ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా

ABN , First Publish Date - 2021-07-22T05:24:54+05:30 IST

ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సెబ్‌ అధికారుల తనిఖీల్లో ఇవి బయటపడుతున్నాయి. ఇదేవిధంగా బుధవారం తెల్లవారుజామున సెబ్‌ అధికారులు దాడులు నిర్వహించి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో  గంజాయి రవాణా

 పట్టుకున్న సెబ్‌ పోలీసులు

6కిలోల డ్రై, 2 కిలోల లిక్విడ్‌ స్వాధీనం


నెల్లూరు(క్రైం), జూలై 21: ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సెబ్‌ అధికారుల తనిఖీల్లో ఇవి బయటపడుతున్నాయి. ఇదేవిధంగా బుధవారం తెల్లవారుజామున సెబ్‌ అధికారులు దాడులు నిర్వహించి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... సెబ్‌ జేడీ ఇంటలిజెన్స్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ నరహరి, తన సిబ్బందితో కలిసి నెల్లూరులోని అయ్యప్పగుడి సెంటర్‌ వద్ద రూట్‌వాచ్‌ నిర్వహించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సుల్లో తనిఖీ చేయగా కర్ణాటకలోని హోస్‌పేటకు చెందిన వీ హరీష్‌ వద్ద ఆరు కిలోల గంజాయి బయటపడింది. ఆర్టీసీ బస్టాండులో అనుమానాస్పదంగా తిరుగుతున్న తమళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా గుడలూరుకు చెందిన ఎం ప్రవీణ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని బ్యాగ్‌లో రూ.4లక్షల విలువ చేసే రెండు కేజీల లిక్విడ్‌ గంజాయి లభించింది. నిందితులిద్దరినీ అరెస్టు చేసిన సెబ్‌ అధికారులను జేడీ శ్రీలక్ష్మి అభినందించారు. ఈ తనిఖీల్లో  కానిస్టేబుళ్లు షేక్‌ అజీజ్‌ బాషా, బీ సురేష్‌, వీ పౌల్‌, డీ పోలయ్య తదితరులు పాల్గొన్నారు.


ఆర్థిక ఇబ్బందులే కారణం...

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులిద్దరూ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ పనికి పూనుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆర్టీసీ బస్సులో పట్టుబడిన వీ హరీష్‌ బెంగళూరులోని సిటీ మార్కెట్‌లో బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అతను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని గమనించిన అదే ప్రాంతానికి చెందిన నరసింహులు అతనికి డబ్బు ఆశచూపి గంజాయి రవాణాకు ఒప్పించాడు. విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకువస్తే రూ.10 వేలు కమీషన్‌ ఇస్తానని చెప్పాడు. అలా తరలిస్తుండగా సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. ఇక, ఆర్టీసీ బస్టాండులో పట్టుపడ్డ ఎం ప్రవీణ్‌రాజు తిరుపూరులోని ఏసీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఏ లిటరేచర్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి కేరళలోని పాలక్కడ్‌కు చెందిన రహీంతో పరిచయం ఏర్పడింది. అతను ప్రవీణ్‌రాజు ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకుని గంజాయి రవాణాకు ఉపయోగించుకున్నాడు. అన్నవరం నుంచి లిక్విడ్‌ గంజాయిని తీసుకువస్తే రవాణా ఖర్చులు కాకుండా రూ.30వేలు  ఇస్తానని ఆశ చూపాడు. దీంతో ప్రవీణ్‌రాజు అన్నవరం వెళ్లి లిక్విడ్‌ గంజాయి కొనుగోలు చేసి చెన్నైకు తీసుకెళుతుండగా పట్టుపడ్డాడు. 

Updated Date - 2021-07-22T05:24:54+05:30 IST