రేపల్లె రైల్వేస్టేషన్‌లో గర్భిణిపై గ్యాంగ్‌ రేప్‌

ABN , First Publish Date - 2022-05-02T07:42:36+05:30 IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఓ దళిత కుటుంబం అది. వారికి రెక్కాడితేకాని డొక్కాడదు.

రేపల్లె రైల్వేస్టేషన్‌లో గర్భిణిపై గ్యాంగ్‌ రేప్‌

పిల్లలు, భర్త కళ్లెదుటే దళిత మహిళపై ముగ్గురి దురాగతం

భార్యను రక్షించుకోవడానికి పరుగులు పెట్టిన భర్త

తలుపు కొట్టినా స్పందించని ఆర్పీఎఫ్‌..

న్నీళ్లతో వేడుకున్నా కాలు కదపని కార్మికులు, మహిళలు

సమీప పోలీస్‌స్టేషన్‌కు పరుగులు.. పోలీసులు వచ్చేసరికే పరారైన కామాంధులు

నిందితుల అరెస్టు.. బాధితురాలు రిమ్స్‌కు..

తుమ్మపూడి దారుణం మరువకముందే మరో ఘాతుకం


రాష్ట్రంలో కామాంధుల ఆగడాలకు మరో ‘అమ్మ’ బలైపోయింది. భర్త, ముగ్గురు పిల్లల కళ్ల ముందే దారుణంగా గ్యాంగ్‌రే్‌పనకు గురైంది. మద్యం, గంజాయి మత్తులో ఉన్న నిందితులను.. నాలుగు నెలల గర్భిణి కూడా అయిన ఆమె కన్నీటి ఆక్రందనలు, ఆ చిన్నారుల రోదనలు ఏమాత్రం కదిలించలేకపోయాయి. ఆమె భర్తను తీవ్రంగా కొట్టి ఈ పైశాచికానికి పాల్పడ్డారు. భర్త పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులను పిలుచుకొచ్చేలోగా నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ దారుణ ఘటన పోలీసు పహరాలో ఉండే రైల్వేస్టేషన్‌లో జరగడం మరో దారుణం.

రేపల్లె, బాపట్ల, ఒంగోలు, మే 1(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఓ దళిత కుటుంబం అది. వారికి రెక్కాడితేకాని డొక్కాడదు. పనుల కోసం తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని వలసపోవడం వారి జీవితాల్లో నిత్యకృత్యం. భర్త తా పీ మేస్త్రి, భార్య కూలీ. వారికి ముగ్గురు పిల్లలు. ఇప్పుడు ఆమె నాలుగు నెలల గర్భిణి. డిసెంబరు 2021లో తెలంగాణలోని కోదాడకు పనుల నిమిత్తం వెళ్లిన ఆ కుటుంబం కొద్ది రోజుల క్రితమే గుంటూరుకు చేరుకుంది. అక్కడా కష్టంగా ఉండడంతో నాగాయలంకకు బయలుదేరారు. శనివారం రాత్రి గం.11.30 దాటిన తరువాత రేపల్లె రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ వేళకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోనే పడుకున్నారు. అదే వారిపాలిట శాపమైంది. అర్ధరాత్రి సుమారు గం.1.30 ప్రాంతం లో గంజాయి, మద్యం సేవించిన ముగ్గురు అక్కడకు వచ్చారు. మంచి నిద్రలో ఉన్న భర్తను లేపి సమయమెంత అని అడిగి గొడవ పెట్టుకున్నారు. చితక్కొట్టి అతని దగ్గర ఉన్న రూ.750 లాక్కున్నారు. ఆ గొడవకు నిద్రలేచిన పిల్లలు ఏడుపు అందు కున్నారు. గర్భిణి అయిన భార్య, భర్తను కొట్టవద్దంటూ వారిని వేడుకుంటూ అడ్డుకుంది.


అందుకోసమే చూస్తున్న ఆ ముగ్గురూ ఆమెపై పడ్డారు. అడ్డుపడడానికి ప్రయత్నించిన భర్తపై మరో సారి దాడి చేశారు. తన భార్యను రక్షించుకోవాలన్న తపనతో ఏడుపు కేకలతో అదే ప్లాట్‌ఫాంపై ఉన్న కొందరు మహిళలను సాయం కోసం అర్థించాడు. వాళ్లు స్పందించలేదు. అదే పరుగు తో పక్కనే ఉన్న ఆర్‌పీఎఫ్‌ స్టేషన్‌ తలుపులు బాదాడు. వాళ్లెవ్వ రూ పలకలేదు. స్టేషన్‌ బయట ఉన్న రిక్షా కార్మికులను సాయా నికి రమ్మని బతిమలాడాడు. వాళ్లు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ కు దారిచూపించి ఊరుకున్నారు. నిస్సహాయుడైన ఆ భర్త ఆ అర్ధరాత్రి వేళ స్టేషన్‌కు చేరుకున్నాడు. విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు స్పందించారు. అతడితో పాటు ఘటనాస్థలికి వచ్చారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అత్యాచా రానికి పాల్పడిన ఆ కామాంధులు పోలీసుల రాకను పసిగట్టి పారిపోయారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణాన్ని నిరంతరం కాపలా కాయాల్సిన ప్రభుత్వం ఆధ్వర్యంలోని రైల్వే పోలీసులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్‌పీఎఫ్‌ స్పందనారాహిత్యమూ ఈ అకృత్యానికి కారణమైంది. మేడే రోజున ఓ దళిత కూలి, గర్భి ణి... భర్త, పిల్లల కళ్ల ముందే కర్కశుల చేతుల్లో బలైపోయింది. ్జకాగా, రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రి మేరుగ నాగార్జున ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వరుస అత్యాచారాలకు కారణం ప్రతిపక్ష పార్టీలే అని నిందించడం విస్మయాత్మకం.


పోలీసులు సత్వరమే స్పందించారు: ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాధితురాలి భర్త అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు రాగానే అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది సత్వరమే స్పందించారని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. అత్యాచార ఘటనపై  రేపల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ‘‘పోలీసులు ఘటనా స్థలాని కి వెళ్లేటప్పటికే దుండగులు పారిపోయారు. బాధితురాలి కు టుంబాన్ని స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు సేకరించారు. వెం టనే ప్రాథమిక వైద్యం, కౌన్సెలింగ్‌ సపోర్టు వంటివి బాధితురాలికి అందించారు. ఆదివారం ఉదయం 7 గంటలకల్లా నిందితులను అదుపులోకి తీసుకున్నాం. డాగ్స్‌ టీం సహకారంతో కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించగలిగాం. త్వరలోనే పూర్తి వివరా లు చెబుతాం.


పట్టుబడ్డ నిందితులకు గతంలో నేర చరిత్ర ఉం ది. ఘటనకు పాల్పడ్డ సమయంలో నిందితులు మద్యం మత్తు లో ఉన్నారు. ముగురిని అదుపులోకి తీసుకున్నాం. వారిలో పా లుబోయిన విజయకృష్ణ (20), పాలుచురి నిఖిల్‌(25) కాగా మరో నిందితుడిని మైనర్‌. వారిపై  376, 394, 307 ఐపీసీ సెక్షన్‌ ల కింద కేసులు నమోదు చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.  


బాధితురాలి బంధువులనూ అనుమతించలేదు

బాధితురాలిని పరామర్శించేందుకు టీడీపీ శ్రేణులతో వచ్చిన ఆమె బంధువులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆమె భర్త, పిల్లలను చూపించాలన్న వారి డిమాండ్‌నూ పోలీ సులు పట్టించుకోలేదు. అలాగే అక్కడికి కార్యకర్తలతో వచ్చిన ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరరావు, ప్రజాసంఘాల నాయకులను కూడా ఆసుపత్రి లోపలికి వెళ్లేం దుకు పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా నాయకులు రిమ్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి నాగులుప్పలపాడు స్టేషన్‌కు తరలించారు. ఈ వార్త తెలియగానే బాధితురాలి స్వగ్రామమైన యర్రగొండపాలెం మం డలం వెంకటాద్రిపాలెం వాసులు ఆందోళనకు గురయ్యారు. బాధితురాలి ఇంటి వద్దకు చేరుకొని దారుణానికి ఒడిగట్టిన వారిని వెంటనే ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాత్రి యర్రగొండపాలెం సెంటరులో బహుజన, దళిత ఐక్యవేదిక నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బాధిత మహిళకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


పోలీసుల ఓవరాక్షన్‌ నిలిచిన ఆపరేషన్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 1: రిమ్స్‌ వద్ద పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ఆసుపత్రిలోకి ఎవ్వరినీ అనుమతించలేదు. అన్ని వైపులా గేట్లు మూసివేశారు. అత్యవసర ఆపరేషన్‌ చేయా ల్సి ఉందని ఓ సర్జన్‌, పోలీసులను బతిమలాడుకున్నా ససేమిరా అన్నారు. దీంతో ఆ ఆపరేషన్‌ ఆగిపోయిందని సమాచారం. మరోవైపు రిమ్స్‌లో క్యాంటిన్‌ మూతపడి ఉండ టంతో టిఫిన్‌, ఇతర ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు మెడిక ల్‌ విద్యార్థులను బయటకు అనుమతించ లేదు. దీంతో గంటల కొద్దీ వారు పడిగాపులు కాశారు. ఘటనను కవర్‌ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులనూ గేటు బయటకే పరిమితం చేశారు. 


టీడీపీ, దళిత, ప్రజా సంఘాల ఆందోళన

ఈ ఘటన తెలిసిన వెంటనే టీడీపీ దళిత, ప్రజా సంఘాలు రేపల్లె స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. బాధితురాలికి సక్రమంగా వైద్యం అందించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అంబులెన్స్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన దళిత సంఘాల నేతలనూ అరెస్టు చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, ఆ ప్రాంత నాయకులు, ఎమ్మెల్యే డీఎ్‌సబీవీ స్వామి, మరికొంతమంది నేతలు బాధితురాలిని పరామర్శించేందుకు రిమ్స్‌కు చేరుకున్నారు. 4.30గంటల ప్రాంతంలో రిమ్స్‌ వెనుకగేటు నుంచి బాధితురాలిని వైద్యశాలలోకి తీసుకొని వెళ్లారు.


ఆసుపత్రిలోకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రధాన గేటు ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రి విడదల రజిని రిమ్స్‌ లోపల ఉన్నారన్న ప్రచారంతో రాత్రి 7గంటల సమయంలో మరోసారి టీడీపీ శ్రేణులు రిమ్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. భారీగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే స్వామి కాలికి గాయమైంది. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లమన్న ఆయన అభ్యర్థననూ పోలీసులు పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే స్వామి, ఎరిక్షన్‌బాబు సహా పలువురిని అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే స్వామి ఈ సందర్భంగా ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-02T07:42:36+05:30 IST