గరం గరంగా కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-05-20T05:43:34+05:30 IST

గరం గరంగా కౌన్సిల్‌ సమావేశం

గరం గరంగా కౌన్సిల్‌ సమావేశం
సమావేశంలో పాల్గొన్న సభ్యులు, మాట్లాడుతున్న మేయర్‌ గుండు సుధారాణి

సమస్యలపై ధ్వజమెత్తిన అధికారపక్ష కార్పొరేటర్లు

పరస్పరం వాగ్బాణాలు.. మేయర్‌ తీరుపై గుర్రు

తాగునీటి సమస్యపై తీవ్ర అసంతృప్తి

ఐదు అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం

చర్చనీయాంశంగా మారిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల తీరు


జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), మే 19 : జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశం అధికారపక్ష కార్పొరేటర్ల మధ్య వైరుఽధ్యాలకు వేదికగా మారింది. గులాబీ కార్పొరేటర్ల నడుమ అనుకూల, ప్రతికూల స్పందనలు వ్యక్తమయ్యాయి. ప్రజాసమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందుతున్నామనే అసంతృప్తులు వెల్లడయ్యాయి. ఒకరు అవునంటే మరొకరు వ్యతిరేకించడంతో సభ వేడెక్కింది. 

 సమావేశంలో గులాబీ కార్పొరేటర్ల వైరుధ్య పాత్రలను చూసి కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్లు ఖంగుతిన్నారు. తమ ప్రతిపక్ష పాత్రను అధికార కార్పొరేటర్లలోని ఒక వర్గమే పోషించడంపై నివ్వెరపోయారు. అంతలోనే తేరుకొని అధికార పక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గళమెత్తారు. ఇలాంటి వాడి వేడి పరిణామాలతో జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్‌ సమావేశం కొనసాగింది. 

మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశం అద్యంతం వాదోపవాదాలతో నడిచింది. మొత్తంగా సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని ఐదు అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. పట్టణ ప్రగతి, హరితహారాన్ని విజయవంతం చేద్దామని సమావేశం పిలుపునిచ్చింది. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కమిషనర్‌ ప్రావీణ్య ఇతర జీడబ్ల్యూఎంసీ అధికారులు, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 


అధికారపక్ష నేతల వైరుధ్యం

జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యల ప్రస్తావన సందర్భాల్లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల మధ్యనే వైరుధ్యాలు బయటపడ్డాయి. భిన్నమైన వాదనలు వినిపించుకుంటూ కార్పొరేటర్లు ఒకరినొకరు నిందించుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా విషయంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండేటి నరేంద్రకుమార్‌ తాగునీటి సరఫరా వరంగల్‌లో బాగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మేయర్‌ గుండు సుధారాణితో పాటు కార్పొరేటర్‌ ఇండ్ల నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ డివిజన్‌ గురించి మాట్లాడండి.. నగరం గురించి ఎందుకంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో నరేందర్‌తో పాటు 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ దిడ్డి కుమారస్వామి, మిగతా కొందరు తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. మాట్లాడడానికే అవకాశం ఇవ్వడం లేదంటూ గులాబీ కార్పొరేటర్లు కొందరు అసంతృప్తికి గురయ్యారు. 


ప్రజా సమస్యలపై..

ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ అధికార పక్ష కార్పొరేటర్లే అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావడం లేదని, లీకేజీలు అరికట్టడం లేదని గళమెత్తారు. తాగునీటితో పాటు గతంలో గుర్తించిన పట్టణ ప్రగతి పనులు కూడా పరిష్కారం కాలేదన్నారు. దీనిపై కాంగ్రెస్‌ కార్పొరేటర్లు తోట వెంకన్న, జక్కుల రవీందర్‌యాదవ్‌తో పాటు బీజేపీ కార్పొరేటర్‌ కోమల, అనిల్‌ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే జూన్‌లో ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్లేదని ప్రశ్నించారు. శ్మశానవాటికల నిర్మాణాలు విస్తరించాలని, ఉన్న వాటిలో సమస్యలు పరిష్కరించాలన్నారు. వీధి దీపాలు లేవని, అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. 


అధికారులపై ఆగ్రహం

బల్దియా, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారులపై కార్పొరేటర్లు మండిపడ్డారు. డివిజన్లలో తాగునీరు, లీకేజీల సమస్యలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ కార్పొరేటర్‌ సురే్‌షజోషి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామగ్రి లేదంటూ అధికారులు చేతులెత్తేయ్యడం ఏమిటని మండిపడ్డారు. కార్పొరేటర్ల వాదనలు విన్న మేయర్‌ సుధారాణి అధికారులను నిలదీశారు. పలుమార్లు సమీక్షా సమావేశాల్లో తాను హెచ్చరించినా తీరు మారడం లేదంటూ ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా సమస్యలు వస్తున్నాయం టూ అధికారులపై ఫైర్‌ అయ్యారు. తీరు మారని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 


కార్పొరేటర్‌ రాజు ఆగ్రహం

వడ్డెపల్లిలో శ్మశానవాటికకు స్థలం కేటాయించిన వ్యక్తికి బదులుగా న్యూశాయంపేటలో ప్రభుత్వ భూమి కేటాయింపు అంశంపై 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ మామిళ్ల రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో ఈ అంశాన్ని ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌తోపాటు మరికొందరు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లే వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు. నాడు వద్దని, తిరిగి ఈ అంశానికి ఆమోదం తెలుపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రభుత్వ భూములు అప్పనంగా పోతాయని మండిపడ్డారు. ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ అజెండా కాపీని రాజు చించివేశారు. ఆగ్రహంతో సమావేశం నుంచి వాకౌట్‌ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌ యాదవ్‌, తోట వెంకన్న కూడా భూమి కేటాయింపును నిరసించారు. 


రూ.396 కోట్లతో అభివృద్ధి పనులు : గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ మేయర్‌

పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం వ్యవధిలోనే రూ.396 కోట్లతో 993 వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. సమగ్రాభివృద్ధి దిశగా నగరం వేగంగా అడుగులు వేస్తోంది. పట్టణ ప్రగతి ద్వారా దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు స్థానంలో 1,900 స్తంభాలను ఏర్పాటు చేశాం. 66 డివిజన్లలో హైమాస్‌ లైట్లు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. 150 కేఎల్‌డీ సామర్ధ్యంతో అమ్మవారిపేటలో మరో ఎఫ్‌ఎ్‌సటీ ప్లాంటు నిర్మాణమవుతోంది. నర్చరింగ్‌ నైబర్‌హుడ్‌ చాలెంజ్‌లో దేశంలోనే ఎంపికైన టాప్‌ టెన్‌ నగరాల్లో వరంగల్‌కు స్థానం దక్కింది. నగరంలోని 66 డివిజన్లలో ప్రతీ రోజు 24 గంటల పాటు తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు రూ.350 కోట్లతో డీపీఆర్‌ సిద్ధమైంది. రాంపూర్‌లో రూ.38కోట్ల వ్యయంతో బయోమైనింగ్‌ ప్లాంట్‌ నిర్మాణమవుతోంది. ఏడాది వ్యవధిలోనే ప్రతీ డివిజన్‌కు రూ.50 లక్షల అభివృద్ధి పనులు ప్రత్యేకంగా మంజూరు చేశాం. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల విజయవంతానికి సమష్టిగా కృషి చేద్దాం.

Updated Date - 2022-05-20T05:43:34+05:30 IST