నేటినుంచి పుంగనూరు గంగజాతర

ABN , First Publish Date - 2021-04-06T07:30:27+05:30 IST

జమీందారుల ఇలవేల్పు సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభమై.. బుధవారంతో ముగియనుంది.

నేటినుంచి పుంగనూరు గంగజాతర
సుగుటూరు గంగమ్మ (ఫైల్‌ఫోటో)

పుంగనూరు, ఏప్రిల్‌ 5: జమీందారుల ఇలవేల్పు సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభమై.. బుధవారంతో ముగియనుంది. ఏటా ఉగాది పండుగ ముందు వచ్చే మొదటి మంగళవారం పుంగనూరుతోపాటు పరిసర 100 గ్రామాల్లో గంగజాతర నిర్వహించడం ఆనవాయితీ. మత సామరస్యానికి ప్రతీకగా పేరుగాంచిన ఈ గంగ పండుగ జిల్లాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచీ భారీగా భక్తులు, ప్రజలు తరలివస్తారు. జాతరలో భాగంగా మంగళవారం పుంగనూరు ప్యాలెస్‌లో భారీఎత్తున గొర్రెల సంత జరుగుతుంది. అలాగే జమీందారి వంశీకులు రాత్రి కలశ ప్రతిష్ఠ, శాంతిపూజ నిర్వహించి అమ్మవారి విగ్రహానికి తొలిపూజ చేస్తారు. ఆ తర్వాత వీఐపీలు పూజలు నిర్వహించి ప్యాలెస్‌ నుంచి అమ్మవారిని ప్రత్యేక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. బుధవారం తెల్లవారుజామున ప్యాలెస్‌ వద్ద గల సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి బెస్త, యాదవ, తోటి కులస్తులు పూజలు చేస్తారు. స్త్రీలు, పురుషులు గంగవేషాలు వేసుకొని పురవీధుల్లో గెరిగెలతో ప్రదర్శనగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం పాదమండపం చుట్టూ మూడు, ఐదు, ఏడు, తొమ్మిది మార్లు ప్రదక్షిణలు చేస్తారు. భక్తులు అమ్మవారికి జంతుబలులు సమర్పించి మంగళహారతులతో మొక్కులు తీర్చుకొంటారు. ఎనుపోతులు, పొట్టేళ్లు, మేకపోతులు, కోళ్లను అమ్మవారికి బలిస్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనార్థం ప్యాలస్‌ వద్దగల ఆలయంలో అమ్మవారిని ఉంచుతారు. 


ఏడాదికో రోజే జనం మధ్యకు 

కోపమూర్తులైన సుగుటూరు గంగమ్మ, నడివీధిగంగమ్మను ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే జాతర సందర్భంగా జనం మధ్యకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో గృహ నిర్భంధంలోనే ఉంచుతారు. జమీందారి సంతతి వారు ప్యాలెస్‌లో తొలిపూజ చేశాక సుగుటూరు గంగమ్మ సోదరీమణులను పరామర్శించడానికి ఊరేగింపుగా బయలుదేరతారు. అలా పుంగనూరులో శక్తి ఆలయాలుగా 8 మూలల్లో స్థిరపడ్డ అష్ట గంగమ్మలైన పాత బస్టాండు సమీపంలోని విరూపాక్షి మారెమ్మ, తూర్పుపాలెంలో స్థలగంగమ్మ, పలమనేరురోడ్డులోని మల్లారమ్మ, తూర్పు మొగసాలలోని నల్లగంగమ్మ, కట్టకిందపాళ్యంలోని పడమటి గంగమ్మ, పుంగమ్మ కట్టపై నీళ్లరాళ్ల గంగమ్మ, కోనేరు వద్దగల బోయకొండ గంగమ్మలను పలకరిస్తూ ఊరేగింపు సాగుతుంది. అనంతరం ఆలయంలో కొలువుదీరుతారు. 


ఓం శక్తి అమ్మవారి దీక్షలు 

జాతర సందర్భంగా మహిళా భక్తులు ఓంశక్తి అమ్మవారి దీక్షలు ఆచరించడం ప్రాముఖ్యత సంతరించుకొంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ బస్టాండు సమీపంలోని మారెమ్మ ఆలయ ఆవరణలో, దండుపాళ్యం సమీపంలో, పలమనేరు రోడ్డులో ఓంశక్తి భక్తులు ఆలయాలను నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. జాతరలో అన్ని మతాల వారూ పాల్గొంటారు. పుంగనూరులో 108 దేవాలయాలు నిర్మితం కావడం, అడుగడుగునా అద్భుత కట్టడాలతో కూడిన ఆలయాలు నాటి వైభవానికి ప్రతీకగా నిలిచాయి.  జాతర సందర్భంగా ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి.

Updated Date - 2021-04-06T07:30:27+05:30 IST