రాజధానిలో నడిరోడ్డుపై.. కారులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

ABN , First Publish Date - 2022-06-04T08:36:09+05:30 IST

సెలబ్రిటీలు, పారిశ్రామిక ప్రముఖులు, సంపన్నులు ఎక్కువగా తిరిగే ప్రాంతమది.. బంజారా హిల్స్‌! సాయంత్రం ఆరున్నర గంటల సమయం.. అంటే జనసంచారం పతాకస్థాయిలో ఉండే సమయం!! అలాంటి చోట..

రాజధానిలో నడిరోడ్డుపై.. కారులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

  • మాయమాటలతో పబ్‌ నుంచి తీసుకెళ్లి అఘాయిత్యం
  • నిందితుల్లో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు
  • అతనితో సహా ఐదుగురు నిందితుల గుర్తింపు
  • వారిలో ఇద్దరు మేజర్లు.. ముగ్గురు మైనర్లు
  • ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసుల వెల్లడి
  • సీసీ టీవీ ఫుటేజీలో ఎమ్మెల్యే కుమారుడు
  • కేసులో అతడి పాత్రపైనా పోలీసుల దర్యాప్తు
  • హోం మంత్రి మనవడు, పీఏపైనా ఆరోపణలు
  • ఈ కేసులో ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నారనే వార్తలను ఖండించిన డీసీపీ
  • మొదట అసభ్య ప్రవర్తన కింద కేసు నమోదు
  • ఆ తరువాత 376(డి) కింద మార్పు


సెలబ్రిటీలు, పారిశ్రామిక ప్రముఖులు, సంపన్నులు ఎక్కువగా తిరిగే ప్రాంతమది.. బంజారా హిల్స్‌! సాయంత్రం ఆరున్నర గంటల సమయం.. అంటే జనసంచారం పతాకస్థాయిలో ఉండే సమయం!! అలాంటి చోట.. అలాంటి వేళ.. నడిరోడ్డుపై కారులో ఒక బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు మేజర్లు. ముగ్గురు మైనర్లు. మే 28న జరిగిన ఈ ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! నిందితుల్లో వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడితో సహా ప్రజాప్రతినిధుల సంతానం ఉండడమే పోలీసు దర్యాప్తులో ఆలస్యానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


బంజారాహిల్స్‌, జూన్‌ 3 (ఆంద్రజ్యోతి): స్నేహంగా ఉన్నారు కదా అని నమ్మిందామె. కానీ.. అప్పటిదాకా ఆమెతో బాగానే ఉన్నవారు కాస్తా ఒక్కసారిగా రాక్షసులుగా మారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో దాదాపు గంటసేపు ఆమెకు నరకం చూపించారు. ఈ విషయాన్ని భయంతో ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయిందామె. ఈలోగా ఆమె మెడ మీద గాయాన్ని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా అడిగినా విషయం చెప్పలేదు. ఏదో జరిగి ఉంటుందని అనుమానించిన తండ్రి ఆరా తీసి.. కొందరు మైనర్‌ బాలురు తన కుమార్తెను పబ్‌ నుంచి బయటకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసుల దర్యాప్తులో బయటపడింది! బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిలో వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. మిగతా నలుగురిలో రాజకీయ నేతల సంతానం ఉన్నారంటూ వచ్చిన వార్తలను వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ ఖండించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారని.. వారిలో ఒకరు వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడని ఆయన వెల్లడించారు. ఐదుగురిలో ఇద్దరు మేజర్లు కాగా.. ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిపారు. వారిలో సాదిక్‌ మాలిక్‌ (18) అనే నిందితుణ్ని అరెస్టు చేశామని.. మరొకరిని శనివారం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మరో నిందితుడు ఉమర్‌ఖాన్‌ (18)తోపాటు, ఇద్దరు మైనర్ల ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశీయుడైన ఓ వ్యక్తి బతుకుతెరువు కోసం చాలా కాలం క్రితం నగరానికి వచ్చాడు. ఇక్కడ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మహిళతో అతడికి వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె(16) ఉన్నారు. కుమార్తె ఒపెన్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. హాదీ అనే ఈవెంట్‌ ఆర్గనైజర్‌ వారి ఇంటిపక్కన ఉండేవాడు. అతడు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని అమ్నేషియా అండ్‌ ఇన్‌సోమ్నియా పబ్‌లో గత నెల 28న ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి బాలికను కూడా తీసుకెళ్లాడు. ఆమె అక్కడ సంగీతం వింటూ డాన్స్‌ వేస్తుండగా.. ఒక బాలుడు (17) ఆమె వద్దకు వచ్చాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అతడు తన స్నేహితులను పిలిచాడు. అందరూ ఆమెతో మాట కలిపారు. ‘‘దగ్గర్లో ఉన్న బేకరీలో పేస్ట్రీలు బాగుంటాయి తిందాం రావాల’’ంటూ ఆమెను ఆహ్వానించారు. సాయంత్రం 5.45 గంటలకు బాలికతో సహా అందరూ కలిసి కిందకు వచ్చి బెంజ్‌, ఇన్నోవా కార్లలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లోని బేకరీకి 6 గంటలకు వెళ్లారు. సుమారు రెండు గంటల తర్వాత తిరిగి పబ్‌కు చేరుకున్నారు. బాలికను అక్కడ దించేసి వారంతా వెళ్లిపోయారు. బాలిక తన తండ్రికి ఫోన్‌ చేసి అక్కణ్నుంచీ తీసుకెళ్లాల్సిందిగా కోరింది. తండ్రి వచ్చి ఆమెను తీసుకెళ్లాడు.


మెడ మీద గాయాలతో..

బాలిక ఇంటికి వచ్చిన తరువాత ఆమె మెడ మీద గాయాలు ఉండటాన్ని తల్లి గమనించింది. గోళ్లతో రక్కడం వల్లే ఆ గాయాలైనట్టు గుర్తించిన ఆమె.. కుమార్తెను నిలదీసింది. కానీ, బాలిక నోరు మెదపలేదు. దీంతో ఆమె తన భర్తకు విషయం చెప్పింది. అతడు హాదీని పిలిచి.. ఏం జరిగిందని అడిగాడు. ఇద్దరు కలిసి ఆరా తీయగా మైనర్లతో కలిసి ఆమె బయటకు వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. వారే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తి ఉంటారని గుర్తించిన తండ్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు గత నెల 31న ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదే రోజు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. అమ్నేషియా పబ్‌ నుంచి ఉన్న సీసీ కెమెరాలు చూడగా బాలిక ఆ బాలురతో కలిసి బేకరీకి వెళ్లి, రెండు గంటల తరువాత తిరిగి పబ్‌ వద్దకు వచ్చినట్టు గమనించారు. దీంతో ఆ రెండు గంటల సమయంలో ఏం జరిగింది అనేదానిపై పోలీసులు దృష్టి సారించారు. బేకరీ వద్ద సుమారు గంట పాటు అక్కడ పార్కింగ్‌లో గడిపినట్టు గుర్తించారు. అనంతరం బెంజ్‌ కారులో కొంత మంది మైనర్లు ఎక్కి బంజారాహిల్స్‌ వైపు వెళ్లిపోగా మిగతా వారు బాలికను తీసుకొని 6.30 గంటలకు ఇన్నోవాలో పబ్‌కు బయలు దేరారు.


మామూలుగా అయితే బేకరీ నుంచి పబ్‌కు చేరుకునేందుకు 10-15 నిమిషాల సమయమే పడుతుంది. కానీ ఇన్నోవా కారు పబ్‌కు వచ్చింది 7.30 గంటలకు. ఆ గంటసేపు ఎక్కడ ఉన్నారు? ఏం జరిగింది? అని బాలికను పోలీసులు ప్రశ్నించారు. ఆమె ఏమీ చెప్పకపోవడంతో భరోసా కేంద్రానికి తీసుకువెళ్లి కౌన్సెలింగ్‌ చేయించారు. అప్పుడు.. ఆమె నోరు విప్పింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. ఇన్నోవా కారులో తనపై సామూహిక అత్యాచారం జరిపారని వాంగ్మూలం ఇచ్చింది. కారులో ఐదుగురు ఉన్నారని తెలిపిన ఆమె.. వారిలో ఒకరి పేరు మాత్రమే చెప్పగలిగింది. వైద్యపరీక్షల నిమిత్తం బాధితురాలిని పోలీసులు నిలోఫర్‌ ఆస్పత్రికి పంపించారు. బాలిక కథనం ప్రకారం ఐదుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టంతో పాటు సెక్షన్‌ 376(డీ) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.


వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు..

సీసీ ఫుటేజీ దృశ్యాలు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు నిందితులను గుర్తించడం మొదలు పెట్టారు. నిందితుల్లో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు(17) ఉన్నట్టు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అతనితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు గుర్తించారు. వారు వాడిన ఇన్నోవా కారు కూడా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌దేనని విచారణలో తేలింది. ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితులు వాడిన బెంజ్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నిందితుల్లో ఒకరి మేనమామదిగా గుర్తించారు. కాగా పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పబ్‌ వద్ద బాలికను బెంజ్‌ కారులో ఎక్కిస్తుండగా అతడి చిత్రం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బేకరీ వద్ద కూడా అతను ఉన్నట్టు ఫుటేజీ ద్వారా తెలుస్తోంది.


బేకరీ వద్ద నుంచి అతను కూడా పబ్‌కు వచ్చేందుకు ఇన్నోవా ఎక్కుతుండగా ఫోన్‌ రావడంతో వెనక్కి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఘటనలో అతని పాత్ర ఎంత మేరకు ఉంది అనేది తేలాల్సి ఉంది. వీరితోపాటు.. ఈ కేసులో హోం మంత్రి పీఏ, మనవడి పాత్ర ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. ఇక.. కారును డ్రైవ్‌చేసింది మైనర్లే అని తేలడంతో మోటారు వాహనచట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. కాగా, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఈ విషయం బయటకు రాదనే భరోసాతో ఉన్నారు. కానీ, అనూహ్యంగా బాధితురాలి తండ్రి గత నెల 31న పోలీసులను ఆశ్రయించడంతో వారు జాగ్రత్తపడ్డారు. సెల్‌ఫోన్‌ నంబర్లు మార్చారు. సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాలను తొలగించారు. నాలుగు రోజులుగా స్నేహితులను కూడా కలవలేదు. ఈ కేసు నేపథ్యంలో వారంతా అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లారనే వాదన వినిపిస్తోంది.


ఠాణా ఎదుట బీజేపీ దర్నా

బాలిక సామూహిక అత్యాచారంలో నిందితుల విషయంలో పోలీసుల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ నగర బీజేపీ నాయకులు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట శుక్రవారం బైఠాయించారు. పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. హోంమంత్రి పీఏ దగ్గరుండి బాలికను పబ్‌లోకి పంపించాడని విమర్శించారు. హోం మంత్రి మనవడి పాత్రపైనా విచారణ జరిపించాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. 


150 మందితో పార్టీ.. ఇంటర్‌ విద్యార్థులే అధికం

సంఘటన జరిగిన రోజు అమ్నేషియా పబ్‌లో 150 మందితో పార్టీ జరిగినట్టు సమాచారం. హాదీ, సూరజ్‌తోపాటు మరో ముగ్గురు కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్‌ విద్యార్ధులే ఈ పార్టీలో అధికంగా పాల్గొనట్టు తెలుస్తోంది. పబ్‌లో సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు పార్టీ జరిగింది. అయితే ఈ పార్టీలో మద్యం సరఫరా చేశారా లేదా అని తేలాల్సి ఉంది. 21 సంవత్సరాల లోపు వారికి మద్యం సరఫరా చేయవద్దనే నిబంధన ఉంది. మరి ఈ నిబంధనను పబ్‌ యాజమాన్యం పాటించా లేదా అనేది తేలాల్సి ఉంది. 


ఆధారాలన్నీ ఉన్నా..

నిదానంగా దర్యాప్తు.. పోలీసుల తీరుపై విమర్శలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పెద్దగా ఆధారాలు ‘దిశ’ ఘటనలో చురుగ్గా కదిలిన పోలీసులు.. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు! కానీ.. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజీ, అందులో రికార్డయిన కారు నంబర్లు అన్నీ ఉన్నా దర్యాప్తు మాత్రం నిదానంగా సాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలికపై అత్యాచారం జరిగిందనడానికి ఆధారాలు లభించిన తర్వాత కూడా మే 31 నుంచి జూన్‌ 3 (నాలుగు రోజులు) వరకూ పోలీసుల దర్యాప్తులో ఏం తేలిందనేదీ ఎవరికీ అర్థం కావడం లేదు. అదే రోజు పబ్‌లో, బేకరీల్లో గంటల తరబడి కూర్చున్న నిందితులు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నా వారిని వెంటనే అరెస్టు చేయలేదు. వారు వాడిన కార్‌ నంబర్ల ఆధారంగా గుర్తించడం కూడా చాలా సులువు. అయినా కూడా పోలీసులు ఈ కేసు విషయాన్ని దాచిపెట్టడానికి కారణాలేంటి? నిందితులను అరెస్టు చేయకపోవడం వెనుక మతలబు ఏంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వార్త మీడియాలో లీక్‌ కాకపోయి ఉంటే అసలు ఆ బాలికకు న్యాయం జరిగేదా అనేదీ సందేహమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదు అందిన తర్వాత కూడా నిందితులను అరెస్టు చేయడంలో ఆలస్యాన్ని చూస్తే.. ఇదంతా ప్రముఖుల కుమారులను తప్పించే ప్రయత్నాల్లో భాగమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.




ఎవరైనా వదలొద్దు: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

బాలిక పై అత్యాచారం కేసులో నిందితులు ఎవరైనాసరే.. వారిని వదిలిపెట్టొద్దని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా డీజీపీ, నగర కమిషనర్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌లో బాలిక పై గ్యాంగ్‌ రేప్‌ తనను షాక్‌ గురిచేసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-04T08:36:09+05:30 IST