అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-02T05:58:53+05:30 IST

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌
స్వాధీనం చేసుకున్న సొత్తును చూపుతున్న సీఐ సత్యనారాయణ

 భువనగిరి టౌన, అక్టోబరు 1: అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వారినుంచి రూ.4లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పట్టణ ఇన్సపెక్టర్‌ బి.సత్యనారాయణ భువనగిరిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌ చింతల్‌ జీడిమెట్లకు చెందిన మణిగండ్ల విజయ్‌కుమార్‌ జైళ్లలో పరిచయం అయిన నిందితులతో కలిసి ముఠాను ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో భువనగిరి రాంనగర్‌లోని సొంత ఇంట్లో నివాసం ఉండే గూడూరు భాస్కర్‌రెడ్డి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన వలిగొండ మండలం ఎదుల్లగూడేనికి గత నెల 4న వెళ్లాడు. అదే రోజు రాత్రి విజయ్‌కుమార్‌ దొంగల ముఠా ఇంటి తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించి 18తులాల బంగారు ఆభరణాలు, ఒక తులం వెండి సామాగ్రి, రూ.10వేల నగదు అపహరించుకుపోయారు. మరునాడు ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రహించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో భాస్కర్‌రెడ్డి కుటుంబ సబ్యులు ఇంటికి వచ్చి చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ ఇన్సపెక్టర్‌ బి.సత్యనారాయణ, డిటెక్టివ్‌ ఇన్సపెక్టర్‌ బి.వెంకటయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. అయితే శనివారం భువనగిరి పట్టణ శివారులోని డాల్ఫిన హోటల్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేయగా  విజయ్‌కుమార్‌తో కలిసి మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్న జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్‌, అమృతం, రామంతపూర్‌ శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న జనగామ జిల్లా రఘునాఽథపురం మండలం కంచనపల్లికి  చెందిన బుంగ మహేష్‌, వరంగల్‌కు చెందిన కొసుకొండ రాఖేష్‌ భువనగిరి రాంనగర్‌లో చోరీకి పాల్పడిన ముఠాగా తేలింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి చోరీకి గురైన బంగారు అభరణాలను నగదును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. అయితే విజయ్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని పలు పోలీస్‌ స్టేషన్లలో 40కి పైగా దొంగతనం కేసులు ఉండగా నల్లగొండలోని జిల్లా కారాగారంలో 16 నెలల శిక్ష అనుభవించి గత అగస్టు 3వ వారంలో జైలు నుంచి విడుదలై పాత ముఠాను చేరదీసి తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.  ఈ ముఠాపై కల్వకుర్తి, ఖమ్మంతో పాటు పలు పోలీస్‌ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయి. దసరా సెలవుల్లో ఊరికి వెళ్లే వారు విధిగా పోలీసులకు, కాలనీ వాసులకు సమాచారం ఇవ్వాలని ఇంట్లో విలువైన వస్తువులు, నగదును ఉంచరాదని సూచించారు.   

Updated Date - 2022-10-02T05:58:53+05:30 IST