గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-07T02:28:22+05:30 IST

గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు చైన్నై యువకులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి కిలో గంజాయి

గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసు అధికారులు

 చెన్నైకి చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు

కావలి,మార్చి6: గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు చైన్నై యువకులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి  కిలో గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీన పరుచుకున్నట్లు డీఎస్పీ డీ. ప్రసాద్‌రావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం టూటౌన్‌ సీఐ మల్లికార్జున, వన్‌టౌన్‌ ఎస్‌ఐ కొండయ్యలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ చెన్నైకి చెందిన గణేషన్‌ శరత్‌కుమార్‌, గోకుల కృష్ణ అనే యువకులు విజయవాడ నుంచి  ఆర్టీసీ బస్సులో గంజాయి తీసుకుని కావలి డిపోలో దిగి చెన్నై వెళ్లేందుకు మరో బస్సు కోసం  శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతండటంతో వన్‌టౌన్‌ ఎస్‌ఐ కొండయ్య తమ సిబ్బందితో పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద సంచిలో కిలో గంజాయి లభించిందన్నారు. వారిని అరెస్ట్‌చేసి గంజాయిని, వారి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా చెన్నై బీచ్‌లో చిల్లర దొంగతనాలు చేస్తూ ఉండేవారని  తమ సంపాదనను పెంచుకునేందుకు గంజా యి వ్యాపారంపై దృష్టి పెట్టారని చెప్పారు. విజయవాడ నుంచి గోపి అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుక్కొని  చైన్నై తీసుకెళ్లి అక్కడ దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లుగా కట్టి బీచ్‌లో విక్రయిస్తూ గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారన్నారు. విజయవాడకు చెందిన గోపీని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులను అక్కడ కు పంపుతున్నామన్నారు. వారి సెల్‌ఫోన్లలో ఉన్న నెంబర్ల ఆధారంగా కొందరిని విచారించి  ఇంకా ఈ వ్యాపారంతో ఎవరెవరికి సంబంధం ఉందో నిగ్గుతేల్చి వారిని కూడా పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు.

----------------

Updated Date - 2021-03-07T02:28:22+05:30 IST