జిల్లాలో పేట్రేగిపోతున్న దొంగల ముఠాలు

ABN , First Publish Date - 2021-11-22T06:45:51+05:30 IST

గత కొంత కాలంగా జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

జిల్లాలో పేట్రేగిపోతున్న దొంగల ముఠాలు
కదిరిలో ఉపాధ్యాయురాలు ఉషారాణిని హత్య చేసిన ఇంటిలో ఆరా తీస్తున్న జిల్లా ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప (ఫైల్‌)

భయం.. భయం..!

రోజురోజుకు పెరుగుతున్న చోరీలు

వరుస దొంగతనాలతో  ప్రజలు గగ్గోలు

తాళంవేసిన ఇళ్లే టార్గెట్‌

అడ్డుగా ఉంటే హత్యలకు వెనుకాడని దుండగులు

పూర్తిగా కొరవడిన పోలీసు నిఘా 

అనంతపురం క్రైం, నవంబరు 21: గత కొంత కాలంగా జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేయగా.. మరికొన్ని చోట్ల ఇళ్లలో మనుషులు ఉన్నా సరే దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు బరితెగిస్తున్నారు.  ఇటీవల కదిరిలో ఓ ఉపాధ్యాయురాలిని ఓ దొంగల ముఠా హత్య చేసి దోపిడీకి పాల్పడిన ఘటనే ఇందుకు నిదర్శనం. పోలీసుల నిఘా కొరవడటం కూడా దొంగలు చెలరేగిపోవటానికి ఓ కారణమవుతోంది. వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్న కొందరు దొంగలు  కూడా కొవిడ్‌ కారణంగా జైలు నుంచి విడుదలై దొంగతనాలకు పాల్పడుతుండటం కలవరం రేపుతోంది.  పథకం ప్రకారం దొంగల ముఠాలు రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొవిడ్‌తో పాటు ఈ ఏడాదిలో వినాయక నిమజ్జనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌, గత కొన్ని రోజుల కిందట నిలిచి పోయిన స్థానాలకు ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ తదితర కారణాల నేపథ్యంలో పోలీసు నిఘా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా తగ్గిపోయింది.  ఇదే అదునుగా రాత్రి పగలు, పల్లె, పట్ణణం అనే తేడా లేకుండా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా అనంతపురం నగరంతో పాటు ధర్మవరం, కదిరి, గుంతకల్లు, పెనుకొండ, హిందూపురం, మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తదితర ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. 


అడ్డుగా ఉంటే హత్యే ! 

జిల్లాలో తాళం వేసిన ఇళ్లలో సాఫీగా దొంగతనాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని దొంగల ముఠాలు మాత్రం దొంగతనాలు చేసే సమయంలో ఎవరైనా అడ్డుగా ఉన్నారని భావిస్తే హత్యలకు సైతం వెనుకాడక పోవటం జిల్లా ప్రజలతో పాటు పోలీసుశాఖకు సైతం ముచ్చెమటలు పట్టిస్తోంది. జిల్లాలో జరుగుతున్న నేరాలను పరిశీలిస్తే పాత నేరస్థులే ఎక్కువగా చోరీలకు పాల్ప డుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. దొంగతనాల సమయంలో హత్య జరిగిన కేసులలో మాత్రం పోలీసులకు అంతుచిక్కడం లేదు.  అంతర్‌ జిల్లా దొంగలు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టరని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి నేరాలకు ఎక్కువగా మధ్యప్రదేశ, బీహారీ, పార్థీ గ్యాంగ్‌, తదితర కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగలే పాల్పడుతుంటారనే యోచనలో జిల్లా పోలీసు యంత్రాంగం ఉంది. 


పోలీసు వైఫల్యం....

జిల్లాలో దొంగలు ప్రవేశించినా.. బస్టాండ్‌, రైల్వేస్టేషన్లు, దేవాలయాలు, తదితర రద్దీ ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపించినా ఫ్రింగర్‌ ప్రింట్‌ (వేలిముద్రల యాప్‌) ద్వారా ఆయా ప్రాంతాల పోలీసులు పరిశీలిస్తే.. పాత నేరస్థులా..కాదా అని తెలిసిపోతుంది. గత రెండున్నరేళ్లుగా ఈ తరహా వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఇతర జిల్లాలు, రాషా్ట్రలకు చెందిన దొంగలు జిల్లాలో మకాం వేసి దొంగతనాలకు బరితెగిస్తున్నారని సమాచారం. మరొకవైపు పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో ఉన్నసిబ్బంది వివిధ పనులకు వినియోగిస్తుండటం దొంగలకు మరింత కలిసి వస్తోందని తెలుస్తోంది.  రాత్రిపూట గస్తీ, కార్డెనసెర్చ్‌లు, తదితర తనిఖీలు పూర్తిగా తగ్గిపోయాయి. డయల్‌ -100, 9989819191 గల నెంబర్‌ కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప కొన్ని ప్రాంతాలలో పోలీసులు వెళ్లడం లేదని బాధిత వర్గాల నుంచి తెలుస్తోంది. ఇళ్లలో దొంగతనాలు జరగకుండా చూసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టం( ఎల్‌ఎంహెచఎ్‌స) యాప్‌ను రూపొందించి అమలు చేస్తోంది. ఎవరైనా ఇళ్లకు తాళం వేసి బయటకు వెళితే ఈ యాప్‌ను వినియోగించుకుంటే దొంగల భయం ఉండదు. ఇలాంటి వ్యవస్ధను కూడా జిల్లా పోలీసుయంత్రాంగం విస్మరించింది. ఈ అంశాలు దొంగలకు కలిసివస్తున్నాయి.


క్షేత్రస్థాయికి వెళ్లని పోలీసులు

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బాధిత ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆశించిన స్థాయిలో స్పందన లేదని  బాధిత వర్గాల నుంచి వినిపిస్తోంది. కొందరు పోలీసులు కేసు నమోదు చేస్తే త్వరగా పరిష్కరించాల్పి వస్తుందని, కేసులు కూడా నమోదు చేయకుండా బాధిత ఫిర్యాదుల కు సంబంధించి ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని సమాచారం. పదేపదే స్టేషన్ల చుట్టూ బాధితులు తిరిగినా ఇతర పనుల్లో బిజీగా ఉన్నామంటూ పోలీసులు కాలయాపన చేస్తున్నట్లు వినికిడి. ఏదైనా తీవ్రస్థాయిలో చోరీ జరిగితే తప్ప పోలీసులు క్షేత్రస్ధాయికి వెళ్లడం లేదని విమర్శలున్నాయి. 


కొరవడిన పోలీసు నిఘా..

జిల్లా వ్యాప్తంగా పాత నేరస్థులు 2862 మంది ఉన్నట్లు  కొన్నేళ్ల కిందట జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తించింది. ఇదే క్రమంలో ఒక దొంగ.. ఒక పోలీసు అనే కార్యక్రమాన్ని చేపట్టి పాత నేరస్థులు దొంగతనాలకు పాల్పడకుండా వారిలో మార్చు తీసుకురావడంతో పాటు వారి కదలికలపై నిఘా పెంచారు. తద్వారా కొంత వరకు చోరీలు తగ్గాయి. ఆ తర్వాత ఒక దొంగ.. ఒక పోలీసు కార్యక్ర మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇదే క్రమంలో కొవిడ్‌ రావడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యా రు. పాత నేరస్థులు చిన్నచిన్న పనులు, వ్యాపారులు చేసుకుంటూ జీవించేవారు. కొవిడ్‌తో వీరి పరిస్థితి  దయనీయంగా మారింది. దీంతో వీరందరూ కూడా పాత పంథాలోనే చోరీలకు తెరలేపడంతో దొంగతనాల సంఖ్య పెరిగిపోయిందని పోలీసు వర్గాల సమాచారం.  చేతులకు గ్లౌజులు ధరించి చోరీలకు పాల్పడుతుండటం, చోరీలకు పాల్పడే ముందు సీసీ కెమెరాలు, వారిని పసిగట్టే యంత్రాలను ధ్వంసం చేయడం,  వాట్సాప్‌ కాల్‌  ద్వారా సమాచారం పంచుకోవటం వంటి పనులతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా దొంగలు వ్యవహరిస్తున్న క్రమంలో వారిని పట్టుకోవటం పోలీసులకు సవాల్‌గా మారింది.


రికవరీ అంతంతే... 

దొంగతనాలకు సంబంధిం చి రికవరీల విషయంలో కూడా ఆశించిన స్ధాయిలో బాధితులకు న్యాయం జరగడం లేదని తెలుస్తోంది. కొందరు బడాబాబులు, డబ్బు కలిగిన వాళ్లు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నవారికి మాత్రమే ఎక్కువశాతం రికవరీలో న్యాయం చేస్తున్నారని ఆ రోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో పేదల ఇళ్లలో చోరీలు జరిగితే పలు విధాల ప్రశ్నలతో బాధితులను పోలీసులు ఇబ్బంది పెట్టడంతో పాటు కేసులు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇలాంటి నిర్లక్ష్యమే దొంగల పాలిట వరంగా మారింది. 


దొంగతనాలు జరగకుండా ఎక్కడిక్కడ నిఘా

జిల్లాలో దొంగతనాలు జరగకుండా ఎక్కడిక్కడ మరింత  నిఘా  పెంచుతాం. జిల్లాలో కొంతకాలంగా చోరీలు పెరిగి న విషయం వాస్తవమే. భవిష్యతలో దొంగతనాలు, తదితర నేరాలకు జగరకుండా పాత నేరస్థులపై నిఘా ఉంచడంతో రాత్రి వేళ భద్రత, గస్తీలను పెంచుతాం. అవ సరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఎవరైనా పోలీసులు చోరీల కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే సహించం. ఎల్‌ఎం హెచఎ్‌స, ఫ్రింగర్‌ ప్రింట్‌ యాప్‌ అమలు వేగవంతం చేస్తాం. ప్రతి కేసులోనూ బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. ఎల్‌ఎంహెచఎ్‌స సేవలను ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌ చేసి వారి కదలికలపై నిఘా ఉంచుతాం. కదిరిలో జరిగిన ఉపాధ్యాయురాలి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్నాం. ఆ దిశగా చర్యలు తీసుకున్నాం. 

- ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప 



Updated Date - 2021-11-22T06:45:51+05:30 IST