గంగమ్మ పైపైకి..

ABN , First Publish Date - 2021-05-08T04:11:10+05:30 IST

జిల్లాలో భూగర్భ జలాలు ఏటా పెరుగుతున్నాయి. సాధారణంగా వేసవిలో జలాలు పూర్తిగా అడుగంటి పోతాయి.

గంగమ్మ పైపైకి..
పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌లో నీటిని నిండుగా పోస్తున్న బోరు

వేసవిలో సైతం పడిపోని భూగర్భ జలాలు

గతేడాది కంటే 2.81 మీటర్లు పెరుగుదల

వానాకాలంలో వర్షపాతం 67 శాతం అదనంగా నమోదు


 జిల్లాలో భూగర్భ జలాలు ఏటా పెరుగుతున్నాయి. సాధారణంగా వేసవిలో జలాలు పూర్తిగా అడుగంటి పోతాయి. కానీ, ఈ వేసవిలో పెద్దగా పడిపోలేదు. గత ఏడాదితో పోల్చితే జలాలు పైనే ఉన్నాయి. ఐదేళ్ల కిందట జిల్లాలోని కల్వకుర్తి ప్రాంతంలో భూగర్భ జలాలు 30 మీటర్ల లోపల లభిస్తుండగా, కొల్లాపూర్‌ ప్రాంతంలో 5 మీటర్ల లోతులో లభించేవి. కానీ, రెండు మూడేళ్లుగా జిల్లాలో జలాల లభ్యత లోతు క్రమంగా తగ్గుతోంది. నీళ్లు పైకి వస్తున్నాయి. జిల్లా భూగర్భ జల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో భూగర్భ జలాల లభ్యత ఈ పదేళ్లలో సగటున 2 మీటర్లు పెరిగాయి.

- నాగర్‌కర్నూల్‌ టౌన్‌


జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈసారి భూగర్భ జలాలు సగటున 2.81 మీటర్లు పైకి వచ్చా యి. గత ఏడాది ఏప్రిల్‌లో 9.91 మీటర్ల లోతులో లభించగా ఈ ఏప్రిల్‌లో 7.10 మీటర్ల లోతులో లభిస్తున్నాయి. జిల్లాలోని వెల్దండ మండలంలో భూ గర్భ జలాలు అత్యధికంగా 13.58 మీటర్లు పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ మండలంలో 30.60 మీటర్ల లోతులో జలాలు లభిం చాయి. అమ్రాబాదు మండ లంలో 8.14 మీటర్లు, బల్మూరులో 7.84, ఊర్కొండలో 4.93,  కల్వకుర్తిలో 4.16 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. కోడేరు మండలంలో అతి తక్కువగా 1.16 మీటర్ల లోతులో జలాలు లభిస్తుండగా, వెల్దండ మండలంలో 17.02 మీటర్ల అత్యంత ఎక్కువ లోతులో లభిస్తున్నాయి. వెల్దండ మండలంలో గత ఏడాదితో పోల్చితే ఈసారి భూగర్భ జలాలు పెరిగినప్పటికీ, జిల్లాలో జలాలు అత్యంత లోతులో ఉన్న మండలం ఇదే కావడం గమనార్హం.


వర్షపాతం పెరుగుదలే కారణం

జిల్లాలో గత ఏడాది వర్ష కాలంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు కూడా అనూహ్యంగా పెరిగాయని భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా సగటు వార్షిక వర్ష పాతం 642.3 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు సగటున 616 మీల్లీ మీటర్లు కురవాల్సి ఉంది. కానీ గడిచాన వర్షా కాలం జూన్‌ 2020 నుంచి ఇప్పటి వరకు 1030.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా 67 శాతం వర్షాలు అధికంగా కరిశాయి. దీంతో జిల్లాలో భూరగ్భ జలాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. దీనికి తోడు జిల్లాలో మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలతో చెరువులు, కుంటలు నింపడంతో ఏడాది పొడువునా ఉపరితల జలాలు కూడా విరివిగా లభించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వేసవిలో సైతం భూగర్భ జలాలు పెద్దగా పడిపోకుండా నిలకడగా ఉంటున్నాయి. 


ఉపరితల వినియోగం పెరిగింది

జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం 67 శాతం అధికంగా కురిసింది. దీంతో చెరువులు కుంటల్లో నీరు సమృద్ధిగా చేరింది. ఉపరితల జలాల వినియోగం పెరిగింది. కేంద్ర జల వనరుల శాఖ ప్రవేశ పెట్టిన జలశక్తి అభియాన్‌ పథకాన్ని జిల్లాలోని వెల్దండ, తాడూరు మండలాల్లో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఎప్పుడు ఎక్కడ వర్షపు నీరు పడినా ఒడిసి పట్టాలనే నినాదంతో నీటి సంరక్షణ కార్య క్రమాలు చేపట్టారు. దీంతో వెల్దండ మండలంలో భూగర్భ జలాలు ఏటేటా పెరుగుతూ వస్తున్నాయి. 

- రమాదేవి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి

Updated Date - 2021-05-08T04:11:10+05:30 IST