War In Gangadhara Nellore Ycp: డిప్యూటీ సీఎం వర్సెస్ మాజీ ఎంపీ...

ABN , First Publish Date - 2022-09-15T00:01:43+05:30 IST

గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే....

War In Gangadhara Nellore Ycp: డిప్యూటీ సీఎం వర్సెస్ మాజీ ఎంపీ...

చిత్తూరు (Chittoor): గంగాధర నెల్లూరు (Gangadhara Nellore) ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy Cm Narayana Swami) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయనకు వైసీపీ (Ycp) నుంచే లెక్కకు మించిన వ్యతిరేక వర్గాలు తయారవుతున్నాయట. ఆరు మండలాలున్న గంగాధరనెల్లూరులో ప్రతి మండలంలోనూ నారాయణస్వామికి వ్యతిరేక వర్గం ఉందట. వర్గాలుగా ఏర్పడ్డ నేతలు ఆధిపత్య పోరును కొనసాగిస్తూ ఒక వర్గంపై మరో వర్గం వారు బహిరంగంగానే ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగి వైసీపీ పరువు రోడ్డున పడేలా చేస్తున్నారట.


ఇక గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ మండల అధ్యక్షుల జాబితాను నారాయణస్వామి ప్రకటించడంతో ఒక్కసారిగా వర్గపోరు భగ్గుమంది. ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారుడు, చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం అన్నట్టుగా వర్గపోరు సాగుతోంది. అయితే మండల అధ్యక్షుల నియామకాలతో వర్గ విభేదాలు మరింత బహిర్గతం అయ్యాయి. మరోవైపు ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులపై నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని, పార్టీకి నష్టం కల్గించేలా ఎవరు వ్యవహరించినా వైసీపీ నుంచి సాగనంపాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. తన ద్వారా లబ్ది పొంది.. ఇప్పుడు ఇష్టారీతిన అభాండాలు వేయడంపై సీరియస్‌ అయ్యారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విమర్శించడం చిగ్గుచేటని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారు గౌరవంగా బయటకు వెళ్లిపోవాలని.. లేకుంటే సాగనంపే ప్రయత్నం చేయాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మంచిది కాదంటూ ప్రత్యర్థి వర్గంపై నారాయణస్వామి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. 


అటు నారాయణస్వామి వ్యాఖ్యలపై ప్రత్యర్థి వర్గం సోషల్ మీడియా సాక్షిగా ఎదురుదాడికి దిగింది. తామంతా జగనన్న సైనికులం అని.. జ్ఞానేందర్‌రెడ్డి కుటుంబం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమంటూ సంచలన కామెంట్స్‌ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ ఏర్పాటు నుంచి జెండాలు మోసిన వారికి గుర్తింపు లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రమే గుర్తింపు ఇస్తున్నారంటూ నారాయణస్వామిపై జ్ఞానేంద్రరెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. 


ఇలా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే తాజాగా.. నారాయణస్వామి వ్యతిరేక వర్గం మేదోమధన కార్యక్రమం పేరుతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం వైసీపీ వర్గపోరును మరింత బహిర్గతం చేస్తోంది. జ్ఞానేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పెనుమూరు మండలం పులిగుంటి ఈశ్వర ఆలయం సమీపంలో సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, గంగాధర్ నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్ పురం మండలాల వైసీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలిరావడంతో నారాయణస్వామిపై సొంతపార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.


ఇక ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం వ్యవహారంపైనే హాట్‌హాట్‌గా చర్చ సాగిందట. నియోజకవర్గంలో జరుగుతున్న లోపాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశమని పలువురు నేతలు చెప్పుకొచ్చారట. ఎలాంటి కుల విభేదాలు లేని గంగాధరనెల్లూరులో కులాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారట. కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యవహారం నారాయణస్వామికి పుట్టుకతో వచ్చిందంటూ మరికొందరు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చాలామంది నారాయణస్వామి బాధితులు.. బాధను బయటకు చెప్పుకోలేక, పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశంతో లోలోపల సతమతం అవుతున్నారని, సమస్యల పరిష్కారం కోసం నారాయణస్వామి దగ్గరకు వెళ్తే వర్గాలుగా విభజించి మాట్లాడుతున్నారని ఫైర్‌ అవుతున్నారు. అగ్రకులాల దగ్గరకు వెళ్లి ఎస్సీలను కించపరిచేలా మాట్లాడడం.. ఎస్సీల దగ్గరకు వెళ్లి అగ్రకులాలను రెచ్చగొట్టేలా నారాయణస్వామి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ హయాంలో నారాయణస్వామి వ్యవహరించిన తీరును కూడా కొందరు వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.


మొత్తంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారుతోంది. ఏకంగా.. డిప్యూటీ సీఎంను టార్గెట్‌ చేస్తూ.. సంచలన ఆరోపణలు చేస్తుండడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. నారాయణస్వామి తీరును జగన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నద్ధం కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గంగాధరనెల్లూరు వైసీపీ రాజకీయాలు ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ఎన్నికల నాటికి ఇంకెలా ఉంటాయో చూడాలి మరి...!




Updated Date - 2022-09-15T00:01:43+05:30 IST