చెత్తా చెదారం.. దుర్వాసన!

ABN , First Publish Date - 2022-01-18T04:44:15+05:30 IST

ఎటుచూసినా చెత్త చెదారం... మరోవైపు దుర్గంధం..

చెత్తా చెదారం.. దుర్వాసన!
దర్గాలో పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం

  • జేపీ దర్గా పరిసరాల దుస్థితి
  • 20నుంచి ఉర్సు ఉత్సవాలు
  • ఎలాంటి చర్యలు చేపట్టని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు


కొత్తూర్‌: ఎటుచూసినా చెత్త చెదారం... మరోవైపు దుర్గంధం.. ఇదీ హజ్రత్‌ జహంగీర్‌ పీర్‌ దర్గా పరిసరాల్లో నెలకొన్న దుస్థితి. కొత్తూర్‌ మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామశివారులో గల దర్గా రాష్ట్రంలోనే పేరుగాంచినదిగా గుర్తింపు ఉంది. ఈనెల 20నుంచి మూడు రోజులపాటు దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు దగ్గర పడుతున్నా దర్గా పరిసరాల్లో నెలకొన్న చెత్తాచెదారాన్ని తొలగించేందుకు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు దర్గా పరిసరాలు కంపు కొడుతుండడంతో ఉత్సవాలకు రావాలంటేనే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దర్శనానికి వచ్చిన సమయంలో రూ.50కోట్లతో జేపీ దర్గాను మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. అయితే కేసీఆర్‌ ప్రకటన చేసి సంవత్సరాలు గడుస్తున్నా మాస్టర్‌ ప్లాన్‌ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. దర్గాలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. దర్గా పరిసరాల్లో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్తాచెదారంతో దర్గా పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. గతంలో దర్గా దర్శనం కోసం వచ్చిన ఓ బాలుడు మురుగునీటి గుంతలో పడి మృతి చెందాడు. అయినా ఉర్సుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక భక్తులు బహిరంగ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జేపీదర్గా నుంచి రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా.. దర్గా అభివృద్ధికి వక్ఫ్‌బోర్డు నిధులు కేటాయించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం

రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దర్గా పరిసరాలు కంపు కొడుతున్నాయి. దర్గా నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా.. అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. దర్గా పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి ఉండటంతో భక్తులు రావడానికి జంకుతున్నారు. మరుగుదొడ్ల కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉర్సు ఉత్సవాలు దగ్గర పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి.

- సయ్యద్‌ రషీద్‌, ఇన్ముల్‌నర్వ



Updated Date - 2022-01-18T04:44:15+05:30 IST