బాలికపై గ్యాంగ్‌ రేప్‌

ABN , First Publish Date - 2022-05-20T08:54:43+05:30 IST

గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన తొమ్మిదో తరగతి విద్యార్థనిని కొందరు బీటెక్‌ విద్యార్థులు మాయమాటలతో లాడ్జికి రప్పించి సామూహిక అత్యాచారం చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

మద్యం తాగించి, గంజాయి తాగి.. 

ముగ్గురు బీటెక్‌ విద్యార్థుల అరాచకం!

గుంటూరు జిల్లాలో మరో దారుణం


గుంటూరు (సంగడిగుంట), మే 19:  గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన తొమ్మిదో తరగతి విద్యార్థనిని కొందరు బీటెక్‌ విద్యార్థులు మాయమాటలతో లాడ్జికి రప్పించి సామూహిక అత్యాచారం చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు రూరల్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వట్టిచెరుకూరు మండలంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పరిచయమయ్యాడు. ఆమెకు ప్రేమ పేరిట దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆ యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుంటూరులో ఓ లాడ్జి రూం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం అందులో ఒకడు ఆ అమ్మాయికి ఫోన్‌ చేసి ‘నీ ప్రియుడికి యాక్సిడెంట్‌ అయింది.. లాడ్జిలో ఉన్నాం’ అని అబద్ధం చెప్పాడు. ఆ అమ్మాయి లాడ్జి దగ్గరకు రాగా అమ్మాయి ప్రియుడు మద్యం మత్తులో నిద్ర పోతున్నాడు. అప్పటికే గంజాయి సేవించిన మిగిలిన ఇద్దరూ.. ఆ విద్యార్థినికి కూడా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లారిన తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక నీరసంగా ఉండడాన్ని గమనించిన తల్లి నిలదీసేసరికి జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ప్రధాన నిందితుడిని తప్పించే యత్నాలు!

నిందితులు ముగ్గురూ అదే లాడ్జిలో ఉండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇద్దరే అత్యాచారానికి పాల్పడ్డారని, ఒకరు మద్యం మత్తులోనే నిద్ర పోయినట్లు చెబుతున్నారు. కానీ ఆ యువకుడు ప్రముఖ రాజకీయ నాయకుని అనుచరుడు కావడంతో అతడిని తప్పించే ప్రయత్నం సాగుతోందని ప్రచారం జరుగుతోంది. 


సమాచారం తెలుసుకున్న జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఆళ్ల హరి, మహిళా నేతలు పార్వతీ నాయుడు, బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్‌ లక్ష్మీ దుర్గ, పద్మావతి తదితరులు బాధితురాలి తల్లిని పరామర్శించే ప్రయత్నం చేశారు. అనుమతించకపోవడంతో ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. అలాగే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలి కూడా పార్టీ కార్యకర్తలతో కలిసి బాధితురాలిని పరామర్శించే ప్రయత్నం చేశారు. డీఎస్పీ అనుమతించకపోవడంతో నిరసనకు దిగారు. మూడేళ్ల పరిపాలనలో వెయ్యి మందిపై అత్యాచారాలు జరిగాయని 28 మంది మహిళలు అత్యాచారానికి గురై హత్యకు గురయ్యారన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ  జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి  స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-05-20T08:54:43+05:30 IST