గణపతి షుగర్‌ పరిశ్రమను తెరిపించాలి

ABN , First Publish Date - 2022-06-28T05:16:46+05:30 IST

సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులోని గణపతి షుగర్‌ పరిశ్రమను తెరిపించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రం అందజేశారు.

గణపతి షుగర్‌ పరిశ్రమను తెరిపించాలి
గణపతి షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఇంద్రకరణ్‌లో కెమికల్‌ ఫ్యాక్టరికి అనుమతి ఇవొద్దు

‘ప్రజావాణి’లో కలెక్టర్‌ను కోరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


సంగారెడ్డిటౌన్‌, జూన్‌ 27: సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులోని గణపతి షుగర్‌ పరిశ్రమను తెరిపించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో జగ్గారెడ్డి కలెక్టర్‌ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి వెంటనే గానుగను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. షుగర్‌ పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు, చెరకు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు వివరించారు. క్రషింగ్‌ సీజన్‌ దగ్గర పడుతున్నందున ఫ్యాక్టరీని తెరిపించకపోతే రైతులు నష్టపోతారని ఆయన కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కంది మండలం ఇంద్రకరణ్‌లో పవన్‌ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి గ్రామప్రజలతో కలిసి కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైతే కాలుష్యం వల్ల వచ్చే నీటితో పొలాలు పాడైపోతాయన్నారు. ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని జగ్గారెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. టెక్స్‌టైల్స్‌ పరిశ్రమను ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు  చేస్తున్నారని తెలిపారు. తాను రెండు మూడు రోజుల్లో అక్కడకు వెళ్లి పరిశ్రమ పనులను అడ్డుకుంటానని, గణపతి షుగర్‌ పరిశ్రమ వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 


 నాలుగు సార్లు ఫోన్‌ చే సినా కలెక్టర్‌ స్పందించనందుకే ప్రజావాణికి వచ్చా  

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శరత్‌ను కలిసేందుకు వారంలో నాలుగు సార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. అందుకే నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజావాణిలో కలెక్టర్‌ దృష్టికి తెచ్చేందుకు ప్రజావాణికి వచ్చానన్నారు. పలు సమస్యలను సంబంధించిన వినతిపత్రాలను జగ్గారెడ్డి కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్లు, అధికారులు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్లు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వహయాంలో ప్రతి ఒక్కరూ నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం, మంత్రులు, అధికారులను కూడా కలవలేని దుస్థితి నెలకొన్నదన్నారు.  సంగారెడ్డి కలెక్టర్‌ను తాను అపాయింట్‌మెంట్‌ కోరినప్పటికీ స్పందించలేకపోయారని, ప్రజావాణిలో కలవాల్సిన పరిస్థితి నెలకొన్నదని అసహనం వ్యక్తం చేశారు. ‘యథారాజాతథాప్రజా’ అన్న చందంగా అఽధికారుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని జగ్గారెడ్డి అన్నారు. 

Updated Date - 2022-06-28T05:16:46+05:30 IST