పైన మొక్కలు కింద గంజాయి

ABN , First Publish Date - 2021-07-22T04:15:44+05:30 IST

భద్రాచలం పట్టణ పోలీసులు ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న నిషేధిత గంజాయిని భారీగా పట్టుకున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సునీల్‌దత్‌ పూర్తి వివరాలను వెల్లడించారు.

పైన మొక్కలు కింద గంజాయి
విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సునీల్‌దత్‌

ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు తరలింపు

భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న పోలీసులు

విలువ రూ. 2.1 కోట్లు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ సునీల్‌దత్‌

భద్రాచలం టౌన్‌, జూలై 21: భద్రాచలం పట్టణ పోలీసులు ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న నిషేధిత గంజాయిని భారీగా పట్టుకున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సునీల్‌దత్‌ పూర్తి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ఫారెస్ట్‌ చెక్‌పోస్టు వద్ద సీఐ స్వామి సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మొక్కల లోడుతో ఒక లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో లారీని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లారీలోని మొక్కలు మొత్తం కిందకు దించగా అడుగు భాగంలో బస్తాల్లో సుమారు ఒక వెయ్యి ఐదు కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకోని విచారించగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం అగర్‌ జిల్లా డండానికి చెందిన సత్యనారాయణ ప్రజాపతి, కరణ్‌ సింగ్‌గా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో వసీం అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఈశ్వర్‌ సింగ్‌, ప్రేమ్‌ సింగ్‌కు చేరవేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.1కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో నాలుగేళ్లగా వేర్వేరు చోట్ల సుమారు ఆరువేల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారని, దాని విలువ సుమారు రూ.13.2 కోట్లు ఉంటుందని తెలిపారు. సరిహద్దుల్లోని చెక్‌ పోస్టుల వద్ద పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తున్నారని, గంజాయితో పాటు నిషేధిత వస్తువులను ఎవరైన తరలిస్తూ పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్‌, సీఐ స్వామి, ఎస్‌ఐ మధు ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-22T04:15:44+05:30 IST