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో దీనిపై స్పష్టత వచ్చేవరకూ యాప్‌ను వినియోగించొద్దని ఉపాధ్యాయులకు ఫ్యాప్టో సూచించింది. ముఖ హాజరు విధానంపై కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ స్మార్ట్‌ఫోన్లు లేవని, ఉన్నా యాప్‌లపై అవగాహన లేదని టీచర్లు వాదిస్తున్నారు. ఏదేమైనా అందరూ ముఖ హాజరు వేయాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంకా చాలాచోట్ల టీచర్ల పేర్లను హెచ్‌ఎంలు రిజిస్టర్‌ చేయలేదు. దీంతో మంగళవారం సగం మందే లాగిన్‌కు ప్రయత్నించా రు. అంటే 1.7 లక్షల మంది టీచర్లు ఒకేసారి లాగిన్‌ అయ్యే సామర్థ్యం ఉన్న సర్వర్లను ఏర్పా టు చేయలేకపోయారు. హడావిడిగా యాప్‌ అమలుకు ఒత్తిడి తెచ్చి చివరికి అభాసుపాలైంది. 


ఫోన్లపై తేలని రగడ 

ప్రభుత్వం పరికరాలు ఇచ్చి ఎలాంటి హాజరు విధానం తెచ్చినా అమలుకు సిద్ధమేనని టీచర్లు తేల్చిచెబుతున్నారు. దీనికోసం తమ సొంత మొబైల్‌, సొంత డేటా ఎందుకు వినియోగించాలని ప్రశ్నిస్తున్నారు. కానీ అందరికీ ఫోన్లు కొనివ్వాలంటే భారీగా ఆర్థిక భారం పడుతుందని, సొంత ఫోన్లే వాడాలని సర్కారు  పేర్కొంటోంది. ఇదే పంథా కొనసాగిస్తే అసలు మొత్తం యాప్‌లు వాడకుండా నిరసన తెలపాలని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. సొంత ఫోన్లు పాఠశాలలకు తీసుకురాబోమని, ప్రభుత్వం ఇచ్చే డివైజ్‌లలోనే హాజరు తీసుకోవాలని ఎంఈవోలు, హెచ్‌ఎంలకు రాష్ట్రంలో పలుచోట్ల ఉపాధ్యాయులు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో ఈ వివాదం ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. 


జిల్లాల్లో యాప్‌ తిప్పలు 

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో ఎస్‌పీఎన్‌ఆర్‌సీ హైస్కూల్‌, జడ్పీ హైస్కూల్స్‌లో యాప్‌ అసలు ఓపెన్‌ కాలేదు. కృష్ణాజిల్లా ఉంగుటూరు జడ్పీ హైస్కూల్‌లో సమయానికి టీచర్లు వచ్చినా... సర్వర్‌ ప్రాబ్లమ్‌తో హాజరు పడలేదు. సాయంత్రం ఇంటికి 

వెళ్లే సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులకు హాజరు పడింది. కానుమోలు హైస్కూల్‌లో 15 మంది ఉపాఽధ్యాయులు ఉదయం 11గంటలకు ఫొటో తీసుకున్నా అప్‌డేట్‌ మాత్రం కాలేదు. 


అనంతపురం జిల్లాలో మొత్తం 8,852 మంది టీచర్లుంటే తొలిరోజు యాప్‌లో కేవలం 1,228 మంది మాత్రమే హాజరు నమోదు చేసుకున్నారు. 3,517 మంది యాప్‌లో రిజిస్టర్‌ అయ్యారు. సర్వర్‌ మొరాయించడంతో చాలామంది అవస్థలు పడ్డారు. నెట్‌వర్క్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో మరింత ఇబ్బంది పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో సమస్య తలెత్తింది. ఈ జిల్లాలో 10శాతం మంది కూడా రిజిస్టర్‌ చేసుకోలేదు. 


కర్నూలు జిల్లాలో 7,697 మంది టీచర్లలో 2,175 మంది రిజిస్టర్‌ చేసుకున్నా... తొలిరోజు 588 మంది మాత్రమే యాప్‌ ద్వారా హాజరు నమోదు చేశారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సీతంపేట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, కురుపాం మండలాల్లో ఉపాధ్యాయులు ముఖ హాజరు నమోదుకు నానా అవస్థలు పడ్డారు. అనేక పాఠశాలల్లో యాప్‌ డౌన్‌లోడ్‌కు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

విజయనగరం జిల్లాలో నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తాయి. చాలాచోట్ల యాప్‌ డౌన్లోడ్‌ కాలేదు. ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకత్వాల పిలుపు మేరకు చాలామంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. కొందరు డౌన్‌లోడ్‌ చేసుకున్నా ఫొటో కేప్చర్‌ కాకపోవటంతో అవస్థలు పడ్డారు.  

తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 9 గంటల సమయానికి ఆయా పాఠశాలల ఎదుట నిలబడి 64 శాతం మంది సెల్ఫీలు తీసుకుని విద్యాధికారులకు పంపించారు.  

శ్రీకాకుళం జిల్లాల్లో ఉదయం 8 గంటలకే టీచర్లు పాఠశాలలకు చేరుకొని యాప్‌లో వివరాలు నమోదుచేసుకున్నారు. కానీ సర్వర్‌ డౌన్‌, సాంకేతిక సమస్యలతో హాజరు నమోదు ఫెయిల్డ్‌గా చూపింది. 

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ ఆదేశాలను బహిష్కరించారు. ఫ్యాఫ్టో ఇచ్చిన పిలుపు మేరకు దీనిని ఒక ఉద్యమంగా అమలు చేశామని యూటీఎఫ్‌, ఎస్టీయూ నాయకులు తెలిపారు. 


టీచర్లపై ఒత్తిడి చేస్తున్నారు: ఎస్టీయూ 

హాజరు విషయంలో ప్రభుత్వం టీచర్లపై ఒత్తిడి చేస్తోందని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, తిమ్మన్న ఆరోపించారు. ఎలాంటి పరికరాలు లేకుండా ముఖ హాజరు విధానం అమలుచేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త హాజరుకు తాము వ్యతిరేకం కాదని, కానీ సొంత ఫోన్లలోనే ఫొటోలు తీసుకోవాలనడం సరికాదన్నారు. ప్రభుత్వం పరికరాలు ఇచ్చే వరకూ యాప్‌ను వినియోగించబోమని నేతలు స్పష్టం చేశారు.


ముఖ హాజరు ఎందుకు?: కత్తి 

టీచర్లకు బయోమెట్రిక్‌ హాజరు విధానం ఉండ గా దానిస్థానంలో ముఖ హాజరు విధానం ఎందుకు ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రశ్నించారు. వెంటనే ఈ యాప్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బోధనేతర పనులతో టీచర్లు సతమతమవుతున్నారని, ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, కొత్త సమస్యలు సృష్టించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.

Updated Date - 2022-08-17T08:45:06+05:30 IST