అజిత్‌సింగ్‌నగర్ జీప్లస్‌త్రీ గృహాలకు అతిసమీపంలో ఉన్న చెత్త నిల్వలు
దుర్వాసన భరించలేక అజిత్‌సింగ్‌నగర్ వాసుల అవస్థలు.. సమస్యను పరిష్కరించాలని వేడుకోలు
అజిత్‌సింగ్‌నగర్, మార్చి 27: పరిసరాలలు పరిశుభ్రంగా ఉంచండి..స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కండి.. అంటూ అవకాశం లభించినప్పుడల్లా ప్రసంగాలు చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు జనావాసాల మధ్య డంప్ చేస్తున్న చెత్తను తొలగించడంలో మాత్రం ప్రేక్షకపాత్ర పోషించడంపై అజిత్‌సింగ్‌నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుంచి ఎరువుల తయారీ కర్మాగారం ఎక్సెల్ ప్లాంటు ఏర్పాటుతో పాతికేళ్ల క్రితం అజిత్‌సింగ్‌నగర్ వాసులకు మొదలైన చెత్త సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. 2014 ఎన్నికలకు ముందు యార్డురోడ్డులోని చెత్త,ట్రాన్స్ఫర్ స్టేషన్ ఆవరణలో కొండలను తలపించేలా లక్షల టన్నులు నిల్వ ఉండేది. అప్పటి ఎన్నికలకు ముందే అధికారంలోకి వస్తే చెత్త తొలగిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రోజుల వ్యవధిలోనే డంపింగ్‌యార్డును సందర్శించారు. చెత్తను శాస్ర్తీయ పద్ధతిలో తొలగించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. 2019 మార్చి వరకు చెత్త తరలింపు ప్రక్రియ బాగానే జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా చెత్త నిల్వలు పేరుకుపోయాయి. ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు సమీపంలోనే వేలాది నివాస గృహాలు ఉన్నాయి. సమస్య జఠిలంగా ఉన్న సమయంలో కమ్యూనిస్టులు ఆందోళనలు చేయడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం మినహా చెత్త సమస్య పరిష్కారం కావడం లేదు. అజిత్‌సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు, బీరువా, కొలిమి కార్మికులు, జీప్లస్‌త్రీ నివాసాల ప్రజలకు చెత్త సమస్య శాపంగా మారింది. కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి చెత్త సమస్యను పరిష్కరించాలని అజిత్‌సింగ్‌నగర్ ప్రజలు కోరుతున్నారు.