గంగమ్మా.. కరుణించమ్మా...!

ABN , First Publish Date - 2022-07-01T04:55:26+05:30 IST

అక్కడ ప్లాట్లు పొందిన లబ్ధిదారులు తమ ఇళ్లకు మార్కింగ్‌ ఇవ్వమని ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

గంగమ్మా.. కరుణించమ్మా...!
దిన్నె గంగమ్మ లేఔట్‌

పీలేరు దిన్నె గంగమ్మ లేఔట్‌పై అంతులేని సస్పెన్స్‌

నాలుగేళ్లుగా లబ్ధిదారుల ప్రదక్షిణలు

పట్టించుకోని అధికారులు

జోరందుకుంటున్న ఆక్రమణలు 

 

‘గంగమ్మా...నీ గుడి ముందు ఇల్లు వచ్చిందని ఎంతో సంతోషించాం. నీ చల్లని దయ మాపై ఉంటుందని, అక్కడ ఇళ్లు కట్టుకుందామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఇళ్లకు గవర్నమెంటు శాంక్షన్‌ చేసిన జాగా చూపించమని నాలుగేళ్లుగా అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతానే ఉండాము. మాపై వారికి దయ కలగడం లేదు. నువ్వైనా మాపై కరుణించి మేము ఇళ్లు కట్టుకునే పరిస్థితి కల్పించు తల్లీ’ అంటూ పీలేరు ఇందిరమ్మ కాలనీ సమీపంలోని దిన్నె గంగమ్మ లేఔట్‌లో కాలనీలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆ గంగమ్మను వేడుకుంటున్నారు. 


పీలేరు, జూన్‌ 30: దిన్నె గంగమ్మ లేఔట్‌ 2018లో మంజూరు కాగా 2019లో ప్రారంభించారు. అక్కడ ప్లాట్లు పొందిన లబ్ధిదారులు తమ ఇళ్లకు మార్కింగ్‌ ఇవ్వమని ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆ లేఔట్‌పై ఎందుకనో నోరు విప్పడం ఇష్టం లేని అధికారులు వారిని తిప్పుకుంటూనే ఉన్నారు. లేఔట్‌ దగ్గరకు వెళ్లిన లబ్ధిదారులను ‘మీ పట్టాలు రద్దు అయిపోయాయి, ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ కొంతమంది అధికార పార్టీ నాయకులు తరిమేస్తుండగా, ‘మేము ఆ పట్టాలు రద్దు చేయలేదు. మీరెళ్లి కట్టుకోండి’ అంటూ అధికారులు సెలవిస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక లబ్ధిదారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి, అధికార పార్టీ నాయకుల ఆగడాలకు దిన్నె గంగమ్మ లేఔట్‌ అద్దం పడుతోంది. 


2019లో ఏర్పాటైన దిన్నె గంగమ్మ లేఔట్‌ 

పీలేరు పట్టణంలోని పేదలకు సొంతిళ్ల కల్పనలో భాగంగా 2018లో అధికారులు పీలేరు ఇందిరమ్మ కాలనీ సమీపంలోని దిన్నె గంగమ్మ ఆలయం ముందు సర్వే నెం.1045లో 165, సర్వే నెం.1076/6లో 154 ఇళ్లు మంజూరు చేసింది. 2019 ప్రథమార్థంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వారికి పట్టాలు మంజూరు చేశారు అధికారులు. అప్పట్లో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులందరికీ పట్టాల పంపిణీ జరిగింది. అయితే కాలనీకి కేటాయించిన సర్వే నెం.1045 భూమి తనదని లక్ష్మయ్య అనే వ్యక్తి, సర్వే నెం.1076/6 భూమి తమదని మరో కుటుంబం చిత్తూరు జిల్లా జేసీ కోర్టును ఆశ్రయించారు. అవి ప్రభుత్వ భూములని, కేసులు చెల్లవని, పునాదులు తీసుకోవాలని అధికారులు చెప్పడంతో చాలామంది లబ్ధిదారులు పునాదుల కోసం గోతులు తవ్వుకున్నారు. లబ్ధిదారులు గోతులు తీసిన చోటల్లా లక్ష్మయ్య, అతడి తరపు కొంతమంది వ్యక్తులు పూడ్చేయడం, లేదా గొడవకు దిగడం అప్పట్లో నిత్యకృత్యంగా ఉండేది. ఈ తిప్పలు మాకెందుకు, మాకు సరైన భూమి చూపించండంటూ పలుమార్లు లబ్ధిదారులు గంగమ్మ లేఔట్‌తో పాటు పీలేరు తహసీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వారందరికీ అధికారులు సర్దిజెప్పడం, లబ్ధిదారులు అక్కడికెళ్లి పనులు ప్రారంభించడం, కొంతమంది వ్యక్తులు వచ్చి అడ్డగించడం పరిపాటిగా మారింది. ఈ గొడవల నడుమే హౌసింగ్‌ అధికారులు ఇళ్లకు మార్కింగ్‌ ఇవ్వగా కొంతమంది పునాదులు వేసుకోగా మరికొంతమంది గోడలు కూడా కట్టుకున్నారు. ఈలోపు 2019 అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. ఇక్కడి నుంచే గంగమ్మ లేఔట్‌ లబ్ధిదారులకు సమస్యలు ఎదురయ్యాయి. 


అనుమానాలకు తావిస్తున్న సస్పెన్స్‌ 

ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి రెవెన్యూ అధికారులు దిన్నె గంగమ్మ లేఔట్‌పై అంతులేని సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. జేసీ కోర్టులో విచారణలో ఉన్న కేసులో రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, ‘ఎందుకనో’ అధికారులు ఆ తీర్పును బహిర్గతం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో కోర్టు కేసును సాకుగా చూపి లేఔట్‌ వైపు వెళ్లడం మానేసిన అధికారులు తమ చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నా రేపు, మాపు అంటూ సమాధానం చెబుతున్నారే గానీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ఆ లేఔట్‌లో తమకిచ్చిన ఇళ్లు ఉన్నాయో, రద్దయిపోయాయో చెప్పమంటూ చాలామంది లబ్ధిదారులు తహసీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 2500 ఇళ్లు ఉన్న ఇందిరమ్మ కాలనీకి కూతవేటు దూరంలో ఉన్న ఈ లేఔట్‌ భూమిపై కొంతమంది అధికార పార్టీ నేతల కన్నుపడిందని, దానిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్న తలంపుతో అధికారులను మచ్చిక చేసుకుని లబ్ధిదారులకు స్థలాలు చూపకుండా కాలయాపన చేస్తున్నారనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. 


త్రిశంకు స్వర్గంలో లబ్ధిదారులు  

ఆ లేఔట్‌లో ఇల్లు రాకపోతే పోయింది, మరోసారి దరఖాస్తు చేసుకుందామని కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలామంది లబ్ధిదారులు ప్రయత్నించారు. అయితే వారి రేషన్‌కార్డుపై ఓమారు ఇల్లు మంజూరైందని, అందువల్ల మరోమారు ఇల్లు మంజూరు చేయడం కుదరదంటూ వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారిలో ఆందోళన మరింత పెరుగుతోంది. ఎంతో ఆశతో స్వంతింటి కోసం ఆఫీసులు, నాయకుల చుట్టూ తిరిగి సంపాదించుకున్న ఇల్లు కాస్తా అందని ద్రాక్షగా మిగిలిపోయిందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ లేఔట్‌పై స్పష్టత చేకూర్చి తమకు న్యాయం చేయాలని, వేలమందికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్న అధికారులు వందల సంఖ్యలో ఉన్న తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 


జోరందుకుంటున్న ఆక్రమణలు 

దిన్నె గంగమ్మ లేఔట్‌పై నెలకొన్న సస్పెన్స్‌ను కొంతమంది అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఆ లేఔట్‌ పరిధిలో దొడ్డిపల్లె, కాకులారంపల్లె, అగ్రహారం గ్రామాలు ఉండడంతో ఆయా గ్రామాలకు చెందిన కొంతమంది అధికార పార్టీ నేతలు కొన్ని ప్లాట్లను తమకు అనుకూలురైన వారికి అమ్ముకుంటున్నారని, అక్కడ ఇళ్లు పొందిన లబ్ధిదారులు అక్కడికి వెళితే నయానో భయానో అక్కడి నుంచి పంపిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు బలం చేకూరుస్తూ ఇటీవల దిన్నె గంగమ్మ లేఔట్‌లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. గతంలో పట్టాలిచ్చిన స్థలాల్లో చాలామంది కొత్త వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారని, తమకు కొత్త నిబంధనల మేరకు పట్టాలు మంజూరయ్యాయని చెబుతున్నారని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అయితే అధికారులు మాత్రం తాము అక్కడ ఎవరికీ ఇటీవలి కాలంలో ఇళ్లు మంజూరు చేయలేదని చెబుతున్నారు. అధికారులు పట్టాలు మంజూరు చేయకపోయినా అక్కడ కొత్త వారు ఎలా నిర్మాణాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని, అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 


మాకు మరోచోటైనా ఇల్లు ఇవ్వండి 

- హసన్‌ వలీ 

నేను దినసరి కూలీని. దిన్నె గంగమ్మ లేఔట్‌లో 2019లో ఇల్లు వచ్చింది. అప్పట్లో గొడవలు జరిగి మా ఇంటి పనులు ఆపుకున్నాం. అప్పటి నుంచి ఆఫీసర్ల కాడికి తిరుగుతూనే ఉండాము. తెలిసిన నాయకులకు, ఆఫీసర్లకు మా బాధ చెప్పుకుంటూనే ఉండాం. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. పోనీ అక్కడ కాకపోయినా ఇంకోచోట అయినా ఇల్లు వస్తే కట్టుకుంటాను. బాడిగింట్లో ఉండి బాడుగలు కట్టలేకున్నాం. 


అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు 

- సుజాత 

దిన్నె గంగమ్మ లేఔట్‌లో ఇల్లు వచ్చినప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. ఇల్లు వచ్చిన మొదట్లో నగనట్రా కుదువ పెట్టి డబ్బులు పోగు చేసుకున్నాం. తీరా గలాటాల్లో పని ఆగిపోయింది. తెచ్చుకున్న డబ్బు అధికారుల చుట్టూ తిరగడానికి, ఇంటి పత్రాలు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జిరాక్సులకే సరిపోయింది. ఎన్నిసార్లు తిరిగినా అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వరు. రేపు రాండి, మర్నాడు రాండి అంటూ దాటేస్తారు. మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలి. 


గంగమ్మ లేఔట్‌ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం 

- రవి, తహసీల్దారు 

దిన్నె గంగమ్మ లేఔట్‌లో నెలకొన్న ప్రతిష్టంబనను రెండు, మూడు రోజుల్లో తొలగిస్తాం. రికార్డులు పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. పాతవారికి న్యాయం జరిగేలా చూస్తాం. కొత్తగా అక్కడ ఎవరికీ పట్టాలు మంజూరు చేయలేదు కాబట్టి పాత లబ్ధిదారులు భయపడాల్సిన పని లేదు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగితే కఠినంగా వ్యవహరిస్తాం.



Updated Date - 2022-07-01T04:55:26+05:30 IST